తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచిందనే సామెత అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ విషయంలో రుజువైంది. రష్యానుంచి భారత్ చమురును భారీయెత్తున కొనుగోలు చేస్తోందనే సాకుతో యాభై శాతానికి పైగా సుంకాలు విధించిన ఈ మహానుభావుడు, అది చాలదన్నట్లు భారత్‌ను లక్ష్యంగా చేసుకోవాలంటూ ఐరోపా దేశాలకు పిలుపునివ్వడం తెంపరితనం కాక మరేమిటి? తమ మాదిరే భారత్‌పై ఆంక్షలు విధించాలన్న విజ్ఞప్తికి ఆయా దేశాలనుంచి స్పందన లేకపోవడం ట్రంప్‌కు ఒక విధంగా చెంపపెట్టే! ఆసియాలో భారత్‌తో కోరి విరోధం తెచ్చుకుంటే తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్లు అవుతుందనే వాస్తవం ఐరోపా దేశాలకు తెలుసు కాబట్టే ట్రంప్ మాదిరి దూకుడుగా నిర్ణయం తీసుకోకుండా విజ్ఞతతో వ్యవహరిస్తున్నాయి.
వాస్తవానికి, రష్యానుంచి భారీయెత్తున చమురు కొనుగోలు చేస్తున్న దేశాలలో అగ్రస్థానం చైనాది. రష్యా మొత్తం క్రూడాయిల్ ఎగుమతుల్లో చైనా కొనుగోళ్లు 47 శాతానికి పైమాటే. ఈ జాబితాలో భారత్ 38 శాతంతో రెండోస్థానంలో ఉంది. ఇలా చూస్తే, చమురు కొనుగోళ్ల ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న దేశాలలో ప్రథమ స్థానం చైనాదే అయినా ఆ దేశంపై ఆంక్షలు విధించకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక అమెరికా లెక్కలు వేరు. రష్యానుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా, దానిని శుద్ధి చేసి, ప్రపంచ మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ చమురును కొనుగోలు చేస్తున్నవాటిలో ఐరోపా దేశాలు కూడా ఉండటమే ట్రంప్ ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. చైనాపై అధిక సుంకాలు విధిస్తే, ప్రపంచ చమురు మార్కెట్ అతలాకుతలమవుతుంది. ఆ ప్రభావం ఐరోపాతో సహా అన్ని దేశాల మీదా పడుతుంది.
మరో సంగతి ఏమిటంటే, ఐరోపాకు చెందిన కొన్ని దేశాలు కూడా రష్యానుంచి చమురును కొనుగోలు చేస్తున్నాయి. మాస్కో ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కాకుండా చమురు కొనుగోళ్లకు అడ్డుకట్ట వేయాలని, ఉక్రెయిన్ యుద్ధానికి చరమగీతం పాడాలనే చిత్తశుద్ధి ఉంటే ఒక్క భారత్‌ను మాత్రం అదుపులో పెట్టాలనుకోవడం వల్ల ఒరిగేదేం ఉండదు. చైనాతో పోలిస్తే భారతీయ ఎగుమతుల విలువ చాలా స్వల్పం. కాబట్టి ఆంక్షలు విధించడం ద్వారా భారత్‌ను ఇట్టే దారికి తెచ్చుకోవచ్చునన్న ట్రంప్ అంచనాలు పురిట్లోనే సంధికొట్టాయి. పైపెచ్చు, ఈ వివాదం భారతదేశ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా మారింది. అదే సమయంలో భారత్‌కు చైనా స్నేహహస్తం అందించడంతో ఒక్కసారిగా దౌత్యసంబంధాలలో కొంగొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే బ్రిక్స్ సభ్యత్వ దేశాల మధ్య చివుళ్లు వేస్తున్న స్నేహబంధం ట్రంప్ పుణ్యమాని మరింత బలోపేతమైంది.
చైనా, రష్యా, భారత్ చేతులు కలపడం, తాజాగా తియాన్ జిన్ నగరంలో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు వేదికగా మోడీ, షీ జిన్‌పింగ్, పుతిన్ వాణిజ్య, దౌత్య సంబంధాల బలోపేతం విషయమై చర్చలు సాగించడం అమెరికాకు సుతరామూ ఇచ్చగించదనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలపై ట్రంప్ ఆంక్షల కొరడా ఝళిపించినాఆశ్చర్యపోనక్కరలేదు. ఇప్పటికే బ్రిక్స్ సభ్యత్వ దేశాలైన ఇండియా, బ్రెజిల్ పై చెరో 50 శాతం చొప్పున, చైనా, దక్షిణాఫ్రికాపై చెరో 30 శాతం చొప్పున సుంకాలు విధిస్తున్న అమెరికా, తియాన్ జిన్‌లో చోటు చేసుకునే పరిణామాలను బట్టి ఇతర దేశాలపైనా సుంకాలు పెంచే అవకాశం లేకపోలేదు. పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి తెర దించేందుకు ఏర్పడిన కూటమిగా భావిస్తున్న ట్రంప్, ఇదివరకే బ్రిక్స్ దేశాలపై అదనపు సుంకాలు విధిస్తానంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
తన అర్థం పర్థం లేని విధానాలతో స్నేహితులను కూడా శత్రువులను చేసుకుంటున్న ట్రంప్, జరగబోయే అనర్థాలను ఊహించలేకపోతున్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అంటూ నినదించి, అమెరికన్లకు అరచేతిలో వైకుంఠం చూపించి పదవిలోకి వచ్చిన ట్రంప్, వాస్తవానికి అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టడం అటుంచి, ఆ దేశ పరువును బజారుకీడుస్తున్నారు. ట్రంప్ లోపభూయిష్టమైన విధానాల కారణంగా బ్రిక్స్ మరింత బలోపేతమైతే, అది అమెరికా అభివృద్ధికి పెనుసవాలుగా మారుతుందని ఇప్పటికే పలువురు ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాలర్‌పై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ కరెన్సీని ఏర్పాటు చేసుకోవాలన్నది బ్రిక్స్ దేశాల అభిమతం. ఇప్పటివరకూ ఉప్పూనిప్పూలా ఉన్న చైనా, భారత్ తాజాగా చేతులు కలిపిన నేపథ్యంలో బ్రిక్స్ ఆశయం నెరవేరితే అమెరికా తాను తీసుకున్న గోతిలో తానే పడటం ఖాయం.
Also Read : వాళ్లను నక్సలిజం వైపు మళ్లించే కుట్ర జరుగుతోంది: బండి సంజయ్