Friday, September 5, 2025

అమందా, ఒసాకా సెమీస్‌లోకి..

- Advertisement -
- Advertisement -

సినర్ ముందుకు, స్వియాటెక్ ఇంటికి

న్యూయార్క్: ప్రతిష్ఠాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల (US Open Grand Slam tournament) సింగిల్స్ విభాగంలో జపాన్ స్టార్, 23వ సీడ్ నవోమి ఒసాకా, 8వ సీడ్ అమందా అనిసిమోవా (అమెరికా) సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. మాజీ ఛాంపియన్, రెండో సీడ్ స్వియాటెక్ (పోలండ్) క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్, డిఫెండింగ్ ఛాంపియన్ జన్నిక్ సినర్ (ఇటలీ) సెమీ ఫైనల్లో ప్రవేశించాడు. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన యూకి బాంబ్రీ జోడీ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. 14వ సీడ్‌గా బరిలోకి దిగిన యూకి బాంబ్రీ, మైఖేల్ వెనస్ (బ్రిటన్) జంట క్వార్టర్ ఫైనల్లో జయకేతనం ఎగుర వేసింది.

11వ సీడ్ నికొలా మెక్‌టిక్ (క్రోయేసియా), రాజీవ్ రామ్ (అమెరికా) జంటతో జరిగిన పోరులో బాంబ్రీ జోడీ 63, 67, 63తో విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో అగ్రశ్రేణి ఆటగాడు సినర్ అలవోక విజయంతో సెమీస్‌కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో సినర్ ఇటలీకే చెందిన పదో సీడ్ లొరెంజో ముసెట్టిని మట్టికరిపించాడు. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన సినర్ 61, 64, 62తో ముసెట్టిని ఓడించాడు. తన మార్క్ ఆటతో చెలరేగి పోయిన సినర్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. అద్భుత షాట్లతో అలరించిన సినర్ ఎలాంటి ప్రతిఘటన లేకుండానే వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. సెమీస్‌లో కెనడాకు చెందిన ఫెలిక్స్ అగర్‌తో తలపడుతాడు. మరో సెమీస్‌లో రెండో సీడ్ కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్), ఏడో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) ఢీకొంటారు.

Also Read: హైదరాబాద్ ఫీవర్

ఇగాకు అనిసిమోవా షాక్..

మహిళల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్‌లలో(US Open Grand Slam tournament) ఒకరిగా భావించిన రెండో సీడ్ ఇగా స్వియాటెక్ క్వార్టర్ ఫైనల్లోనే పరాజయం చవిచూసింది. 8వ సీడ్ అమందా అనిసిమోవాతో జరిగిన పోరులో స్వియాటెక్‌కు ఓటమి ఎదురైంది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన అమందా ఎలాంటి ప్రతిఘటన లేకుండానే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అనిసిమోవా 64, 63తో జయకేతనం ఎగుర వేసింది.

యూఎస్ ఓపెన్ టైటిల్‌తో (US Open Grand Slam tournament) మళ్లీ గాడిలో పడాలని భావించిన ఇగాకు నిరాశే ఎదురైంది. అమందా జోరుకు ఎదురు నిలువలేక ఇంటిదారి పట్టింది. మరోవైపు మాజీ నంబర్ వన్ ఒసాకా అసాధారణ ఆటతో సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన 11వ సీడ్ కరొలినా ముచోవాతో జరిగిన హోరాహోరీ పోరులో ఒసాకా 64, 76తో విజయం సాధించింది. ఆరంభం నుంచే ఇద్దరు సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో పోరు చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇక నిలకడైన ఆటను కనబరిచిన ఒసాకా వరుసగా రెండు సెట్లు గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News