ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఆగస్టు 29, 2009 అంతర్జాతీయ అణుపరీక్షకు వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించింది. ఇది అణుపరీక్షల గురించి అవగాహన కల్పించడానికి, అణుఆయుధాలు లేని ప్రపంచాన్ని సాధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడమే లక్ష్యం గా జరుపుకుంటారు. అణుపరీక్షలోని పేలుళ్ళు, ఇతర అణుపేలుళ్ళ ప్రభావాల గురించి, అణ్వాయుధ రహిత ప్రపంచం లక్ష్యాన్ని సాధించే సాధనాల్లో ఒకటైన ఈ అణుపరీక్షలను నిలిపివేయవలసిన అవసరాన్ని గురించి ‘అవగాహన పెంచాలని ప్రపంచం దేశాలకు పిలుపునిచ్చింది. మనిషి అభివృద్ధి చెందుతూ అంతరాళం చుట్టి వస్తున్న ఇర్ష్యా, ద్వేషం, స్వార్థంతో తనకుతానే శత్రువుగా మారిపోయి అణుబాంబుతో రాక్షసుడయ్యాడు.
ఇంటికి పొరుగింటికి పడదు, దేశం పొరుగు దేశానికి గిట్టదు, నిత్యం కయ్యంతో కాలు దువ్వుతూ రోజుకొక యుద్ధంతో ప్రపంచ ప్రజలు భయం నీడలో బతుకుతున్నారు. శత్రువు తలవంచకపోతే శత్రువునే కరిగించాలి అన్న అమెరికా పట్టుదలతో 1945 ఆగస్టు 6, 9న అమెరికా ప్రయోగించిన బాంబులు హిరోషిమా, నాగసాకి నగరాలను ఒక క్షణంలో శ్మశానంగా మార్చేసింది.ఆ రోజు సూర్యుడు ఉదయించకముందే, మానవ జాతి మీద అణు అంధకారం కమ్ముకుంది. కానీ కాలిపోయింది శత్రువు కాదు, మానవత్వమే. బతికిపోయిన వారూ జీవచ్ఛవాల్లా మిగిలారు. క్షణాల్లో లక్షలాది ప్రాణాలు బూడిద, వేలాది ఇళ్లు శిధిలాలు, తరతరాల పిల్లల రక్తంలోకి చొరబడిన కిరణజన్య వ్యాధులు, వికలాంగతలు, మానసిక వేదన తరతరాల పాటు వారిని వెంటాడాయి. ఒక నగరాన్ని నిర్మించడానికి శతాబ్దాలు పడతాయి కానీ ఒక బాంబుపడితే క్షణాల్లో శ్మశానం అవుతుంది.
హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా వేసిన రెండు అణుబాంబులు కేవలం జపాన్ నేలనే కాదు మనిషి హృదయాన్నే చీల్చేశాయి. మానవత్వం రాక్షసత్వమైన ఆ క్షణాన సూర్యుడు తలదించుకున్నాడు, గాలి విషమైంది, నీరు విషాదమైంది. ప్రకృతి శవాల విషదాలాపనతో మూగబోయింది. అప్పటి నుంచి మానవజాతి అణుఆయుధాల దారుణాన్ని, భయంకరతను అనుభవిస్తూ వస్తోంది. ఈ విధ్వంసం మనిషి సృష్టించిన మరో శస్త్రానికి లేదు. ఈ దారుణం తర్వాత అణు యుద్ధం అంటే దేశాల మధ్య యుద్ధం కాదు, మానవజాతి మీదే యుద్ధం అని ప్రపంచం నేర్చుకుంది. అయినప్పటికీ చాలా దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. అయిన దేశాలు అణు పరీక్షలతో పొరుగు దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
నేటికీ ప్రపంచంలో 13,000కు పైగా అణుబాంబులు సిద్ధంగా ఉన్నట్లు అనాధికార లెక్కలు భయపెడుతున్న నిజం. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు ముందువరుసలో ఉండగా చిన్న దేశాలు కూడా భద్రత పేరిట అణుశక్తి వైపు పరుగులు పెడుతున్నాయి. నక్కల మధ్య మేకలా బతకలేమంటూ మరిన్ని దేశాలు అణుబాంబుల తయారీకి తెరతీస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పుతిన్ అణు బటన్ నొక్కే పరిస్థితి వస్తే వెనకాడం అన్న మాటతో ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఉత్తర కొరియా తన బాంబులతో పొరుగు దేశాలపై భయాలు సృష్టిస్తోంది. చైనా వేగంగా తన అణు ఆయుధాల నిల్వ పెంచుకుంటోంది.
