మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర శాసనసభ, శాసనమండలి (కౌన్సిల్) వర్షాకాల సమావేశాలు శనివారం (30న) ప్రారంభంకానున్నాయి. కాళేశ్వ రం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలపై పిసి ఘోష్ కమిషన్ స మర్పించిన నివేదిక, ఇంకా అనేకానేక అంశాలపై పాలక, ప్రతిపక్షాల మధ్య వాగ్బాణాలతో అసెంబ్లీ దద్ధరిల్లే అవకా శం ఉంది. దీనికి వ్యూహా, ప్రతివ్యూహాలతో సమాయత్తమయ్యాయి. శనివారం ఉదయం శాసనమండలి, శాసనభ సమావేశాలు ఉదయం 10.30గంటలకు ప్రారంభం కానున్నాయి. శాసనసభ ప్రారంభంకాగానే ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు సభ సంతాపం వ్యక్తం చేస్తుంది. అదే సమయంలో ఇటీవల మరణించిన మండలి మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డికి సభ్యులు సంతాపం వ్యక్తం చే స్తారు. రెండు సభలు వాయిదా పడిన తర్వాత స్పీకర్ గడ్డం ప్ర సాద్ కుమార్ అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సల హా సంఘం (బిఎసి) సమావేశం జరుగుతుంది.
కౌన్సిల్ చైర్మ న్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన శాసనమండలి వ్యవహారాల సలహా సంఘం సమావేశమవుతుంది. స్పీ కర్ ప్ర సాద్ కుమార్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఈ వర్షాకాల సమావేశాల్లో చేపట్టబోయే అజెండాను ఖరారు చేస్తా రు.ముఖ్యంగా కాళేశ్వరంప్రాజెక్టుపై నియమించిన జస్టిస్ ఘోష్ సమర్పించిన నివేదికపై ఇప్పటికే కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతల మధ్య హోరా హోరీగా
మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుండగా, ముందుగానే తమకు ఇవ్వాలంటూ ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రతిపాదించి చర్చించిన తర్వాత సభ్యుల అభిప్రాయం మేరకు ప్రభుత్వం తీసుకోబోయే చర్యల గురించి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లేదా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై సభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు తమకు అవకాశం ఇవ్వాలని బిఆర్ఎస్ ప్రయత్నించింది.
ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను కోరగా, తాను చేయగలిగింది ఏమీ లేదని, స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఈ అంశంపై సభలో వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు బిఆర్ఎస్ పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తున్నదని, ఘోష్ కమిషన్ నివేదిక తప్పుల తడకగా ఉందని, ఈ నివేదికలో నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి టి. హరీష్ రావు ఇదివరకే కోర్టుకు వెళ్ళగా, కోర్టు స్టే ఇచ్చేందుకు ససేమిరా అన్న సంగతి తెలిసిందే.
వర్షాలు, వరదలపై చర్చ
భారీ వర్షాలు, వరదల కారణంగా ఆదిలాబాద్, కామారెడ్డి తదితర జిల్లాలు అతలకుతలం కావడం, ప్రజలు నిరాశ్రయులు కావడం, పంట పొలాలు దెబ్బతినడంపై సుదీర్ఘంగా చర్చించి, ఈ కష్టకాలంలో రాష్ట్రానికి ఇతోధికంగా సహాయం అందించాలని కేంద్రాన్ని కోరుతూ సభ తీర్మానం చేసే అవకాశం ఉంది.
బిసి రిజర్వేషన్లపైనా తీర్మానం
బిసి రిజర్వేషన్లపై గత అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేనందున ఏ విధంగా ముందుకు వెళదాం అనే అంశంపైనా సభ్యుల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. బిసి రిజర్వేషన్లపై బిలుల్లపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ సభలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కర్నాటక తరహాలో ప్రభుత్వమే జివో విడుదల చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంపైనా సాధ్యసాధ్యాలపైనా సభలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం, మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా బిల్లు ఆమోదించి రాష్ట్రపతి, గవర్నర్‌కు పంపిస్తే వాటిపై 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రభుత్వాలే వాటికి ఆమోదం లభించినట్లు అమలు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపైనా ఈ సందర్భంగా చర్చకు రానున్నాయి. చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కానిపక్షంలో పార్టీలే స్వతహాగా బిసి రిజర్వేషన్లు కల్పించుకోవాలన్న అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఉప సభాపతి ఎన్నిక
ఇదిలాఉండగా ఈ సమావేశాల్లోనే ఉప సభాపతి ఎన్నిక జరిగే అవకాశం ఉంది. డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాంచందర్ నాయక్‌ను ఉప సభాపతిగా ఎన్నుకోవాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి శనివారం స్పీకర్ ఆదేశం మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ వెలువరించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే నాయక్ ఒక్కరే నామినేషన్ వేస్తే ఏకగ్రీవమవుతారు. ప్రతిపక్షం నుంచి ఎవరైనా నామినేషన్ దాఖలు చేసినట్లయితే ఎన్నిక అనివార్యమవుతుంది.
4 వరకూ సమావేశాలు
శనివారం జరిగే బిఎసి సమావేశంలో అజెండాతో పాటు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే నెల 5న మిలాద్ ఉన్ నబీ పండుగ, 6న వినాయక నిమజ్జనం ఉండడం వల్ల 4వ తేదీన సమావేశాలను ముగించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తులో ఉండాల్సి వస్తుంది కాబట్టి సమావేశాలను ఈ లోగా ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
కోదండరామ్, ఖాన్ల సంగతేమిటీ?
ఇదిలాఉండగా శాసనమండలికి ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ హాజరవుతారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. వారిరువురి ఎన్నికపై బిఆర్ఎస్ లేవదీసిన అంశాలతో కోర్టు ఏకీభవిస్తూ వారిని తిరిగి ఎన్నుకోవాలని సుప్రీం కోర్టు తాజాగా తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారిరువరి సభ్యత్వాలను శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ఇంత వరకూ రద్దు చేయలేదు. దీంతో వారు సభ్యులుగానే ఉన్నారు కాబట్టి సభకు హాజరవుతారా? హాజరైతే సుప్రీం తీర్పు మాటేమిటీ? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సభకు వారు వచ్చినప్పుడు చైర్మన్ ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారో వేచి చూడాలి.