Wednesday, August 27, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అమిత్ షా దుమారం!

- Advertisement -
- Advertisement -

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్‌ను గెలిపించుకోవడానికి ఎన్‌డిఎకు స్పష్టమైన ఆధిక్యం ఉండటంతో ప్రతిపక్షాలు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కేవలం తన ఉనికి కోసమే ఓ రాజకీయేతర అభ్యర్థిని పోటీకి తీసుకు వచ్చారని అందరూ భావించారు. అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గురించి హోమ్ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. నేడు దేశంలో ఇంకా నక్సల్ సమస్య కొనసాగడానికి ఆయన 14 ఏళ్ళ క్రితం ఇచ్చిన తీర్పు కారణం అంటూ ఆయన ఆరోపణలు చేయడం అందరినీ విస్మయానికి గురిచేశాయి. తనను అభ్యర్థిగా ప్రకటించగానే ఈ పోటీని వ్యక్తుల మధ్య పోటీగా భావించడం లేదని, సైద్ధాంతిక పోరాటంగా భావిస్తున్నానని అంటూ సుదర్శన రెడ్డి ఎంతో హుందాగా వ్యవహరించారు. పైగా, ఆ తీర్పు తన వ్యక్తిగత తీర్పు కాదని, సుప్రీంకోర్టు తీర్పు అంటూ మర్యాదగా స్పందించారు.

అయితే అంతటితో ఆగకుండా అమిత్ షాతో పాటు మరికొందరు బిజెపి నేతలు వ్యక్తిగత దూషణలకు దిగడంతో నక్సల్ సమస్యపై ఈ ప్రభుత్వ విధానం ఏమిటి? అనే ప్రశ్న తలెత్తుతుంది. అసలు సల్వా జుడం అంటే ఏమిటనే ప్రశ్నలు నేడు మరోసారి తలెత్తుతున్నాయి. 2000 వ దశకం ప్రారంభంలో దేశంలో 200కు పైగా జిల్లాలు నక్సల్స్ హింసాకాండతో రగిలిపోతున్నాయి. ఆ సమయంలో చత్తీస్‌గఢ్ అత్యంత ప్రభావితమైన రాష్ట్రాలలో ఒకటి. తీవ్ర హింసను చూసింది. అధికారిక గణాంకాల ప్రకారం, 2005 నుండి 2011 మధ్య, బస్తర్‌లోనే 1,019 మంది గ్రామస్థులు, 726 మంది భద్రతా సిబ్బంది, 422 మంది మావోయిస్టులు మరణించారు.

నక్సల్స్ విసిరిన భద్రతా సవాళ్లకు ప్రతిస్పందనగా, చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సల్వా జుడుం (గోండిలో ‘శాంతి యాత్ర’) అనే అప్రమత్త ఉద్యమాన్ని నిర్వహించింది. స్థానిక గ్రామస్థులను కోయా కమాండోలు అని కూడా పిలువబడే ఎస్పీలను సాయుధ సమూహాలుగా సమీకరించింది. స్థానిక కాంగ్రెస్ నాయకుడి నేతృత్వంలో ఈ ఉద్యమం ప్రారంభం కాగా, నాటి రామన్ సింగ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేసింది. కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం అండగా నిలబడింది. అయితే అప్పుడే ఈ ప్రయత్నం అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు గురయింది. గిరిజన యువకులను, కొందరు మైనర్‌లను సైతం, చాలా మంది 5వ తరగతి కన్నా ఎక్కువగా చదవని వారికి ఆయుధాలు సమకూర్చి, కొద్దిపాటి శిక్షణతో ‘ఆత్మరక్షణ’ పేరుతో నక్సల్స్‌పై పోరుకు ఉసిగొల్పడం కలకలం రేపింది.

2011లో నందిని సుందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ చత్తీస్‌గఢ్ కేసులో జస్టిస్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం, చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు తిరుగుబాటును ఎదుర్కోవడానికి గిరిజన యువతను ప్రత్యేక పోలీసు అధికారులుగా ఉపయోగించే పద్ధతికి ముగింపు పలికింది. జస్టిస్ రెడ్డి సల్వా జుడుం తీర్పును వెలువరించకపోతే ‘2020 నాటికి నక్సల్ ఉగ్రవాదం అంతమై ఉండేది’ అని షా ఇప్పుడు చెబుతున్నారు. న్యాయపరమైన తీర్పును న్యాయమూర్తి వ్యక్తిగత అభిప్రాయాలతో సమానంగా పరిగణించడం కలకలం రేపింది.

