ఉత్తరాది రాష్ట్రాలు జలప్రళయంతో విలవిల్లాడుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్, చమోలీ జిల్లాల్లో కుంభవృష్టి అనేక గ్రామాలను ముంచెత్తుతోంది. ఉత్తరాఖండ్‌లో తాజాగా మరోసారి క్లౌడ్‌బర్స్ సభవించింది. అనేక చోట్ల ఇళ్లుకూలి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో అనేక జిల్లాలకు సంబంధాలు తెగిపోయాయి. జమ్మూకశ్మీర్‌లో ఇప్పటివరకు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. శ్రీనగర్, అనంత్‌నాగ్‌ల్లో నదులు ప్రమాదస్థాయిని మించి ఉప్పొంగడంతో, గండ్లుపడి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాబ్‌లో గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వ్యవసాయ భూములు అదృశ్యమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షపాతం నమోదైంది.
యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నైరుతి పవనాల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఆగస్టులో మేఘ విస్ఫోటంతోనే వర్షాలు ప్రారంభమయ్యాయి. హిమాలయ పర్వత వాలు ప్రాంతాలు ఒరిగిపోయాయి. మైదానప్రాంతాల్లో గట్లు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తక్కువ సమయాల్లో ఎడతెరిపిలేని కుంభవృష్టి స్థానిక నేలకోతను పెంచుతుంది. కొండచరియలు విరిగిపడి సమీప నివాసాలను ధ్వంసం చేస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఉపశమనం అనేది కేవలం ప్రతిచర్యాత్మక చర్యలకే పరిమితం కాకూడదు. కేంద్రీకృత జ్ఞానం అవసరం. విధ్వంసకర వర్షపాతం ఇప్పుడుపునరావృతమయ్యే ప్రమాదం ఉంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నివారణ వ్యూహాల కోసం అధికంగా ఖర్చు చేయడం తప్పనిసరి.
అటువంటి చర్యలను అమలు చేయలేని అత్యవసర పరిస్థితులుగా పరిగణించే వైఖరిని కొనసాగించడమంటే ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆధారాలను తిరస్కరించడమే అవుతుంది. గత ప్రకృతి వైపరీత్యాల అనుభవాల నుంచి నేర్చుకున్నప్పటికీ వాటిని విస్మరించి ప్రతి విపత్తును అసాధారణమైనదిగా పరిగణించడం పరిపాటవుతోంది. కొండచరియలు విరిగి పడడానికి 51% అనువైన ప్రాంతం ఉత్తరాఖండ్ అని వాడియా ఇన్‌స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. పర్యావరణ సున్నిత ప్రాంతాలపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనంలో దేశంలోని 16 రాష్ట్రాలు, హిమాలయ రీజియన్ లోని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్యంలోని హిమాలయ పర్వత దిగువ భాగాలు, పశ్చిమ కనుమలు ఇవన్నీ కొండచరియలు విరిగిపడే ప్రాంతాలుగా గుర్తించింది.
రోడ్లు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలు, ఎలాంటి ప్రణాళిక లేకుండా సాగించే కొండ క్వారీ పనులు కొండచరియలు విరిగిపడడానికి కారణమవుతున్నాయని హెచ్చరించింది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో 2015 నుంచి 2018 మధ్యకాలంలో 10.76 మిలియన్ చెట్లను కూల్చివేశారు. ఆ లోటు భర్తీ ఇప్పటికీ కాలేదు. దీంతో కొండలపై ఉన్న సారవంతమైన మట్టి వర్షాలకు కొట్టుకుపోయి, కొండచరియలు వదులవుతున్నాయి. దీంతోపాటు పంట పొలాల్లోకి, ఇళ్లలోకి బురద ప్రవాహంలా వచ్చిచేరుతోంది. ఎన్నో ప్రాణాలు జలసమాధి అవుతున్నాయి. ఇవన్నీ స్వయం కృతాపరాధాలే. పర్యావరణ సున్నితమైన హిమాలయ రాష్ట్రాల్లో కొండవాలు ప్రాంతాలు అత్యంత బలహీనమైనవని, వాటిని తిరిగి పొందలేమని ఎన్ని హెచ్చరికలు పర్యావరణ శాస్త్రవేత్తలు చేసినా అటవీ నిర్మూలన, రోడ్ల వెడల్పు నిర్మాణాలు చేపట్టడం జరుగుతోంది.
