Wednesday, August 27, 2025

ఆర్థికానికి ప్రమాద ఘంటికలు

- Advertisement -
- Advertisement -

తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉద్యోగుల తొలగింపు (Layoff) అంటే ఆర్థిక సవాళ్లు లేదా పని లేకపోవడంవల్ల ఉద్యోగులను పని నుండి తీసివేయడం. ఈ భావన 1980 -90లలో వాటాదారుల విలువను పెంచడానికి ఖర్చు తగ్గించే వ్యూహంగా, విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. ఇది కంపెనీలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చినప్పటికీ, ఉద్యోగుల తొలగింపులు తరచుగా అనిశ్చితిని సృష్టించడం, ఉద్యోగ భద్రతను తగ్గించడం, ఉద్యోగుల ప్రేరణను, ధైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఇటీవల కార్పొరేట్ సంస్థలు ఆర్థిక ఒత్తిళ్లు, పెట్టుబడిదారుల డిమాండ్లు, పునర్నిర్మాణం, కృత్రిమ మేధస్సు(ఎఐ), క్లౌడ్ కంప్యూటింగ్, స్థిరత్వం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల వైపు మారడం వల్ల ఉద్యోగుల తొలగింపులను అమలు చేస్తున్నాయి.

అదే సమయంలో కాలం చెల్లిన సాంకేతికతలతో ముడిపడి ఉన్న పద్ధతులు, ప్రక్రియలను దశలవారీగా తొలగిస్తున్నాయి. మహమ్మారి కారణంగా చాలా కంపెనీలు ఉద్యోగులను అధికంగా నియమించుకున్నారు. ఇప్పుడు ఉద్యోగులను తగ్గిస్తున్నారు. అదనంగా, ఆటోమేషన్, నైపుణ్య అసమతుల్యత, తరచుగా కంపెనీల విలీనాలు, పేలవమైన ఆర్థిక పనితీరు, నాయకత్వ మార్పుల ద్వారా ఉద్యోగుల తొలగింపు జరుగుతున్నది. ఇటీవల, పరిశ్రమలలోని అనేక ప్రధాన సంస్థలు గణనీయమైన తొలగింపులను ప్రకటించాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేసింది. ఆర్థిక మందగమనం, వేగవంతమైన సాంకేతిక మార్పుల వల్ల ప్రపంచవ్యాప్త ధోరణిని ప్రతిబింబిస్తూ, భారతదేశం, మెక్సికో వంటి దేశాలపై కూడా తొలగింపులు ప్రభావం చూపాయి. టెక్ రంగంలో, మైక్రోసాఫ్ట్ (15,000+తొలగింపులు), ఇంటెల్ (15% శ్రామికశక్తి), గూగుల్ (<1% శ్రామికశక్తి) వంటి కంపెనీలు గణనీయమైన ఉద్యోగ కోతలు విధించాయి.

భారతదేశంలో అతిపెద్ద ఐటి సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) తన శ్రామిక శక్తిని 2%(~12,000 ఉద్యోగాలు) తగ్గిస్తోంది. అమేజాన్, మెటా, సిస్కో Amazon, Meta(10,000 ఉద్యోగ విరమణలు), సిస్కో (Cisco), డెల్(Dell) కూడా తగ్గించుకున్నాయి. టెక్ సంస్థలతోపాటు, పిడబ్లుసి (Price Waterhouse Coopers) 1,500మంది అమెరికా ఉద్యోగులను తొలగించింది. రిటైల్, మీడియా (ఉదా., డిస్నీ, సిఎన్‌ఎస్), బయోటెక్ /ఫార్మా రంగాలు కూడా ఆర్థిక ఒత్తిళ్లు, కృత్రిమ మేధస్సు (ఎఐ) ఏకీకరణ, వ్యూహాత్మక మార్పుల కారణంగా విస్తృతమైన కోతలను చవిచూశాయి.

వీడియో గేమ్ పరిశ్రమ 2022 నుండి 2025 మధ్యకాలం వరకు 35,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను కోల్పోయింది. 2025 మొదటి ఐదు నెలల్లో అమెరికాలోనే దాదాపు 7,00,000 ఉద్యోగాలు పోయాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 80% పెరుగుదలను సూచిస్తుంది. 2025లో కూడా టెక్ లేఆఫ్ బలంగా ఉంది, 2024తో పోలిస్తే ఎక్కువ ఉద్యోగాల తగ్గింపు ధోరణిని కొనసాగిస్తోంది. స్వతంత్ర ట్రాకర్ లేఆఫ్ఫై (Layoffs.fyi) ప్రకారం, గత సంవత్సరం 549 కంపెనీలలో 1,50,000 కంటే ఎక్కువ టెక్ ఉద్యోగాలు తొలగించబడ్డాయి. 2025లో ఇప్పటివరకు 22,000 కంటే ఎక్కువ టెక్ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు, ప్రతి నెలా తొలగింపులు జరుగుతున్నాయి. జనవరిలో 2,403 మంది, ఫిబ్రవరిలో 16,234 మంది, మార్చిలో 8,834 మంది, ఏప్రిల్‌లో 24,500 మంది, మేలో 10,397 మంది, జూన్‌లో 1,606 మంది, జులైలో 16,142 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటనలు ఉన్నాయి. ఈ వివరాలు టెక్ రంగంలో కొనసాగుతున్న అస్థిరతను నొక్కి చెబుతున్నవి.

