ముంబయి: మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాలో భారీ భవనం కూలిపోయింది. విరార్ ప్రాంతంలోని విజయ్‌నగర్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 15 మంది మృతి చెందారు. పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బుధవారం అర్థరాత్రి సమయంలో భవనం కూలిపోయిందని స్థానికులు వెల్లడించారు. ఎన్ డిఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీస్తున్నారు. నాలుగు అంతస్తుల భవనంలో 50 ఫ్లాట్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. భవనంలోని నాలుగో అంతస్తులో ఓ చిన్నారి తొలి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుండగా భవనం కూలిపోయింది. 12 ప్లాట్లు కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. నివాసితులు, అతిథులు శిథిలాల్లో చిక్కుకుపోయారు. పాల్‌ఘర్ జిల్లా కలెక్టర్ డా. ఇండు రాణి జాఖర్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇంకా ఎవరైనా శిథిలాల్లో చిక్కుకుపోయి ఉండొచ్చనే అనుమానంతో ఎన్ డిఆర్ఎఫ్, రెస్య్కూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయని కలెక్టర్ తెలిపారు. కుప్పకూలిన భవనం ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఎనిమిది మంది వ్యక్తులను గుర్తించారు.
1. గోవింద్ సింగ్ రావత్ (28)
2. శుభంగి పవన్ సహేని (40)
3. కషిష్ పవన్ సహేని (35)
4. దీపక్ సింగ్ బెహ్రా (25)
5. సోనాలి రూపేష్ తేజాం (41)
6. హరీష్ సింగ్ బిష్ట్ (34)
7. సచిన్ నేవల్‌కర్ (40)
8. దీపేష్ సోని (41)