Saturday, September 6, 2025

గురువు… లఘువు కాకూడదు!

- Advertisement -
- Advertisement -

భారతీయ సంస్కృతిలో గురువుకి ఇచ్చే ప్రాధాన్యత ఏంటో జగమెరిగిన సత్యం. తల్లిదండ్రుల తర్వాత తమ జీవితంలో గురువుని దేవుడిగా పూజిస్తారు. అందువల్లనే భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాలకు ఆదర్శవంతమైనది. గురువు లేని విద్య గుడ్డి విద్యగా భారతీయ ప్రజలలో సామెతలుగా చెప్పుకుంటారు. అది ఏ రంగమైనా గురువు లేకుండా విద్యను అభ్యసించడం సాధ్యం కాని పని. అందుచేతనే సమాజంలో అద్భుతమైన మార్పులకి పునాది రాళ్లుగా ఉండే గురువు స్థానానికి అంతటి ప్రాధాన్యత ఉన్నది. అది ప్రాచీన భారతీయ సంస్కృతి నుండి నేటి ఆధునిక సమాజం వరకు కొనసాగుతూ ఉన్నది. నేటి సమాజంలో శిష్యులు, గురువుల ముందు గౌరవం, భక్తిశ్రద్ధలు చూయించకపోయినా విద్య నేర్పిన గురువులపైన, ఉపాధ్యాయ వృత్తిపైన చులకన భావనతో ఉండటం అనేది సమాజంలో గురుశిష్యుల మధ్య ఒకనాటి మానవ నైతిక సంబంధాలు క్షీణిస్తున్నాయి అని చెప్పడానికి నిదర్శనం.

ఒక వ్యక్తి ఉన్న స్థానంనుండి ఉన్నత స్థానంలోకి వెళ్లడానికి తల్లిదండ్రుల తర్వాత గురువు చెప్పే బోధనలే అత్యంత ప్రాధాన్యమైనవి. కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అంటే సమాజంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక సాంస్కృతిక విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే బోధనల పైనే ఆధారపడి ఉంటది. గురుశిష్యుల సామాజిక బంధనాల్లో భాగంగా ఆధునిక భారతదేశంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబరు 5 న జరుపుకోవడం అనేది గమనార్హం. మరి ఎందుకు సెప్టెంబర్ 5 ని భారత జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే, భారతదేశానికి రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా, ఒకసారి రాష్ట్రపతిగా పని చేసిన ఉపాధ్యాయ వృత్తినుండి వచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినన్ని పురస్కరించుకొని ఆయన జన్మదినం అయిన సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గమనార్హం.

విద్య అంటే గురువు సహకారంతో సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా గ్రహించడమే నిజమైన విద్య అని గౌతమ బుద్ధుడు రుజువు చేశాడు. కాబట్టి నేటి ఆధునిక ప్రపంచంలో ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు తమకు ప్రభుత్వల నుండి రావలసిన సౌకర్యాలు, ఆర్థిక అంశాల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేస్తారో, అంతే స్థాయిలో విద్యార్థులకి కావాల్సిన మౌలిక సౌకర్యల కోసం, విద్యార్థుల సమస్యలు స్వల్ప వ్యవధిలో పరిష్కారమయ్యేలా ప్రభుత్వాలను తగిన విధంగా సామాజిక పరివర్తన కోసం పనిచేసేలాగా నేటి ఉపాధ్యాయ లోకం కృషి చేయాలి.

అంతే కాకుండా మూఢత్వంతో, సామాజిక అంధత్వంతో ఏ విషయాన్ని కూడా విద్యార్థులు నమ్మి చదువుకొని అజ్ఞానంలో ఉండకుండా, విచక్షణజ్ఞానంతో, మనోనేత్రంతో ప్రతి అంశంలో సత్యాన్ని మాత్రమే విద్యార్థులు చూడగలిగే శక్తిని ఉపాధ్యాయులు బోధించాలి. అంతే స్థాయిలో గురుశిష్యుల మధ్య సామాజిక గౌరవం, భక్తిశ్రద్ధలు ఉండేలా విద్యార్థులకి తల్లిదండ్రులు నేర్పించాలి. అంతే కాకుండా గురువుతో ఏ విధంగా నడుచుకొని తమకు కావలసిన జ్ఞానాన్ని స్వీకరించాలో గురుశిష్యుల బంధం ఆరోగ్యవంతంగా ఉండేలా తమ పిల్లలకి ఆయా మానవత్వ, నైతిక విలువలు తల్లిదండ్రులు పెంపొందించాలి. అదే నేటి తల్లిదండ్రులపై ఉన్న సామాజిక కర్తవ్యం, సామాజిక బాధ్యత అని ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన చారిత్రక సత్యం.

Also Read : మహా గణపతికి నీరాజనం

  • పుల్లెంల గణేష్
  • నేడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News