దక్షిణ చైనా సముద్రం, తైవాన్ సమస్యల వల్ల అంతర్జాతీయ ఉద్రిక్తత పెరుగుతోంది. ఉత్తర కొరియా వరుస అణు పరీక్షలతో పొరుగు దేశాలను బెదిరిస్తోంది. భారత్ -పాకిస్తాన్ రెండూ అణు దేశాలు కాబట్టి నిత్యం జరిగే సరిహద్దు ఘర్షణలలో ఒక్క తప్పు నిర్ణయం జరిగితే మానవజాతే బూడిద అవుతుంది. పాకిస్తాన్ అణుబాంబు ఉన్నదనే గుడ్డి నమ్మకంతో ఎదో ఒక రకంగా మన దేశంపైకి కాలు దువ్వుతున్నది.మనం శాంతిని కోరుకుంటున్నందున పాకిస్తాన్ ఊపిరి పీల్చుకుంటుంది. కానీ ఆయుధ సంపత్తికి కొదవలేని దేశం మనది అయినా మనకు మానవజాతి సుఖశాంతులే ముఖ్యం. ఇరాన్ కూడా అణు ఆయుధాలు తయారు చేస్తుందనే అనుమానాలు ఆంక్షల నేపథ్యంలో ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధాలు, మధ్యప్రాచ్యంలో ఎప్పుడైనా అణుఘర్షణ మంటలు రగులుతాయన్న భయం ఉంది.
ఇవన్నీ ఒకే మాట చెబుతున్నాయి: బాంబులు పడితే ఎవరూ గెలవరు, మానవజాతి మొత్తం ఓడిపోతుంది. అణు బాంబు దేశాన్ని రక్షించదు, మానవజాతిని అంతమొందిస్తుంది. ఏ దేశాన్ని గెలిపించక మానవజాతిని శ్మశానంలో పడేస్తుంది. యుద్ధం మొదలైతే విజేతలేవరు కారు అందరూ పరాజితులే మిగులుతారు. మానవ జాతి మనుగడకు, పర్యావరణ, భవిష్యత్ తరాలకు శాపంగా నిలుస్తుంది. అన్ని దేశాలు అణు పరీక్షలు ఆపివేసి దేశాధినేతల మధ్య శాంతి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలి. మధ్యవర్తులుగా ఇతర దేశాధినేతలు, ఐక్యరాజ్య సమితి ఉండాలి .అణు బాంబులను నాశనం చేసి నిరాయుధీకరణ మార్గంలో నడవాలి. విద్య, విద్యుత్, వైద్యం, వ్యవసాయం, పరిశోధనల కోసం అణుశక్తి ఉపయోగించుకోవాలి కానీ యుద్ధం కోసం కాదు. అన్ని దేశాలు పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు ప్రేమ, సహనం, శాంతి విలువలు నేర్పాలి.
యువత శాంతి సైనికులుగా మారాలి తప్ప అణు సైనికులుగా కాదు. అంతర్జాతీయ సమగ్ర అణుపరీక్ష నిషేధ ఒప్పందం, అణు ఆయుధాలు వ్యాప్తి నిరోధక ఒప్పందాలు కేవలం సంతకాలకే పరిమితం కాకుండా చిత్తశుద్ధితో అమలు చేయాలి. అన్ని దేశాలలో ప్రజలు సోషల్ మీడియా, ఉద్యమాల ద్వారా అణు పరీక్షలకు వ్యతిరేక గళం వినిపించాలి. ప్రతి దేశం ‘అణు ఆయుధాల రహిత ప్రపంచం’ కోసం కృషి చేయాలి. అణుపరీక్షలను నిలిపివేయాలి, అణుపరీక్షలు శక్తి ప్రదర్శనకు సంకేతాలు మాత్రమే కానీ అవి మానవాళి ప్రాణాలకు శాశ్వత ముప్పు. అందుకే ఈ అంతర్జాతీయ అణుపరీక్ష వ్యతిరేక దినోత్సవం మనమంతా అస్త్రశక్తి కాదు, ఆలోచన శక్తితో మానవాళిని రక్షించుకోవాలి. యుద్ధం కాదు, శాంతి మాత్రమే భూమికి భవిష్యత్తు ఇస్తుంది అని విశ్వసించి ప్రతి దేశం అణు పరీక్షలను త్యజించి, శాంతి మార్గాన్ని ఎంచుకొని నిజమైన అభివృద్ధి సాధించాలి. అణు రహిత, భూమి శాంతి, సౌభ్రాతృత్వం నిండిన భూమిని బహుమతిగా భవిష్యత్ తరానికి అందివ్వాలి.
- దుప్పటి మొగిలి
84668 27118 - నేడు అంతర్జాతీయ అణు పరీక్ష వ్యతిరేక దినోత్సవం