దేశచరిత్రలో స్వాతంత్య్రోద్యమం, సామాజిక సంస్కరణలు, గాంధేయ సిద్ధాంతాల అనుసరణ, ప్రజాసేవలు, సాహిత్య వికాసం వంటి రంగాల్లో చిరస్మరణీయ కృషి చేసిన మహనీయులలో కరీంనగర్ గాంధీగా పేరు గాంచిన బోయినిపెల్లి వెంకట రామారావు ఒకరు. ఆయన జీవితం అనేది కేవలం వ్యక్తిగత ప్రయాణం కాక, స్వాతంత్య్ర పోరాటం నుంచి సమాజ హితానికి అంకితం అయిన ఒక యుగ చరిత్ర. 1920 సెప్టెంబర్ 2న కరీంనగర్ జిల్లా తోటపెల్లిలో పద్మనాయక కుటుంబంలో జన్మించిన వెంకట రామారావు చిన్ననాటి నుంచే స్వతంత్ర ఆలోచనలతో పెరిగారు. మహాత్మా గాంధీ ఆలోచనలకు, ఆర్యసమాజ ప్రభావానికిలోనై, అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ, సమాజంలో సమానత్వం కోసం కృషి ప్రారంభించారు.
నిజాం పాలనలో ఉర్దూ మీడియం బలవంతపు అమలుకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిలబడి, రైతాంగ సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర వహించారు. 1935 చివరలో సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర మహాసభలో స్వచ్ఛంద దళనేతగా వ్యవహరించి యువతలో చైతన్యం నింపారు. 1940లో చిల్వాకోడూరు, 1948లో జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో వితంతు పునర్వివాహాలు నిర్వహించి, సమాజ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 1945లో హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించి సహపంక్తి భోజనాన్ని నిర్వహించడం ఆయన సంస్కరణాత్మక దృక్పథానికి నిదర్శనం. స్వాతంత్య్ర సమరయోధుడిగానే కాక విలేకరిగా కూడా ఆయన సేవలు అశేషం. సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలోని గోల్కొండ పత్రికలో విలేకరిగా పనిచేశారు.
నిజాం పాలన ఆయనకు భయపడింది. కుటుంబ సభ్యులను వేధించి, తండ్రి కొండల్ రావును మాలీ పటేల్ పదవి నుంచి తొలగించారు. ఆయన తలపై బహుమతి కూడా ప్రకటించారు. జమ్మికుంట రైల్వే లైను తొలగింపు కుట్ర కేసులో జైలుకు పంపబడ్డారు. 1948లో జైలులోనే గాంధీ హత్య వార్త విని, సంతాప సభ నిర్వహించారు. స్వాతంత్య్రానంతరం ఆయన కేవలం రాజకీయ కార్యకలాపాలకు పరిమితం కాలేదు. గ్రామీణ పరిశ్రమలకు, ఖాదీ ఉద్యమానికి అంకితమయ్యారు. 1981లో ఖాదీ నవనిర్మాణ సమితిని స్థాపించి గ్రామీణ చేతివృత్తులను ప్రోత్సహించారు. అఖిల భారత సర్వసేవా సంఘంలో సభ్యునిగా వ్యవహరించి గాంధేయవాదానికి అంకితమయ్యారు. 1994లో నందమూరి తారకరామారావు ప్రభుత్వం మద్యనిషేధం అమలు చేసినప్పుడు జిల్లా కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు.
