రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 4,454 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. 880 మంది స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్ 2 గెజిటెడ్ హెడ్‌మాస్టర్లుగా పదోన్నతులు కల్పించించింది. అందులో మల్లీజోన్ 1లో 490 మంది, మల్టీజోన్ 2లో 390 మంది పదోన్నతులు పొందారు. 3,574 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు ఇవ్వగా, 811 మందికి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు ఇచ్చింది. అదేవిధంగా 2,763 మంది ఎస్‌జిటిలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పాఠశాల విద్యాశాఖ పదోన్నతులు కల్పించింది. షెడ్యూల్ ప్రకారం సకాలంలో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు. పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు 15 రోజులలోగా పదోన్నతి పొందిన పోస్టులు చేరాలని పేర్కొన్నారు.
భవిష్యత్తులో కూడా ఖాళీల మేరకు కాలానుగుణంగా టీచర్ల అర్హతల మేరకు ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు అందుబాటులోకి రావడం కీలకంగా మారనుందని అన్నారు. ప్రస్తుతం విద్యాశాఖకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే మంత్రిగా ఉన్నారు. విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే తన లక్ష్యమని సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇతరులకు ఇస్తే శాఖను పట్టించుకుంటారో లేదో అనే సందేహాంతో తన వద్దే ఉంచుకున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలల్లో రెగ్యులర్ ప్రధానోపాధ్యాయలు లేకపోవడంతో పలు సమస్యలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా పదోన్నతులతో పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు అందుబాటులోకి రానున్నారు. ఉపాధ్యాయులకు షెడ్యూల్ ప్రకారం పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.