Saturday, September 6, 2025

ఇకపై తియాన్‌జిన్‌కు ముందు.. తర్వాత!

- Advertisement -
- Advertisement -

ప్రపంచ రాజకీయాలను బహుశా ‘తియాన్‌జిన్‌కు ముందు, తర్వాత’ అనే పద్ధతిలో గమనించవలసిన పరిస్థితి ఏర్పడవచ్చుననిపిస్తున్నది. చైనాలోని తియాన్‌జిన్ నగరంలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీలలో జరిగిన షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఒ) సమావేశాల తీరుతెన్నులు అటువంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ఆ సంస్థ ఏర్పడింది 2001లో. రష్యా, చైనాలతో పాటు మధ్య ఆసియాలోని నాలుగు చిన్నదేశాలతో. సంస్థ అజెండా తీవ్రవాదం, టెర్రరిజం, వేర్పాటువాద ధోరణులు. ఆ కాలంలో ఆ మూడూ కూడా ఆ దేశాలకు సంబంధించిన సమస్యలు. అందువల్ల ఆ సంస్థను తక్కిన ప్రపంచం పట్టించుకోలేదు. తర్వాతి సంవత్సరాలలో ఇండియా మొదలైన మరో నాలుగు దేశాలు చేరినా పరిస్థితి మారలేదు. అటువంటిది, సంస్థ ఏర్పాటైన 24 సంవత్సరాలకు ఇపుడు తియాన్‌జిన్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశం మొత్తం ప్రపంచం దృష్టిని ఎందుకు ఆకర్షించినట్లు? ఈ ప్రశ్నకు మరొక పరిణామాన్ని జోడించి చూడాలి.

మొదటి ‘బ్రిక్’ పేరిట నాలుగు దేశాలతో ఒక సంస్థ ఏర్పడింది 2006లో. అది తర్వాత ‘బ్రిక్స్’ గా మారింది. ఆ సంస్థను 2006 నుంచి ఎవరూ పట్టించుకోలేదు. అటువంటిది 18ఏళ్ల తర్వాత నిరుడు 2024లో రష్యాలోని కజాన్ నగరంలో సమావేశమైనపుడు ప్రపంచమంతా అటు చూసింది. ఎందువల్ల? ఈ రెండు సమావేశాలు జరిగింది ఒకటి రష్యాలో కాగా, మరొకటి చైనాలో కావటం గమనించదగ్గది. భారతదేశానికి ఈ రెండింటిలోను సభ్యత్వం ఉంది. మరొక వైపు ఎస్‌సిఒ సభ్యత్వం ఇపుడు 10కి పెరిగి తియాన్‌జిన్‌లో మరొక 16 దేశాలు, అనేక అంతర్జాతీయ సంస్థలు పరిశీలకులుగా హాజరయ్యాయి.

ఆ సంస్థ అ జెండా ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక అంశాలకు విస్తరించింది. అదే విధంగా బ్రిక్స్‌లో కజాన్ తర్వాత మొన్నటి జులైలో రియో డి జనేరో(బ్రెజిల్) సమావేశాల కల్లా సభ్యత్వం డజనుకు పెరిగి, అనుబంధ దేశాలు మరొక డజను అయి, దరఖాస్తుదారులు ముప్పయి వరకు అయారు. ఈ విధంగా రెండు వర్ధమాన దేశాలలో కనిపిస్తున్న దేశాలు ఆసియా,ఆఫ్రికా, దక్షిణ అమెరికాలలో కలిసి 50కి దాటిపోయాయి. ఇవి అన్నీ అమెరికా శిబిరానికి బయటి దేశాలు కావటం విశేషం. కజాన్, రియో డి జనేరోల నుండి ముందుకు సాగి తియాన్‌జిన్‌కు చేరే సరికి ప్రపంచ ముఖచిత్రం 20 ఏళ్లలో ఏవిధంగా మారిందో, సమగ్రంగా కాకున్నా కనీసం ధోరణుల రీత్యా కనిపిస్తున్నదే. మన ప్రభావం ఏమిటో మన కన్న ఎక్కువగా ప్రత్యర్థికి అర్థమవుతుందంటారు. ఆ విధంగా చూసినపుడు ఈ పరిణామాల పట్ల అమెరికా శిబిరపు స్పందనలు, చర్యలు ఏవిధంగా ఉన్నాయో కూడా చూస్తున్నాదే.

