భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగి పడడంతో జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లలోనూ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ లోనూ జనజీవనం అస్తవ్యస్తం అయింది. నదులు ఉప్పొంగాయి, రహదారులు కొట్టుకుపోయాయి. మేఘాలు విరుచుకుపడడంతో వరదలు సంభవించాయి. ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలను వరదలు ముంచెత్తగా,జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లో పలుచోట్ల కొండచరియలు విరుచుకుపడ్డాయి.జమ్మూకశ్మీర్ లో 9 మంది చనిపోయారు. వైష్ణవ్ దేవీ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగి పడడంతో ఐదుగురు చనిపోయారు. 14 మంది గాయపడ్డారు. యాత్రను నిలిపివేశారు. దోడా ప్రాంతంలో మేఘ విస్ఫోటనం తో వరదలు సంభవించాయి. పది ఇళ్లు నేలమట్టమై, నలుగురు చనిపోయారు. భారీ వర్షాలతో జమ్మూకశ్మీర్ కుదేలయింది. కథువా, కిష్త్వార్ లలోనూ మేఘవిస్ఫోటనాలు సంభవించాయి. కథువా, సాంబా, జమ్మూ, రాంబన్, కిష్త్వార్ లతో సహా జమ్మూ ప్రాంతం అంతా హై అలర్ట్ ప్రకటించారు.
జమ్మూలో అన్నిస్కూళ్లు, ప్రభుత్వకార్యాలయాలను మూసివేశారు. సైన్యం రంగంలోకి దిగింది. పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. జమ్మూ – శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను నిలిపివేశారు. స్థానిక వాగు ఉప్పొంగడంతో దోడా జిల్లాలోని కీలకమైన రహదారి కొట్టుకు పోయింది. తావి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.నదులు, వాగులతో నీటమట్టాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు హెచ్చరించారు. సైన్యం రక్షణ, సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది. ప్రాణనష్టం నివారించేందుకు,పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వర్షాల కారణంగా చాలా చోట్ల ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్స్ దెబ్బతినడంతో నెట్ వర్క్ కు అంతరాయం కలిగింది.ఉత్తర రైల్వే కట్రా, ఉధంపూర్, జమ్మూరైల్వే స్టేషన్లకు వెళ్లే 18 రైళ్లను రద్దు చేశారు.