భారత ప్రధాని గతవారం బీహార్ సభలో మాట్లాడుతూ పదవీచ్యుతి నూతన బిల్లు చట్టం సందర్భంగా ప్రజాప్రతినిధులను ప్రభుత్వ ఉద్యోగితో పోల్చి చిరుద్యోగి అరెస్టయి కేవలం 48 గంటలపాటు జైల్లో ఉంటే సస్పెండ్ చేసే నిబంధన ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు 30 రోజులు జైల్లో ఉంటే పదవినుండి ఎందుకు తొలగించకూడదు అని ప్రతిపక్షాలకు ప్రశ్నించిన విషయం ప్రజలు గమనించే ఉంటారు. అదే సమయంలో మరొక ప్రశ్న ప్రతి ఉద్యోగికి తలెత్తి ఉండవచ్చు! ఇదే పెన్షన్ విషయంలో ప్రజాప్రతినిధితో ఉద్యోగికి ఎందుకు పోల్చరు? రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటూ ప్రభుత్వం కోసం 30 ఏళ్ల పాటు సేవ చేసిన ఉద్యోగికి లేని పెన్షన్ 3 ఏళ్ళు కూడా సరిగ్గా పని చేయని ఎంపి, ఎంఎల్ఎకి పెన్షన్ ఇవ్వడం సబబా! ప్రజాప్రతినిధులకో న్యాయం, ప్రభుత్వ ఉద్యోగులకో న్యాయమా? కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం వారి బాధ్యత కాదా? తెలంగాణ ఎంప్లాయీస్ జాక్ (టిజిఇజెఎసి) సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటించి ఉద్యోగుల 63 వివిధ డిమాండ్లను సాధించడానికి దశలవారీ ఉద్యమాలను ఉధృతం చేస్తున్న నేపథ్యంలో పెన్షన్ గురించి ఆలోచించాల్సిన ఆవశ్యకత హామీనిచ్చిన ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.
ఏ చదువు లేకపోయినా, ఎన్ని కేసులున్నప్పటికీ, రాజకీయ నాయకుల అండదండలతో, ధనబలంతో కేవలం ఒకే ఒకసారి ఎంపి, ఎంఎల్ఎ, ఎంఎల్‌సి లాంటి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ఐదు సంవత్సరాలు కాదు, కేవలం ఒక్కరోజు మాత్రమైనా పదవిలో ఉండి ఉంటే, వీరికి కోట్ల వ్యాపారం ఉన్నప్పటికీ వీరికి జీవితాంతం పెన్షన్ ఇచ్చే చట్టాలు తమకు అనుకూలంగా తయారు చేసుకొని, 61 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఉద్యోగ సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగికి ఉన్న పెన్షన్ లేకుండా చేసి, చట్టాన్ని మార్చి ఒపిఎస్‌ను సిపిఎస్ ల మార్చడం సమానత్వమా? ఇది ఉద్యోగుల పట్ల ద్రోహం కాదా? పెన్షన్ ఇచ్చే ఆచారం ఈనాటిది కాదు. స్వాతంత్య్రానికి కన్నా ముందే బ్రిటిష్ రాజ్యమే ప్రారంభించిన మూలాలున్నాయి.
1924లో పౌర సంస్థలపై రాయల్ కమిషన్ భారతదేశంలో పని చేస్తున్న తన నియామకాలకు పదవీ విరమణ తర్వాత సగం జీతం పెన్షన్‌గా ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఒపిఎస్ (పాత పెన్షన్స్ పథకం) మూలాలు బ్రిటిష్ రాజ్యం నుండే కలిగి ఉన్నందువలన భారత ప్రభుత్వ చట్టం 1935 స్వీకరించడం వలన పూర్వకాలంనుండే ఉద్యోగుల సేవకు ప్రతిఫలంగా విరమణ అనంతరం వారి కుటుంబానికి జీతంలో సగం, దశలవారీగా మారుతూ ఆర్థిక చేయూత వచ్చేది. కానీ కేంద్రప్రభుత్వం ఆర్థికభారం తగ్గించడానికనే కారణంతో కేవలం ఉద్యోగస్థులనే దృష్టిలో ఉంచి 2004 జనవరి 1 నుండి ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ పథకం (ఎన్‌పిఎస్)ను అమల్లోకి తెచ్చారు. ఇందులో భాగంగా పాత పెన్షన్(ఒపిఎస్) స్కీమ్‌ను రద్దు చేసి కాంట్రీబ్యూటరీ స్కీమ్ (సిపిఎస్)ను అమల్లోకి తెచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో 2004, సెప్టెంబర్ 1 నుండి అమలైంది.