వర్ధమాన దేశాలపై వారి ఆగ్రహం, హెచ్చరికలు కజాన్‌తో మొదలై తియాన్‌జిన్ నాటికి తీవ్రరూపం తీసుకున్నాయి. చలిచీమలపై బలవంతమైన సర్పపు ఆగ్రహానికి కారణాలను ప్రత్యేకంగా వెతకనక్కరలేదు. అయితే ఇది పూర్తిగా వారు చేజేతులా చేసుకున్నది. వెనుకబడిన దేశాలను వందల సంవత్సరాల మెర్కంటైలిజం, మెర్కంటైల్ సామ్రాజ్యవాదం, వలసవాదం, నయావలసవాదం, ఆర్థిక సామ్రాజ్యవాద రూపాలలో దోచుకుని సంపన్న దేశాలుగా, సైనిక సామ్రాజ్యాలుగా మారిన వారికి ఈ మార్పులు ఎంతమాత్రం సరిపడవు. వలస పాలనలు 1940ల నుంచి ఆరంభించి ముగిసిన వెనుక ఏర్పడిన అలీనోద్యమాన్ని, సోషలిస్టు వ్యవస్థలను బలహీనపరిచి, తమ యథేచ్ఛాపూరితమైన పెట్టుబడిదారీ వ్యవస్థలకు, ఏకధ్రువ ప్రపంచానికి ఇపుడు కొత్తగా బ్రిక్స్, ఎస్‌సిఒ రూపంలో ముందుకు వస్తున్న సవాళ్లను వారు ఎంతమాత్రం సహించే పరిస్థితిలో లేరు.

కాని వారి వత్తిళ్లకు, బెదిరింపులకు లొంగక ప్రత్నామ్నాయంగా బహుళ ధ్రువ ప్రపంచాన్ని, ప్రజాస్వామికమైన అంతర్జాతీయ వ్యవస్థలను ఆర్థికంగా, కరెన్సీ పరంగా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సృష్టించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.కజాన్ రియో తియోన్‌జిన్‌లకు ముందువెనుకల గల పరిస్థితులు ఇవి. చరిత్రలో ఒక సామ్రాజ్యపు పతనం ఎప్పుడైనా తన లోపాలతోనే మొదలైంది. ఇటీవలి కాలానికి వస్తే అమెరికాకు ముందటి బ్రిటిష్, ఫ్రెంచ్, జార్, ఛింగ్ సామ్రాజ్యాలకు అదే అనుభవం ఎదురైంది. గత 35 సంవత్సరాలుగా ఏకైక ప్రపంచశక్తిగా ఆవిర్భవించిన అమెరికా, తన ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ప్రపంచమంతటి నుంచి సహజ వనరులను, మార్కెట్లను వీలైనంతవరకు తన అధీనంలోకి తీసుకుంది.

అనేక దేశాలలో రాజకీయ, సైనిక నాయకత్వాలను అదుపులో పెట్టుకుంది. అవసరమైనపుడు వాటిని కూలదోసింది. అంతగా తన తరహా సంస్కృతిని, విలువలను వ్యాపింపజేసింది. అంతర్జాతీయ స్థాయిలో తనకు ఉపయోగపడే వ్యవస్థలను సృష్టించింది. నాటో సైనిక కూటమిని మరింత శక్తివంతం చేసి విస్తరిస్తూ, సైనిక బలాన్ని పెంచుకుంటూ, ప్రపంచమంతటా సుమారు 700 సైనిక స్థావరాలను నెలకొల్పింది. దేశాల మధ్య వివాదాలు కల్పించి యుద్ధాలను రెచ్చగొట్టి ఊహించలేనంత స్థాయిలో ఆయుధ వ్యాపారాలు చేస్తున్నది. డాలర్‌ను అంతర్జాతీయ కరెన్సీగా మార్చి అన్ని దేశాల కరెన్నీ మారక వ్యవస్థలను గుప్పిటలో పెట్టుకోవటం ఒకటైతే, ఆధునిక శాస్త్ర సాంకేతికతల ఆధారంగా సర్వీస్ రంగాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతుండటం మరొకటి.

