Wednesday, September 3, 2025

బీహార్ ఇసికి ఇదో అగ్నిపరీక్ష

- Advertisement -
- Advertisement -

బీహార్‌లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను గడువు ముగిసిన తరువాత కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు సెప్టెంబర్ 1న ఇచ్చిన తీర్పు జాబితా నుంచి మినహాయించిన ఓటర్లకు ఒక అవకాశంగా పేర్కొనవచ్చు. దీనికి స్పందనగా ఎన్నికల కమిషన్ కూడా గడువు తరువాత వచ్చిన అభ్యంతరాలను, మార్పులు, చేర్పులను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. అయితే వాటిని ఓటర్ జాబితా ఖరారైన తరువాతనే పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు సవరణలు కొనసాగుతాయని సుప్రీం కోర్టుకు ఎన్నికల కమిషన్ తెలియజేసింది.

Also Read: హద్దులు దాటుతున్న విదేశాంగ విధానం

ఇది స్వాగతించదగిన చర్య. దీనివల్ల జాబితా నుంచి మినహాయింపు పొందిన ఓటర్లు తమ ఆధార్ కార్డు ద్వారా జాబితాలో తిరిగి చోటు పొందవచ్చు. అయితే ఎన్నికల కమిషన్ వెల్లడించిన సంఖ్యలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఫారమ్ 6 ఉపయోగించి కొత్తగా 15 లక్షల మంది ఓటర్లు నమోదు కాగా, తొలగించబడిన 65 లక్షల ఓటర్లలో కేవలం 33,000 ఓటర్లే తమను తిరిగి చేర్చుకోవాలని దరఖాస్తులు చేయడం గమనార్హం. ఈ భారీ వ్యత్యాసం ఈ రెండు కేటగిరీ ఓటర్లు ఫారం 6 నే ఉపయోగించడంతో కోర్టుకు సమర్పించిన డేటాలో గందరగోళానికి దారితీసింది. దీంతో ఎన్నికల కమిషన్‌కు, రాజకీయ పార్టీలకు మధ్య పెద్ద వివాదం చోటుచేసుకుంది. జాబితా నుంచి మినహాయించిన ఓటర్లకు సహకరించడంలో పార్టీలు విఫలమయ్యాయని ఎన్నికల కమిషన్ వాదిస్తోంది. తాము అభ్యంతరాలను సమర్పించినా బ్లాక్ స్థాయి అధికారులు సరిగ్గా పరిశీలించడం లేదని పార్టీలు ఆరోపిస్తున్నాయి. అవకతవకలపై తమ పార్టీకి చెందిన బూత్‌స్థాయి ఏజెంట్లు ఎన్నికల సంఘానికి 89 లక్షల ఫిర్యాదులు సమర్పించారని, కానీ వాటన్నిటినీ ఎన్నికల కమిషన్ తిరస్కరించిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేడా ఆరోపించారు.

ఈ సవాళ్లను గమనించిన సుప్రీంకోర్టు బీహార్‌లోని ఓటర్లుకు, పార్టీలకు సహకరించడానికి పారా లీగల్ వాలంటీర్లను వినియోగించుకోవాలని బీహార్ రాష్ట్ర లీగల్ సర్వీస్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిపై రహస్య నివేదికను జిల్లా జడ్జిలకు సమర్పించాలని ఆ వాలంటీర్లకు ఆదేశించింది. ఈ విధంగా కోర్టు జోక్యం చేసుకోవడం డేటా ఆధారిత పరిశోధనలను ప్రతిబింబిస్తుంది. అలాగే జాబితాలోంచి ఓటర్ల మినహాయింపులో అసాధారణ పద్ధతులను అవలంబించారని ఆంగ్లపత్రిక కథనం వెలువడడం కూడా సుప్రీం కోర్టు గమనించింది. తొలగించిన ఓటర్ల వివరాలను ఎన్నికల కమిషన్ సమర్పించగా వాటిని పరిశీలిస్తే ఎన్నో లోపాలు కనిపించాయని ఆ పత్రిక తన అధ్యయనంలో పేర్కొంది. పోలింగ్ స్టేషన్లవారీగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. 80 పోలింగ్ స్టేషన్ల పరిధిలో యువత మరణాలే అత్యధికంగా ఉన్నాయని ఎన్నికల కమిషన్ పేర్కొం ది. 127 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్ల తొలగింపులో లింగ వ్యత్యాసం భారీగా కనిపించింది.

