బిజెపి నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్పొరేటర్‌లా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఓట్ చోర్…గద్దీ చోడ్ పేరిట ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేపడితే, దానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎంపి చామల మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఓట్ల చోరీ ఎలా జరిగిందో రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారని ఆయన తెలిపారు. ఒకే ఇంటిపై వంద ఓట్లు ఉన్నాయని, ఒకే పబ్బుపై 78 ఓట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో దొంగ ఓట్ల గురించి కూడా చెప్పామని, ప్రస్తుతం బీహార్‌లో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇతర నాయకులూ పాదయాత్ర చేస్తున్నారని ఆయన తెలిపారు.
దీనిపై పార్లమెంటులో చర్చ జరగాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే దొంగ ఓట్ల వ్యవహారం బయట పడుతుందన్న భయంతో చర్చ చేపట్టడం లేదని ఆయన విమర్శించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ విలేకరుల సమావేశం నిర్వహించి రాజకీయాలు మాట్లాడారని, జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాట వేశారని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓట్ల చోరీ గురించి మాట్లాడకుండా కేవలం కరీంనగర్‌లోని స్థానిక సమస్యల గురించి మాట్లాడుతున్నారని ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శించారు.