Tuesday, August 26, 2025

రూ. 33 కోట్ల చేనేత రుణాలను మాఫీ చేస్తాం: మంత్రి తుమ్మల

- Advertisement -
- Advertisement -

దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన నేతన్న పొదుపు, బీమా పథకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చేనేత జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్‌పి మహేష్ బి గితే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ..నేత కార్మికులకు గడిచిన పదేళ్ల కాలంగా ఉన్న బకాయిలను ప్రజా ప్రభుత్వం విడుదల చేస్తుందని అన్నారు. నేత కార్మికుల కోరిక మేరకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. నేతన్న చేయూత, నేతన్న బీమా వంటి అనేక పథకాల బకాయిలు జమ చేస్తున్నామని అన్నారు. రూ.33 కోట్లు చేనేత రుణాలను రాబోయే క్యాబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టి మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు.వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేసి ఇప్పటివరకు 2,500 మెట్రిక్ టన్నుల నూలు దారం వంద సొసైటీలకు అందించామని అన్నారు.

వస్త్ర పరిశ్రమలో ఆధునిక సాంకేతికతను పెంచేందుకు హ్యాండ్లూమ్ యూనివర్సిటీ, ఐఐహెచ్‌టి ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. మహిళలు గౌరవంగా స్వీకరించేలా నాణ్యమైన చీరలు తయారుచేయాలని రూ.450 ఒక్కో చీరపై ఖర్చు చేస్తూ 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరల చొప్పున పంపిణీ చేయనున్నామని తెలిపారు. ఆర్థిక వ్యవస్ధ ఇబ్బందికరంగా ఉన్నా పేద ప్రజలపై పన్నుల భారం మోపకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. చేనేత పవర్‌లూమ్ కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని అన్నారు. విద్యపై సిఎం ప్రత్యేక శ్రధ్ధ పెట్టారని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యేకంగా అభివృధ్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌ఛార్జి కెకె మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, చేనేత జౌళి శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News