- Advertisement -
మెదక్ జిల్లా నాగుసానిపల్లిలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గా భవాని ఆలయం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. గత 14 రోజులుగా మంజీరా నదిలో వరద ఉధృతి కొనసాగుతుండటంతో, ప్రధాన ఆలయంలోకి భక్తులకు దర్శనం కల్పించడం సాధ్యం కావడం లేదు.సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు, సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కారణంగా ఆలయం చుట్టూ భారీగా వరద నీరు ప్రవహించడంతో ఆలయ అధికారులు ముందు జాగ్రత్త చర్యగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురం వద్ద ఏర్పాటు చేశారు. గత రెండు వారాలుగా భక్తులు అక్కడే అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.సాధారణంగా ప్రతి సంవత్సరం వరదల సమయంలో ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకోవడం పరిపాటే అయినప్పటికీ, ఇంత సుదీర్ఘ కాలం పాటు దర్శనాలు నిలిచిపోవడం అరుదు. వరద తగ్గుముఖం పడితేనే ప్రధాన ఆలయంలో దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
- Advertisement -