పైగా, నక్సలైట్లకు గట్టి మద్దతుదారుడైన సుదర్శన్ రెడ్డిని ‘ఇండియా’ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం వెనుక వామపక్షాల ఒత్తిడి ఉందని కూడా అమిత్ షా ఆరోపించారు. సల్వాజుడుం కేసు తీర్పులో నక్సలిజాన్ని గానీ, దాని భావజాలాన్ని గానీ ఎక్కడా సమర్ధించినట్లు న్యాయమూర్తి పేర్కొనలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు గౌరవప్రదంగా, భావజాల కేంద్రీకృతంగా జరగాల్సిన ఎన్నికలని పేర్కొంటూ ఉపరాష్ట్రపతి ఎన్నికలు వ్యక్తుల మధ్య జరగవని, అయినప్పటికీ అత్యున్నత పదవిలో ఉన్న హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు దేశ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉన్నాయని అంటూ పలువురు మాజీ న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

పైగా, ఇది సుప్రీం కోర్టు న్యాయమూర్తులపైనా ప్రభావం చూపనుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ఉపరాష్ట్రపతి ఎన్నికను గౌరవప్రదంగా భావించాలని, వ్యక్తిగత దూషణలు, పేరుపెట్టి అవమానించడం వంటి అసభ్య రాజకీయాలకుచోటు ఉండకూడదనీ అమిత్ షాకు హితవు పలికారు. కరడుగట్టిన సోషలిస్టుగా పేరొందిన సుదర్శన్ రెడ్డి ఎల్లప్పుడూ వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్రం, సామాజిక న్యాయం, రాజ్యాంగపరమైన హక్కులకు కట్టుబడి ఉండే వ్యక్తిగా పేరొందారు.

ఈ సందర్భంగా ఎన్‌డిఎ అభ్యర్థి రాధాకృష్ణన్ ఎన్నడూ పౌరుల స్వేచ్ఛ, స్వాతంత్య్రం, రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధత ప్రదర్శించిన దాఖలాలు లేవు. జార్ఖండ్ గవర్నర్ గా ఇడి దాడుల అనంతరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు వచ్చిన హేమంత్ సొరేన్‌ను ఆ వెంటనే రాజ్‌భవన్ ఆవరణలోనే అరెస్ట్ చేస్తే ఆయన ప్రేక్షకునిగా మిగిలిపోయారు. రాజ్‌భవన్ గౌరవం కాపాడటం కోసం బైటకు వచ్చే వరకు ఆగితే తానే లొంగిపోతానని చెప్పినా వినిపించుకోలేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు తిరిగి సోరెన్‌ను ముఖ్యమంత్రిగా చేయడం గమనిస్తే నాటి గవర్నర్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు స్పష్టం అవుతుంది.

ప్రజాస్వామ్యంలో విభిన్న సైద్ధాంతిక ప్రవాహాలకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే తమ లక్ష్య సాధనకు ఆయుధాలను, హింసను ఓ మార్గంగా మావోయిస్టులు ఎంచుకోవడమే అభ్యంతరకరం. అందుకనే అటువంటి సంస్థలపై నిషేధం విధిస్తున్నారు. వాస్తవానికి మావోయిస్టుల అంశంపై బిజెపి జాతీయ స్థాయిలో ఎన్నడూ స్పష్టమైన ఓ విధానం ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో మావోయిస్టుల హింసకు ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు బలవుతున్న సందర్భంగా ‘సైద్ధాంతిక పోరాటం’ చేశారు గాని, జాతీయ స్థాయిలో చేయలేదు.

