సెమీకండక్టర్ మిషన్ రెండో దశ వైపు భారతదేశం ముందుకు సాగుతోందని, భారత్‌లో తయారయ్యే చిన్న సిలికాన్ చిప్‌లు ప్రపంచవ్యాప్తంగా భారీ మార్పును తీసుకొచ్చే రోజులు అతిత్వరలో రానున్నాయని ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం సెమికాన్ ఇండియా సదస్సులో ప్రకటించడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. నేటి సాంకేతికత ఆధారిత ప్రపంచంలో సెమీకండక్టర్లు ఎంతో కీలకమైనవి. దాదాపు ప్రతి పరిశ్రమలోనూ వీటికి విస్తృతమైన డిమాండ్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ), క్వాంటమ్ కంప్యూటింగ్, పునరుత్పాదక ఇంధనం, తదితర రంగాలకు సెమీకండక్టర్ల అవసరం చాలా ఉంటోంది. ఎలక్ట్రానిక్స్‌లో కీలకమైన భాగాలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టివిలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, డిజిటల్ కెమెరాలు ఇలా ఒకటేమిటి ప్రస్తుత ప్రపంచంలో వీటి అవసరం లేని ఏ పరికరం లేదు.
ముఖ్యంగా 2020 నుండి దాదాపు అన్ని ఆధునిక పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు సెమీకండక్టర్లపై ఆధారపడి ఉండటంతో సెమీకండక్టర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. కానీ దీనికి తగ్గట్టు సరఫరా ఉండడం లేదు. కరోనా మహమ్మారి ప్రకంపనలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండడం ఇవన్నీ చిప్‌ల సరఫరాకు తీవ్ర ప్రతిబంధకాలుగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా వీటి కొరత తీవ్రంగా ఉంటోంది. ప్రపంచ వ్యాప్తంగా తైవాన్, దక్షిణ కొరియా, చైనా, అమెరికా దేశాలు సెమీకండక్టర్ల ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే చిప్‌ల్లో 60 శాతం కంటే ఎక్కువ చిప్‌లను తైవాన్ తయారు చేయగలుగుతోంది. దక్షిణ కొరియా శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీల ద్వారా అధునాతన చిప్ తయారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం గణనీయమైన ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది.
టాటా, వేదాంత, అదానీ వంటి కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నాయి. స్వదేశీయంగా మొట్టమొదటి చిప్‌ను ఈ ఏడాది ఆఖరికి తయారు చేస్తామని గత వారం సిజి సెమీ (మురుగప్ప గ్రూపు) ప్రకటించడం విశేషం. కేంద్ర కేబినెట్ నాలుగు సెమీకండక్టర్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కొన్ని రోజులకే సిజి సెమీ ప్రకటన వచ్చింది. ఇప్పుడు 10 సెమీకండక్టర్ల ప్రాజెక్టులు 18 బిలియన్ డాలర్లతో నిర్మాణంలో ఉన్నాయి. టాటా గ్రూపు భాగస్వామ్యం తో తైవాన్ పవర్ చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ చిప్‌ల తయారీకి సిద్ధమైంది. తాజా ఆమోదాలతో 1.6 లక్షల కోట్లతో ఆరు రాష్ట్రాల్లో సెమీకండక్టర్ ప్రాజెక్టులు వస్తుండడం శుభపరిణామం. అయితే చాలా మంది ఈ పెట్టుబడులు, లక్షాలు చాలా స్వల్పంగా వాదిస్తున్నా, కొన్ని దశాబ్దాలుగా ఈ అవకాశాలు లభించని పరిస్థితుల్లో ఈమేరకు ఒక కదలిక రావడం విశేషంగా భావించవచ్చు.
ట్రిలియన్ డాలర్ల ప్రపంచ చిప్ మార్కెట్‌ను అధిగమించేందుకు డిజైన్ అనుసంధానిత రాయితీ పథకాన్ని (డిజైన్ లింక్డ్ ఇన్‌సెంటివ్ స్కీమ్)ను పునరుద్ధరిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం వెల్లడించారు. అమెరికా వంటి దేశాలకు రక్షణ వాదం, ఆయుధీకరణ పెరగడంతో చిప్ వ్యాపారం డిమాండ్ విస్తృతమై ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్ వీటి కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వదేశీ తయారీపై దృష్టి కేంద్రీకరించడం ఎంతో ముఖ్యం. ఈ ప్రాజెక్టులకు తగిన పెట్టుబడులు పెట్టడానికి అంతా సిద్ధమైంది. ఆయా రాష్ట్రాలు కూడా ఈ ప్రాజెక్టుల క్లియరెన్స్‌లో ఎలాంటి జాప్యం లేకుండా సహకరిస్తే భారత దేశంలో రోజుకు 95 మిలియన్ చిప్‌లు తయారు చేయగల సామర్థం లభిస్తుంది. భారత దేశ సెమీకండక్టర్ల మార్కెట్ 2021లో 27.2 బిలియన్ల డాలర్లు కాగా, ఏటా సుమారు 19 శాతం పెరిగి 2023లో 64 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
2026 నాటికి 80 బిలియన్ డాలర్లకు, 2030 నాటికి 110 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచం మొత్తం మీద ఒక ట్రిలియన్ డాలర్ల విలువైన చిప్ విక్రయాల్లో 8 నుంచి 10 శాతం భారత చిప్‌లు చోటు చేసుకుంటాయని భారత్ అంచనా వేస్తోంది. అయితే ఈ ప్లాంట్లకు క్షేత్రస్థాయిలో తగిన మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉంది. చాలా దేశాలు వీటిని భారీ ఎత్తున ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఆ మేరకు సౌకర్యాలు, భారీ రాయితీలు కల్పిస్తున్నాయి. అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల్లో ఈ ప్లాంట్లకు సబ్సిడీలు దాదాపు 388 బిలియన్ డాలర్ల వరకు ఉంటున్నాయి. భారత్‌లో ప్రస్తుతం ఒకే ఒక మెగా ప్లాంట్ నిర్మాణంలో ఉండగా, చైనాలో 44, జపాన్‌లో 12, తైవాన్‌లో 14, యూరప్‌లో 10, అమెరికాలో 15 మెగా ప్లాంట్లు నిర్మాణమవుతున్నాయి.
భారత్‌లో అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (ఒఎస్‌ఎటి), అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్, (ఎటిఎంపి) ప్లాంట్లుకు సంబంధించి ఏడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. డిజైన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ట్రస్టెడ్ బై ద వరల్డ్ అనే పేరు ప్రపంచానికి త్వరలో వినిపించాలంటే ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడం తక్షణ అవసరం. ముఖ్యంగా గమనించవలసిన ఇంకో విషయం దేశంలో సెమీకండక్టర్ల తయారీ నాణ్యత లోపం ఎక్కువగా ఉంటోంది. 2030 నాటికి 5,00,000 నుంచి ఒక మిలియన్ వరకు నిపుణులు కావలసి వస్తుంది. ఈ డిమాండ్‌ను అధిగమించాలంటే స్కిల్ ఇండియా సెమీకండక్టర్ ప్రోగ్రామ్ వంటి ప్రణాళికలను తక్షణం అమలులోకి తీసుకురాకతప్పదు. పారిశ్రామిక రంగం, విద్యారంగం, ప్రభుత్వ భాగస్వామ్యంతో అత్యంత వేగంగా నైపుణ్యాభివృద్ధిని సాధించవలసి ఉంటుంది.
Also Read : చెత్తగాళ్ల వెనుక… నేనెందుకు ఉంటా