దీని అమలుకోసం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినప్పటికీ రెండు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, త్రిపుర మాత్రం పాత పెన్షన్ స్కీమ్‌ను వెంటనే రద్దు చేయకుండా కొనసాగించాయి. అదే విధంగా ఒపిఎస్‌ను ముందు రద్దు చేసిన రాష్ట్రాలు హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ వంటివి ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు తిరిగి ఒపిఎస్ పాత పెన్షన్‌ను అమలు చేసారు. తెలంగాణలో కూడా ఉద్యోగుల పాత పెన్షన్ (ఒపిఎస్) ను అమలు చేయాలనీ గతంలో ప్రతిపక్షంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పట్లోనే డిమాండ్ చేసారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాతపెన్షన్‌ను పునరుద్ధరిస్తామని ఎన్నికల వాగ్దానం చేసారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా 2023 ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి పాయింట్లోనే సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ను అమలు చేస్తామని ఉద్యోగులకు మాటిచ్చారు. కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో ఇటు ఉద్యోగులు ప్రతి నెలా జీతంలో 10%, అటు ప్రభుత్వం 10% వంతున జమ చేసి భవిష్యత్ ఆధారిత ప్రయోజనం కోసం మార్కెట్లో పెట్టుబడులు పెట్టి పదవీ విరమణ సమయంలో ఉన్న మార్కెట్ విలువను బట్టి ఉద్యోగికి అందులోనుండి కేవలం 60% మాత్రమే అందిస్తారు. ఇందులో మళ్లీ ఆదాయపు పన్ను, జిఎస్టి ఉంటుంది. మిగిలిన 40% ఇన్సూరెన్స్ కంపెనీలో ఏదో ఒక ప్లాన్ తీసుకోని అందులో నుండి ఏడాదికి కేవలం 6 శాతం వరకు పెన్షన్ రూపంలో వస్తుంది. మొత్తానికి సిపిఎస్ పెన్షన్ ఖచ్చితంగా ఇంత వస్తుందని భరోసా లేదు. పైగా అప్పటి మార్కెట్ విలువల్లో తేడాలు వస్తే గనుక ఉద్యోగి కొంత మేరకు నష్టపోవచ్చు! ఈ విధమైన గ్యారంటీ లేని పెన్షన్ వద్దని దేశంలోని ఉద్యోగస్థులందరూ ఎంత మొత్తుకున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్రాలు ఆర్థిక భారం అనే సాకుతో సిపిఎస్ ను రద్దు చేయడం లేదు.
ఎన్నికలప్పుడు ప్రకటించే కోట్ల రూపాయల ఉచితాలు ఆర్థిక భారం కావా? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన మేనిఫెస్టోలోని అంశాలైన నూతన పిఆర్సి, డిఎలు, హెల్త్‌కార్డులు (ఇహెచ్ఎస్), పెండింగ్ బిల్లులు, 317 బాధితులు, బదిలీలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇలా అనేక వాగ్దానాలున్నాయి. ఐదు డిఎలలో కనీసం మూడు ఇస్తారని భావిస్తే కేవలం ఒకటి మాత్రమే ఇచ్చి ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. పదవీవిరమణ పొందుతున్న వారు బెనిఫిట్స్ పొందలేక రోడ్డునెక్కే పరిస్థితి నెలకొంది. పిఆర్సి పాతాళంలోకి వెళ్ళింది. పాత పెన్షన్ మాట పాతదైపోయింది. మూడు నెలల క్రితం కనీసం నిరసన తెలుపుదాం అనే సమయంలోనే ఉద్యోగస్థుల కన్నా ముందే సిఎం స్పందించి నన్ను కోసినా సరే పైసల్ లేవని అసహనం వ్యక్తం చేయడంతో ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వానికి సహకరిద్దామని వారి డిమాండ్లతో పాటు నిరసన కార్యక్రమాలకు విరామమిచ్చి ప్రభుత్వానికి సహకరించారు.
తరువాత వివిధ మంత్రులు అధికారులతో ఏర్పడ్డ ఉపసంఘం పలు దఫాలుగా జరిపిన చర్చల్లో కాలయాపన తప్ప ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. తెలంగాణలోని టిజిఒ, టిఎన్‌జిఒ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వమంటే మన ప్రభుత్వమే అనుకొని ఆశతో కొన్ని ముఖ్యమైన డిమాండ్ లను అయినా అమలు చేస్తుందనుకొని ఇప్పటివరకు ఎంతో ఓపికతో ఉన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఉద్యోగులు ఎన్నో నిరసనలు, ధర్నాలు చేపట్టారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు కావస్తున్నా ఇప్పటివరకు ఉద్యోగ సంఘాలు ఎలాంటి నిరసనలు చేయలేదు. కానీ వివిధ సంఘాల సభ్యులు, ఉద్యోగస్థులు నిరాశతో, అసహనానికి గురవుతూ వ్యతిరేక గళం పెరగడంతో తప్పని పరిస్థితుల్లో టిజిఇజెఎసి నాయకులు మళ్ళీ దశలవారీగా వివిధ ఉద్యమాలను చేపట్టబోతున్నారు.
Also Read : లాస్ ఏంజెల్స్‌లో పోలీసుల కాల్పులు… భారత సంతతి వ్యక్తి మృతి
- సయ్యద్ జబి, 99493 03079