వాజపేయి హయాంలో ఎపి నుండి కొందరు ప్రముఖులు నక్సల్ సమస్యపై కేంద్ర ప్రభుత్వం ఓ విధానం అనుసరించాలని నాటి హోంమంత్రి ఎల్‌కె అద్వానీని కలిసి సూచిస్తే, ఆయన చాలా తేలికగా కొట్టిపారవేసారు. ఎటువంటి ఆసక్తి చూపలేదు. దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద అంతర్గత శాంతిభద్రతల సమస్య నక్సలిజం అని మొదటగా చెప్పిన ప్రధాని మన్మోహన్ సింగ్ అని గుర్తుంచుకోవాలి. దేశం నుండి నక్సలిజాన్ని తుడిచిపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పని చేయాలి అంటూ మొదటగా ప్రణాళికాయుతంగా అడుగులు వేసింది హోం మంత్రిగా చిదంబరం. ఈ దిశలోనే ఎన్‌ఐఎను ఏర్పాటు చేశారు. ఆనాడు చిదంబరం ప్రయత్నాలను నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో సహా బిజెపి ముఖ్యమంత్రులు వ్యతిరేకించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దళాలు ఉమ్మడిగా నాడు ప్రారంభించిన వేట కారణంగానే నేడు అమిత్ షా మార్చి, 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని తుదముట్టిస్తామని చెప్పగలుగుతున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మరో అంశాన్ని గుర్తుంచుకోవాలి. కేవలం తుపాకీలతో, సాయుధ దళాలతో ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని తుదముట్టింపలేము. ఆ విధంగా ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. స్థానిక ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలి.

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుతో ఉగ్రవాదులను అణచివేశామని చెబుతున్నారు. అయితే సుమారు రెండు లక్షల మంది సాయుధ దళాలను ఇప్పుడు అక్కడ ఎందుకు మోహరింపల్సి వచ్చింది? కొద్ది రోజుల క్రితం ఆగస్టు 15న స్థానిక ప్రజలు ఎవ్వరూ లేకుండా కేవలం సాయుధ దళాల సమక్షంలో స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు జరపాల్సి వచ్చింది? సింహావలోకనం చేసుకోవాలి. 1992లో పంజాబ్ తీవ్రమైన ఉగ్రవాదం పిడికిలితో మగ్గుతున్న సమయంలో ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చిన బియాంత్ సింగ్, నాటి డిజిపి కెపిఎస్ గిల్ కలిసి స్థానిక ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని ఏ విధంగా ఉగ్రవాదాన్ని కట్టడి చేశారో ఓ సారి పరిశీలన చేసుకోవాలి.

కొద్ది రోజుల క్రితం హోం శాఖ సహాయమంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ నక్సల్స్‌తో చర్చలు అంటున్న వారిని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాలలో తీవ్రవాద బృందాలతో ఏ విధంగా చర్చలు జరిపి, శాంతియుత వాతావరణం నెలకొల్పే ప్రయత్నం జరిగిందో గుర్తెరగాలి. నాగాలాండ్‌లోని తీవ్రవాదులతో దశాబ్దంన్నర కాలంకుపైగా జపాన్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చలకు శ్రీకారం చుట్టింది వాజపేయి ప్రభుత్వం. ఈ చర్చల ప్రక్రియలో చివరి దూత ఆర్‌ఎన్ రవి నేడు తమిళనాడు గవర్నర్. నాగాలాండ్‌లో చర్చల ఫలితంగా భారత సైన్యంలో విలీనమైన తీవ్రవాద గ్రూపులకు చెందిన రెండు బెటాలియన్‌లు కార్గిల్ యుద్ధం సందర్భంగా వీరోచితంగా పోరాడి దేశభక్తిలో తమకు మరెవ్వరూ తీసిరారని నిరూపించారు.

జమ్మూకశ్మీర్‌లో 1980 దశకం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష విధానాల కారణంగా చెలరేగిన తీవ్రవాదం స్థానిక యువతకు పరిమితమై ఉండెడిది. నాడు పాకిస్తాన్ పంపిన సీమాంతర ఉగ్రవాదులతో వారు సాయుధ ఘర్షణలకు దిగేవారు. కానీ నాటి విపి సింగ్ ప్రభుత్వం స్థానిక యువతకు అండగా నిలబడకుండా, ఉగ్రవాదానికి ఆజ్యం పోసే విధంగా వ్యవహరించడంతో ఆ ప్రాంతం ఉగ్రవాదులకు ఆలంబనగా మారిపోయింది. తుపాకీతో ఏదైనా సాధింపవచ్చనే నక్సల్స్‌కు, అమిత్ షా నేడు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల మధ్య పెద్దగా తేడా కనిపించడం లేదు. ఇది దురదృష్టకరం.

చలసాని నరేంద్ర
98495 69050

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News