మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన మేరకు చేవేళ్ళ ప్రాణహిత ప్రాజెక్టును తుమ్మడిహెట్టి వద్దే నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ప్రాథాన్యత సంతరించుకుంది. వ్యవసాయం దండగ కాదు పండగ చేయాలని, రైతును రాజు చేయాలని వైఎస్ కన్న కలలను తాము సాకారం చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాణహిత చేవేళ్ళను పూర్తి చేస్తామని, రంగారెడ్డి జిల్లాకు నీరు అందిస్తామని, ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ను పూర్తి చేసి రంగారెడ్డి జిల్లాకు, నల్లగొండలో ఫ్లొరైడ్‌తో బాధ పడుతున్న వారిని ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని దస్ పల్లా హోటల్‌లో వైఎస్ ప్రాణ మిత్రుడైన కెవిపి రాంచందర్ రావు ఏర్పాటు చేసిన వైఎస్సార్ మెమోరియల్ అవార్డ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సేంద్రీయ ఎరువులను ప్రోత్సహిస్తున్న సుభాష్ పాలేకర్, డాక్టర్ సి.నాగేశ్వరరావు, సి.పద్మకు వైఎస్‌ఆర్ మెమోరియల్ అవార్డును అందించారు.
సుభాష్ పాలేకర్‌కు కెవిపి తన మనవళ్ళ చేతుల మీదుగా రూ.25 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కొంత మంది తన వద్దకు వచ్చి మీకు కేవీపీ రామచంద్రరావును అవుతానని తనతో అంటారని, కానీ ఈ తరానికి ఒకే వైఎస్‌ఆర్, ఒకే కేవీపీ ఉంటారని వాళ్లతో తాను చెప్తుంటానని సీఎం రేవంత్ తెలిపారు. జీవితాంతం ఒక మిత్రుడికి తోడుగా ఉండి అన్నీ చేసిపెట్టడం గొప్ప విషయమన్న సీఎం కేవీపీ కావడం అంత తేలికైన విషయం కాదన్నారు. ఎవరూ అలా ట్రై చేయొద్దని, కొంచెం పక్కకు జరిగితే ఆ సీట్లో కూర్చోవడానికే ప్రయత్నించేవాళ్లు ఎక్కువ ఉన్నారని చమత్కరించారు. ఇవాళ ఉచిత విద్యుత్‌ను ఎవరు ఇచ్చినా వైఎస్‌ఆర్‌నే గుర్తుకు తెచ్చుకుంటారని, భవిష్యత్‌లోనూ ఎవరూ రద్దు చేయలేని పథకాలను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలను రద్దు చేసే ధైర్యం ఎవరికీ లేదని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తిని ఈ ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలిపారు.
రసాయన ఎరువుల కొనుగోలు రూపంలో మన లక్షల కోట్ల సంపద విదేశాలకు వెళ్తోందని, మన సంపద విదేశాలకు వెళ్లొద్దు అంటే రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని సూచించారు. సుభాష్ పాలేకర్ స్ఫూర్తిగా తీసుకుని రైతులు సేంద్రీయ ఎరువును అనుసరించాలని అన్నారు. ఫ్లోరైడ్ వల్ల జీవించలేని పరిస్థితులు ఉన్న నల్గొండ జిల్లాను మార్చాలని వైఎస్‌ఆర్ భావించారని, తాగు, సాగునీరు ఇచ్చే లక్ష్యంతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను పక్కకు పెట్టిందని, పదేళ్లు పనులు ఆగిపోవడంతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తి చేస్తామని సీఎం ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనలను, కాంగ్రెస్ బావ జాలాన్ని రాష్ట్రంలోని ప్రజా ప్రభు త్వం అమలు చేస్తూ ముందుకు పోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 10 లక్షల కు పెంచాం, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం, తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా కింద అన్నదాతల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. వైయస్ వేసవిని లెక్క చేయకుండా తన సుదీర్ఘ పాదయాత్రలో తాడిత, పీడితులు, రైతుల సమస్యలను అవగాహన చేసుకున్నారు. భారతదేశంలో ఎవరైనా ఉచిత విద్యుత్తు అందజేస్తున్నారు అంటే అది వైయస్ రాజశేఖర్ రెడ్డి పేటెంట్ అన్నారు. 2007లో మొదటిసారి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నుంచి శాసన పరిషత్‌కు తాను ఎంపిక అయ్యేందుకు వైయస్ ప్రత్యేక చొరవ తీసుకోవడం మూలంగా గెలిచి వచ్చానని వివరించారు.