ఎదురులేని నొవాక్
పురుషుల సింగిల్స్‌లో స్టార్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. జర్మనీ ఆటగాడు స్ట్రఫ్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో నొవాక్ 63, 63, 62తో జయభేరి మోగించాడు. ఆరంభం నుంచే నొవాక్ దూకుడును ప్రదర్శించాడు. తన మార్క్ షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. చివరికి వరుసగా మూడు సెట్లు గెలిచి ముందంజ వేశాడు. మరో పోరులో ఫ్రిట్జ్ జయకేతనం ఎగుర వేశాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన టొమాస్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రిట్జ్ 64, 63, 63తో విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్‌తో ఫ్రిట్జ్ తలపడుతాడు.
న్యూయార్క్: ప్రతిష్ఠాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, టాప్ సీడ్ అరినా సబలెంక (బెలారస్) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్‌లో మాజీ ఛాంపియన్, ఏడో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ టెలర్ ఫ్రిట్జ్ (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్ పోటీల్లో విజయం సాధించి ముందంజ వేశారు. మహిళల విభాగంలో 9వ సీడ్ ఎలినా రిబకినా (కజకిస్థాన్), టౌన్ సెండ్ (అమెరికా) ఓటమి పాలయ్యారు. మార్కెటా వొండ్రుసొవా (చెక్) క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. అగ్రశ్రేణి క్రీడాకారిణి సబలెంక ప్రిక్వార్టర్ ఫైనల్లో దూకుడైన ఆటను కనబరిచింది. స్పెయిన్‌కు చెందిన క్రిస్టినా బుస్కాతో జరిగిన పోరులో సబలెంక ఎలాంటి ప్రతిఘటన లేకుండానే విజయాన్ని అందుకుంది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన సబలెంక 61, 64తో జయభేరి మోగించింది. తొలి సెట్‌లో అరినాకు ప్రత్యర్థి నుంచి ఎలాంటి పోటీ ఎదురు కాలేదు.
Also Read: ప్రపంచ రికార్డు సమం చేసిన కుర్రాడు.. అన్ని వికెట్లు అలాగే..
తన మార్క్ షాట్లతో అలరించిన సబలెంక అలవోకగా సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో మాత్రం అరినాకు ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైంది. క్రిస్టినా కూడా నిలకడైన ఆటతో అలరించింది. కానీ కీలక సమయంలో మళ్లీ ఒత్తిడికి గురైంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన సబలెంక సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మరో పోటీలో వొండ్రుసొవా విజయం సాధించింది. స్టార్ క్రీడాకారిణి, టైటిల్ ఫేవరెట్‌లలో ఒకరిగా భావించిన ఎలినా రిబకినాతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో వొండ్రుసొవా జయకేతనం ఎగుర వేసింది. నువ్వానేనా అన్నట్టు సాగిన హోరాహోరీ సమరంలో వొండ్రుసొవా 64, 57,62తో రిబకినాను ఓడించింది.
తొలి సెట్‌లో ఆసక్తికరంగా సాగింది. అయితే ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన వొండ్రుసొవా సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో కూడా ఇద్దరు సర్వం ఒడ్డి పోరాడారు. ఇటు రిబకినా అటు వొండ్రుసొవా ప్రతిపాయింట్ కోసం సర్వం ఒడ్డారు. కానీ చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన రిబకినా టైబ్రేకర్‌లో సెట్‌ను దక్కించుకుంది. కానీ ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో మళ్లీ వొండ్రుసొవా మళ్లీ పుంజుకుంది. రిబకినాపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ లక్షం దిశగా సాగింది. చివరికి అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ముందంజ వేసింది. మరో పోటీలో బార్బొరా క్రెజ్సికొవా (చెక్)విజయం సాధించింది. అమెరికాకా క్రీడాకారిణి టౌన్‌సెండ్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో బార్బొరా 16, 76, 63తో జయకేతనం ఎగుర వేసింది.