ఆగస్టులో 62.9 కి పెరిగిన పిఎంఐ
న్యూఢిల్లీ: ఆగస్టులో భారతదేశ సేవల రంగం రికార్డు స్థాయిలో పనితీరును కనబరిచింది. సే వల రంగం పిఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) 15 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. కొత్త ఆర్డర్లు, ఉత్పత్తిలో వేగవంతమైన పెరుగుదల కారణంగా ఈ వృద్ధి సాధ్యమైంది. ఎస్ అండ్ పి గ్లోబల్ విడుదల చేసిన హెచ్‌ఎస్‌బిసి ఇండియా సర్వీసెస్ పిఎంఐ డేటా ఈ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం, కాలానుగుణంగా సర్దుబాటు చేసిన హెచ్‌ఎస్‌బిసి ఇండి యా సర్వీసెస్ పిఎంఐ జూలైలో 60.5 నుండి ఆగస్టులో 62.9కి పెరిగింది. జూన్ 2010 త ర్వాత ఇది వేగవంతమైన వృద్ధిని చూపుతోంది. డిమాండ్‌లో గణనీయమైన మెరుగుదల, బలమైన కొత్త ఆర్డర్‌లు సేవల కార్యకలాపాలను 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేర్చాయని సర్వే పేర్కొంది.
పిఎంఐ స్కేల్‌లో 50 కంటే ఎక్కువ స్కోరు వ్యాపార కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని అర్థం, 50 కంటే తక్కువ స్కోరు క్షీణతను సూచిస్తుంది. ఆగస్టులో పిఎంఐ 62.9కి చేరుకోవడం సేవా రంగం చాలా వేగంగా విస్తరిస్తోందని సూచిస్తుంది. హెచ్‌ఎస్‌బిసి ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ ప్రాంజుల్ భండారి ప్రకారం, సేవల వృద్ధి 15 సంవత్సరాల గరిష్ట స్థాయిలో ఉంది, కొత్త ఆర్డర్ల పెరుగుదల దానిని బలోపేతం చేసిందని అన్నారు. అయితే ధరల విషయంలో, ద్రవ్యోల్బణం రేటు 9 నెలల గరిష్ట స్థాయికి చేరుకుందని, దీని కారణంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.