కొండవాలు ప్రాంతాలను బలహీనం చేస్తున్నారు. దీంతో పరీవాహక సామర్థం కుదించుకుపోయి ఆనకట్టల్లో పూడిక పేరుకుపోతోంది. వరదలతో దిగువ ప్రవాహాలు పెరుగుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు అదే పనిగా సంభవిస్తున్నా ముందస్తు హెచ్చరికలు, పల్లపు ప్రాంతాలను ఖాళీ చేయించడం వంటి వ్యవస్థలు ఇంకా సరిగ్గా అభివృద్ధి చెందలేదు. ఈ హెచ్చరికలు క్షేత్రస్థాయిలో ప్రజలకు సరిగ్గా అందడం లేదు. నష్టం సంభవించినప్పుడు రిలీఫ్ ఏజెన్సీలు స్పందిస్తుంటాయి. కానీ ఒక క్రమపద్ధతిలో చర్యలు చేపట్టడం కానీ, ముందుగా అవసరమైన సరఫరాలు సిద్ధం చేయడం కానీ, సామాజక పరంగా సన్నాహాలు కానీ లోపభూయిష్టంగా ఉంటున్నాయి.
వాతావరణాన్ని తట్టుకునే మౌలిక సదుపాయాల గురించి ఆలోచించకుండా రాష్ట్రాలు, కేంద్రం అత్యవసరంగా రోడ్డు నిర్మాణాలను, నగరాల విస్తీకరణాన్ని చేపడుతున్నాయి. ఇతర అవసరాల కోసం అడవులను నరికివేస్తున్నారు. మళ్లీ ఆ లోటు భర్తీగా కొత్తగా అడవుల పెంపకాన్ని చేపట్టడం లేదు. పునరావాస చర్యలు కొద్దిగా ఉంటున్నాయి. కొండవాలు ప్రాంతాలను తొలగించడం, పరీవాహక ప్రాంతం కుదించుకుపోవడం, జనాభా పెరిగిపోతుండడం వీటన్నిటి ఫలితం ఎంతటి విధ్వంసాన్ని కలిగిస్తుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. సుస్థిర సౌకర్యాలు సమకూర్చనిదే పునరావాస చర్యలు ఎంత చేపట్టినా, బడ్జెట్ నిధులు ఎంత ఖర్చు చేసినా ఈ సమస్యల పరిష్కారం కాదు.
కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని నివారించగలగాలి. ముందస్తు హెచ్చరికలు తక్షణం ప్రజలకు అందేలా చూడాలి. వచ్చే రుతుపవనాలు కూడా ఇలాంటి విధ్వంసాలనే కలిగించవచ్చు. పునరావాస చర్యలు కల్పించామని సంతృప్తి పడరాదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళికతో దౌర్బల్యాలను తగ్గించుకోవడం మన బాధ్యత. అసాధారణ వైపరీత్యాల వల్ల గత 31 సంవత్సరాలుగా మొత్తం 3.8 ట్రిలియన్ డాలర్ల వరకు నష్టాలు ఏర్పడినట్టు తేలింది. సరాసరిన ఏటా 123 బిలియన్ డాలర్ల వరకు నష్టాలు సంభవించాయని స్పష్టమవుతోంది. ప్రకృతి వైపరీత్యాలతో ప్రాణనష్టం, ఆస్తుల నష్టం జరిగినప్పుడు బాధపడడం తప్ప తరచుగా సంభవిస్తున్న ఈ విపత్తుల నివారణకు ముందస్తు ప్రణాళికలు ఏ విధంగా అమలు చేయాలని ప్రభుత్వాలు ఆలోచించడం లేదు.
Also Read : కెసిఆర్ వచ్చేనా?