Thursday, August 28, 2025

భువనగిరిలో చిట్యాల రోడ్డుపై వరద… రాకపోకలకు అంతరాయం

- Advertisement -
- Advertisement -

సాహసాలు చేయొద్దు.. జిల్లా ప్రజలకు కలెక్టర్‌ హనుమంతరావు సూచన

మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి నల్లగొండ చిట్యాల వైపు నుంచి రామన్నపేట, వలిగొండ భువనగిరి మండలంలోని పలు గ్రామాల్లో నుంచి పూర్తిస్థాయిలో రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో సైతం జిల్లా కేంద్రానికి చేరుకోవడం కష్టతరంగా మారింది. అధికారులు నాయకులు ఇకముందైనా ముందుగా లోలెవెల్ కల్వర్టులను హైలెవెల్ బ్రిడ్జిలుగా మార్చాలని చుట్టుపక్కల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని నందనం, నాగిరెడ్డిపల్లి మధ్య ఉన్న లోతట్టు ప్రాంతం భారీ వర్షాల కారణంగా రోడ్డుపై పొంగి ప్రవహిస్తోంది. దీనివల్ల బుధవారం, గురువారం రెండు రోజులు పలు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి వచ్చిన వరద నీరుతో పాటు తుక్కపురం, గౌస్ నగర్, నమాత్ పల్లి గ్రామల చెరువులు అలుగుపారడంతో వరద భువనగిరి చిట్యాల రోడ్డుపైకి చేరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో భారీ కేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో గ్రామస్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు ఈ ప్రాంతంలో హై లెవెల్ వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

Flood on Chityala Road

సాహసాలు చేయొద్దు.. ప్రజలకు కలెక్టర్‌ సూచన

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెరువులు, వాగుల వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి వద్ద నీటి ప్రవాహం వస్తున్నందున భువనగిరి నుంచి చిట్యాల నల్లగొండ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై పరిస్థితిని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొందరు వరద నీటిలో చేపలు పట్టడానికి వెళ్లి చిక్కుకుపోతున్నారని.. అలాంటి సాహసాలు చేయొద్దని సూచించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News