తరువాత చంద్రబాబు నాయుడు మద్యనిషేధాన్ని ఉపసంహరించుకున్నపుడు దీక్షలు, సత్యాగ్రహాలు నిర్వహించారు. సామాజిక సేవలతోపాటు సాహిత్యాభివృద్ధికీ విశేష కృషి చేశారు. 1939లో కేవలం 19ఏళ్ల వయసులో ఆంధ్ర విద్యాభివర్థినీ గ్రంథాలయాన్ని స్థాపించారు. మరణించే వరకూ (93 ఏళ్ల వయసు వరకు) ఈ గ్రంథాలయాన్ని కొనసాగించారు. గ్రంథాలయోద్యమానికి జీవితాన్నే అర్పించారు. హైదరాబాద్లో ‘దక్షిణ భారత హిందీ ప్రచారసభ’ వ్యవస్థాపక సభ్యులు. జిల్లా గ్రంథాలయ సంస్థకు పలుమార్లు అధ్యక్షుడిగా పని చేశారు. 1962లో కరీంనగర్ జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించి, కవిసామ్రాట్, దివాకర్ల, వానమామలై, ధూపాటి, ఖండవల్లి, పల్లా దుర్గయ్య, దాశరథి, సినారె, శేషేంద్రశర్మ, పోరంకి, దేవులపల్లి, గజ్జెల మల్లారెడ్డి, కాళోజీ, శతావధాని కృష్ణమాచార్య, పివి నరసింహారావు, చొక్కారావు ఆదిగా తమ సంస్థ ద్వారా సన్మానితుల గావించారు.
సినారె సహకారంతో కరీంనగర్ జిల్లా రచయితల భవనం, సారస్వత జ్యోతి మండలి భవనం నిర్మించారు. చరిత్ర పరిశోధనలోనూ ఆయన ఆసక్తి విశేషం. ధూపాటి వెంకటరమణాచార్యులు, బిఎన్ శాస్త్రిలతో కలిసి కరీంనగర్ ప్రాంత చరిత్ర, శాసనాలపై పరిశోధన చేశారు. పురావస్తు వస్తువులు, తాళపత్రాలు, రాతి శాసనాలు సేకరించి వాటిని సంరక్షించారు. జిల్లా చరిత్ర, దేవాలయాలు, స్వాతంత్య్ర సంగ్రామం నాటి అనుభవాలు వంటి వ్యాస సంకలనాలు, ఆంధ్ర మహాసభలు నిర్వహణ పుస్తకం, గేయాలు వంటి రచనలు వెలువరించారు. ఆయన చేసిన కృషికి అనేక పురస్కారాలు లభించాయి. 2001లో భారతమాత పురస్కారం, లైఫ్ అఛీవ్మెంట్ అవార్డు, బంగారు కంకణం పొందారు. గాంధీ మనుమరాలు చేతులమీదుగా లక్షరూపాయల నగదు అందుకున్నారు.
గ్రంథాలయ విభూషణ్, ఉపన్యాస కేసరి, హరిజన బంధు, అపరగాంధీ వంటి బిరుదులతో సత్కరింపబడ్డారు. 2005లో కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ బిరుదు ప్రదానం చేసింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన స్వాతంత్య్ర సమరయోధుల ఎంపిక కమిటీ రాష్ట్రాధ్యక్షుడిగా, జాతీయ కమిటీ సభ్యునిగా సేవలందించారు. 2014 అక్టోబర్ 27న 93 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సహా పలువురు ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. రాజేంద్రప్రసాద్, నెహ్రూ, శాస్త్రి, ఇందిరా గాంధీ, వినోబాభావే, జయప్రకాశ్ నారాయణ్ వంటి మహనీయులతో కలసి పనిచేసిన బోయినిపెల్లి వెంకట రామారావు కరీంనగర్ గాంధీగా చిరస్మరణీయులయ్యారు. ఆయన జీవితం గాంధేయవాదం, సమాజసేవ, సాహిత్యాభివృద్ధి, చరిత్ర సంరక్షణలతో సమన్వయమైన ఒక గొప్ప యుగప్రస్థానం. నిజంగా ఆయన పేరు తెలంగాణ ప్రజా చరిత్రలో అజరామరంగా నిలిచిపోయింది.
Also Read : శ్రీపాదరావు చెస్ ట్రోఫీ విజేత జోయల్
- రామ కిష్టయ్య సంగనభట్ల, 94405 95494
- నేడు బోయినిపెల్లి జయంతి