జీహెచ్ఎంసీ 14,486 మందితో మూడు షిప్ట్‌లు
మనతెలంగాణ సిటీ బ్యూరో ః గణేశ్ నిమజ్జనాన్ని సజావుగా, సురక్షితంగా నిర్వహించేందుకు వీలుగా జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పోలీస్ శాఖ, హైడ్రా, ట్రాఫిక్, రెవెన్యూ, ఇరిగేషన్ , వాటర్ బోర్డు, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ అండ్ బి , పర్యాటక శాఖ, విద్యుత్, ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేస్తూ, నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా జరిగేలా పకడ్బందీ కార్యాచరణను సిద్ధం చేసింది.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కు ఆస్కారం లేకుండా గణేష్ నిమజ్జనం ఆధ్యాత్మిక వాతావరణంలో సాఫీగా జరిగేలా కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రధాన చెరువులతో పాటు 74 కృత్రిమ కుంటలలో నిమజ్జనం ఈసారి నిమజ్జనం హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు, ఐడిఎల్ చెరువు, సఫిల్‌గూడ చెరువు, సున్నం చెరువు సహా 20 ప్రధాన చెరువుల్లో జరుగుతుంది. అదనంగా 74 కృత్రిమ నిమజ్జన కేంద్రాలు (బేబీ పాండ్లు, మట్టికుంటలు, తవ్వక కుంటలు, పోర్టబుల్ ట్యాంకులు, మొబైల్ కుంటలు) జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది.
తద్వారా ప్రధాన చెరువుల పై ఒత్తిడి తగ్గనుంది.
డీఆర్ఎఫ్ బృందాలు, ఈతగాళ్లతో పహరా
నిమజ్జనం వేగంగా, సురక్షితంగా, సాఫీగా జరిగేలా 134 స్టాటిక్ క్రేన్లు, 269 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. పర్యాటక శాఖ,హైడ్రా సమన్వయంతో హుస్సేన్ సాగర్ వద్ద ప్రత్యేకంగా 9 పడవలు, 16 డీఆర్ఎఫ్ బృందాలు, 200 ఈతగాళ్లను జీహెచ్ఎంసీ అందుబాటులో ఉంచుతుంది. 839.42 కి.మీ. ఊరేగింపు మార్గాల్లో అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు, వేలాడే వైర్ల తొలగింపు పనులు పూర్తయ్యాయి.
14,486 సిబ్బందితో స్వచ్ఛతా కార్యక్రమాలు
14,486 శానిటేషన్ సిబ్బంది, 160 గణేశ్ యాక్షన్ టీమ్‌లు మూడు షిఫ్ట్ లలో నిరంతరాయంగా విధులు నిర్వర్తిస్తారు. గణేష్ మండపాల వద్ద వ్యర్థాల సేకరణకు 5 లక్షల ట్రాష్ బ్యాగులు పంపిణీ చేశారు. అదనంగా 2,000 స్వీపర్లు, 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలు, 30 స్వీపింగ్ మెషిన్లు నిమజ్జన దినాన చెత్త తొలగింపులో పాల్గొంటాయి. ప్రజల కోసం 309 మొబైల్ టాయిలెట్స్, 56,187 లైటింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఆరోగ్య భద్రత కోసం 7 మెడికల్ క్యాంపులు, అంబులెన్స్ లతో మూడు షిఫ్ట్ లలో పని చేస్తున్నారు.