7216 పోలింగ్ స్టేషన్ల పరిధిలో అత్యధిక మరణాలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. 973 పోలింగ్ కేంద్రాల పరిధిలో నూటికి నూరు పాళ్లు మృతులైన ఓటర్లే జాబితానుంచి తొలగించబడ్డారని ఎన్నికల కమిషన్ పేర్కొంది. 5084 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్ల గైరుహాజరు అత్యధికంగా నమోదైంది. 663 పోలింగ్ కేంద్రాల పరిధిలో మహిళా ఓటర్లు శాశ్వతంగా మరో ప్రాంతానికి తరలిపోయినట్టు గుర్తించడమైంది. క్షేత్రస్థాయి అధ్యయనాలే ఈ పొరపాట్లను ఎత్తి చూపాయి. భారీ ఎత్తున పొరపాట్లను సవరించడం తప్పనిసరి. సంకుచిత రాజకీయాలకు అతీతంగా, వాస్తవంగా తొలగింపబడిన అసలు సిసలైన ఓటర్లకు సహాయంగా రాజకీయ పార్టీలు క్రియాశీలకంగా వ్యవహరించవలసిన బాధ్యత ఉంది. భాగస్వాములందరి నుంచి అటువంటి పౌర బాధ్యత ప్రజాస్వామ్య ప్రక్రియలో అవసరం.

ఇక ఎన్నికల కమిషన్ కూడా తన బాధ్యతలను పకడ్బందీగా నెరవేర్చక తప్పదు. ముసాయిదా జాబితాలోంచి తొలగించబడ్డ ఓటర్లలో 99.5% మందిని ఆధార్ ప్రామాణిక ధ్రువపత్రంగా పరిగణించాలి. మినహాయింపు పొందిన ఓటర్లు తమ ఆధార్ కార్డు తగిన ప్రూఫ్‌గా తమ అభ్యంతరాలను సమర్పించవచ్చు. ఇప్పటికే ముసాయిదా జాబితాలో ఉన్న ఓటర్లకు అధికారికంగా ఇది సరిపోతుంది. బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అనుభవం భవిష్యత్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు పాఠంగా ఉపయోగపడుతుంది. దీర్ఘకాలం పాటు విస్తరించిన ఓటర్ల జాబితాల సమగ్ర సవరణకు అనుకూలంగా ఎన్నికల కమిషన్ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని, అతి స్వల్ప గడువు విధానాన్ని, ఎన్నికల కమిషన్ నిషేధించవలసిన అవసరం ఉంది. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను తనిఖీచేసే విధానాన్ని అవలంబించాలి.

అంతే తప్ప ఆదరాబాదరాగా ఓటర్ల జాబితాల ప్రక్రియను చేపడితే స్వచ్ఛమైన, స్పష్టమైన ఓటర్ల జాబితా తయారు కాదు. దానివల్ల ఓటర్ల హక్కుల కన్నా పరిపాలనా సౌలభ్యానికే ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుంది. ఇదిలా ఉండగా బీహార్‌లో మహాగఠ్ బంధన్ ఆధ్వర్యంలో లోక్‌సభ విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్ర ఓట్ల చోరీ డొల్లతనాన్ని బయటపెట్టింది. ఓట్ల చోరీపై త్వరలో కాంగ్రెస్ పార్టీ హైడ్రోజన్ బాంబును పేల్చబోతోందని రాహుల్ హెచ్చరించారు. బీహార్ ఓటర్ల సవరణ ప్రక్రియ ఎన్నికల కమిషన్‌కు, రాజకీయ పార్టీలకు మధ్య రాజకీయ రగడగా మారడం మంచి పద్ధతి కాదని చివరకు సుప్రీం కోర్టు కూడా హెచ్చరించడం గమనార్హం. ఎన్నికల కమిషన్ తమ పారదర్శకతను నిరూపించుకోవడానికి ఇదో అగ్నిపరీక్ష.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News