ఆకస్మిక తొలగింపులు ఉద్యోగులకు మాత్రమే కాకుండా చాలా విస్తృతమైన పరిణామాలను కలిగి ఉంటాయి. తరచుగా కార్మికులకు ఆర్థిక అస్థిరత, ప్రయోజనాల నష్టం ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. కెరీర్ అంతరాయాలు సర్వసాధారణం. ముఖ్యంగా విస్తృతమైన కోతలను ఎదుర్కొంటున్న పరిశ్రమలలో, వ్యక్తులు తక్కువ జీతం లేదా సంబంధం లేని ఉద్యోగాలలోకి బలవంతంగా పంపబడతారు. కంపెనీలు కూడా తమంతట తాముగా ప్రతిష్ఠకు నష్టం, ఉత్పాదకత కోల్పోవడం, మిగిలిన సిబ్బందిలో తక్కువ నైతికత, చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవచ్చు. విస్తృత స్థాయిలో ఉద్యోగుల తొలగింపులు అధిక నిరుద్యోగానికి, వినియోగదారుల ఖర్చు తగ్గడానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థలకు హాని కలిగించడానికి దోహదం చేస్తాయి.

ఫలితంగా మార్కెట్ అస్థిరత కూడా ఉండవచ్చు, సామాజికంగా ఉద్యోగుల తొలగింపులు అసమానతను తీవ్రతరం చేస్తాయి. ప్రజల నమ్మకాన్ని తగ్గిస్తాయి. బలమైన కార్మిక రక్షణలు, నియంత్రణ సంస్కరణల కోసం ఆందోళనలు రేకెత్తిస్తాయి. 2025లో భారతదేశం ముఖ్యంగా టెక్, స్టార్టప్ సమాచారం, సాంకేతికత (ఐటి) సేవల రంగాలలో గణనీయమైన తొలగింపులను చవిచూసింది. ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లు, ఎఐ ఆధారిత ఆటోమేషన్, నిధుల కొరత కార్పొరేట్ పునర్నిర్మాణం కారణంగా ఇది జరిగింది. సమాచారం, సాంకేతికత (ఐటి), సాఫ్ట్‌వేర్ సేవలలో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) 12,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది – ఇది ఇప్పటివరకు అతిపెద్ద తగ్గింపు అయితే ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హిందుస్తాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్‌ఎల్‌సి) సంస్థలు టెక్ మార్జిన్ ఒత్తిళ్లు, ప్రపంచ ఒప్పందాలను ఆలస్యం చేయడం వల్ల నియామకాలను తగ్గించాయి లేదా సిబ్బందిని తొలగించాయి.

పునర్నిర్మాణంలో భాగంగా కాగ్నిజెంట్ ఇండియా కూడా మిడిల్-మేనేజ్‌మెంట్ నియామకాలను తగ్గించింది. ప్రధాన నిధుల కొరతను ఎదుర్కొంటున్న స్టార్టప్ వ్యవస్థ ఆగస్టు 2025 నాటికి 17,000 కంటే ఎక్కువ తొలగింపులను చూసింది. బైజస్, ఓలా ఎలక్ట్రిక్, జొమాటో (బ్లింకిట్), ఉడాన్, మీషో, షేర్‌చాట్, అనాకాడెమీ వ్యాపార పునర్వ్యవస్థీకరణ కారణంగా ఉద్యోగ కోతలు విధించాయి. ఫిన్‌టెక్‌లో, పెటిఎం, రేజర్‌పే, ఫోన్‌పే ముఖ్య కార్యకలాపాలు, బ్యాకెండ్లలో సిబ్బందిని తొలగించాయి. వీటిని తరచుగా ఎఐ భర్తీ చేసింది.

రిటైల్, ఇ- కామర్స్‌లో, రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా వంటి సంస్థలు విస్తృత ఖర్చు, వ్యూహాత్మక సర్దుబాట్లలో భాగంగా బ్యాకెండ్ నియామకాలను నిశ్శబ్దంగా తగ్గించాయి. ఆర్థిక అనిశ్చితి, తరచుగా కార్పొరేట్ పునర్నిర్మాణాలు జరిగే సమయాల్లో, ఉద్యోగులు తమ వృత్తిపరమైన భవిష్యత్తును కాపాడుకోవడానికి చురుకైన కెరీర్ రక్షణ వ్యూహాలను అవలంబించడం చాలా అవసరం. ముఖ్యంగా, ఎఐ, సైబర్ సెక్యూరిటీ, క్లీన్ టెక్, డీప్ టెక్ వంటి అధిక- వృద్ధి రంగాలు చురుకుగా నియామకాలను కొనసాగిస్తున్నాయి, శిక్షణ, కెరీర్ పరివర్తనకు ఆశాజనకమైన మార్గాలను అందిస్తున్నాయి.

డాక్టర్. పి.ఎస్. చారి, 83090 82823

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News