తమ పార్టీలో అవినీతిపరులకు చోటు లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌పై మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. కవిత బిజెపిలోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతుందన్న ప్రస్తావనపై స్పందిస్తూ తమ పార్టీలో అవినీతిపరులకు స్థానం లేదని స్పష్టం చేశారు. మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఆర్ఎస్ కూలిందని లక్ష్మణ్ విమర్శించారు. కాళేశ్వరం మూడు పిల్లర్లు కూలిపోతే, బీఆర్ఎస్ మూడు ముక్కలు అయ్యిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత బహిరంగంగా హరీష్ రావు, సంతోష్‌రావులు అవినీతికి పాల్పడ్డారని చెప్పారని అన్నారు. హరీష్ రావు, సంతోష్ అవినీతి అనకొండలు అని కూడా చెప్పిందని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం అవినీతి కేసులో కెసిఆర్‌ను బలిపశువును చేశారని కవిత ఆవేదన చెందుతూ మాట్లాడిన విషయాన్ని ప్రస్తావిస్తూ అంటే హరీష్ రావు, సంతోష్ రావుల అవినీతి కేసీఆర్‌కు తెలుసా అనే అనుమానాన్ని లక్ష్మణ్ వ్యక్తం చేశారు.కాళేశ్వరం అవినీతిలో అధికారులు, కాంట్రాక్టులు ఎవరున్నా విచారణ జరిపి వారిని శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పైనా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు మీ ప్రభుత్వమే కాళేశ్వరం అవకతవకలు, అవినీతిపై సిబిఐ విచారణ కోరిన నేపధ్యంలో రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించి విచారణకు సహకరించాలని సూచించారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంశంపై సిబిఐ విచారణ కోరడాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని వెల్లడించారు. అయితే ఘోష్ కమిషన్ నివేదికలో క్రిమినల్ రిఫరెన్స్ లేకుండా నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్ల పాత్ర ఏమిటో స్పష్టంగా చెప్పలేదని ఆరోపించారు. సిబిఐతో విచారణ చేయించే నిర్ణయం రావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 22 నెలలు ఎందుకు ఆలస్యం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరుల త్యాగాలను కేసీఆర్ కుటుంబం క్యాష్ చేసుకుని కోట్లకు పడగలు ఎత్తిందని మండిపడ్డారు. నిష్పక్షపాతంగా సీబీఐ దర్యాప్తు జరగాలి, అవినీతిపరులకు శిక్ష పడాలని ఆయన డిమాండ్ చేశారు.