ఇదంతా ఇంతగా చెప్పుకోవటం ఎందుకంటే కజాన్ రియో తియన్‌జిన్‌లకు ముందటి పరిస్థితి ఏమిటో, ఆ పరిస్థితిని భంగపరిచేందుకు ఈ సంస్థలను కేంద్రం చేసుకుని జరుగుతున్న ప్రయత్నాలు ఏదో స్థూలంగా దృష్టికి వచ్చేందుకు. పైన చెప్పుకున్నట్లు అన్ని సామ్రాజ్యాలవలెనే అమెరికన్ సామ్రాజ్య పతనం కూడా తన బలహీనతలతోనే మొదలవుతున్నది. ఆ వివరాలన్నింటిలోకి ఇక్కడ వెళ్లలేముగాని, బ్రిక్స్, ఎస్‌సిఒలను సందర్భంగా తీసుకుని ఇటీవలి కాలాన్ని చూడాలి. అపుడు కనిపించే పరిణామాలలో ముఖ్యమైనవి కొన్నున్నాయి. మొదటిది, ఈ 21వ శతాబ్దారంభం నుంచి మొదలుకొని చైనా మహా వేగంగా బలపడటం. రెండవది, 1991లో సోవియెట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత, సుమారు 2010నుంచి రష్యా తిరిగి పుంజకోవటం.

మూడు, భారత దేశం, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, మలేషియా, ఇరాన్, సౌదీఅరేబియా, టర్కీ మొదలైనవి అమెరికా పరిధికి బయట ఎదుగుతూ బహుళ ధ్రువ ప్రపంచం క్రమంగా ఆవిష్కృతమవుతుండటం. నాలుగు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచబ్యాంకు తదితర అంతర్జాతీయ సంస్థలను అమెరికా అదుపు నుండి సంస్కరణలు ద్వారా బయటకు తెచ్చి ప్రజాస్వామికీకరించాలని, వర్ధమాన దేశాలకు సమాన హక్కులు కల్పించాలనే డిమాండ్లు పెరుగుతుండటం. అయిదు, డాలర్ ఆధిపత్యం తొలగిపోయి వివిధ దేశాల మధ్య స్థానిక కరెన్సీలలో చెల్లింపులకోసం జరుగుతున్న ప్రయత్నాలు ఊపందుకోవటం. ఆరు, ప్రపంచవ్యాప్తంగా వర్ధమాన దేశాలలోని అన్నివర్గాల ప్రజలలో అమెరికన్ శిబిరపు ఆధిపత్యానికి వ్యతిరేకంగా చైతన్యాలు విస్తరిస్తుండటం. ఈ విధమైన పరిణామాల మూలంగా ఒకవైపు అమెరికన్ శిబిరం బలహీనపడుతూ మరొక వైపు బహుళ ధ్రువ ప్రపంచం బలపడుతున్న కారణంగానే రెండింటి మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది.

అమెరికా బలహీనతలలో ఒక ప్రధానమైనది ఆర్థికం గనుక, దానినుంచి బయట పడేందుకు సవ్యమైన వ్యూహం ఏదీ లేని కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ వత్తిడిలో ఒక లెక్కా పత్రం లేని విధంగా ప్రపంచ దేశాలన్నింటిపై విపరీతంగా సుంకాలు పెంచటం, బలవంతపు వాణిజ్య ఒప్పందాలు మొదలుపెట్టారు. అందుకు గురైన దేశాలలో ఇండియా ఒకటి. ఇది తదనంతర పరిణామాలలో రెండు పక్షాలకు కీలకంగా మారింది. వర్ధమాన దేశాలలోని అగ్రరాజ్యాలలో ఒకటైన భారత్‌ను తమ వెంట ఉంచుకుని, చైనా రష్యాల నాయకత్వాన పుంజుకుంటున్న ప్రత్యామ్నాయ సంస్థలను దెబ్బతీయటం, అమెరికా వ్యూహం కాగా, భారతదేశాన్ని తమ వైపు తిప్పుకోగలగటం ఈ ప్రత్యామ్నాయ శక్తుల లక్షం. చివరకు అమెరికా శిబిరపు వైఫల్యాలతో రెండవది జరుగుతున్నట్లు బ్రిక్స్, ఎస్‌సిఒ పరిణామాలు తెలియజేస్తున్నాయి.

మోడీ నాయకత్వాన మొదట కొంత ఊగిసలాడిన భారత ప్రభుత్వం చివరకు, అమెరికా శిబిరంతో సంబంధాలను కొనసాగిస్తూనే అంతిమంగా దీర్ఘకాలంలో బహుళ ధ్రువ ప్రపంచమార్గంలోనే తన ప్రయోజనాలు నెరవేరి, స్థిరపడగలవనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తున్నది. ఈ నిర్ణయం ప్రత్యామ్నాయ శక్తులకు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా, రాజకీయంగా కూడా ఒక కీలకమైన మలుపు, పెద్ద బలం కానున్నది. కజాన్ తియాన్‌జిన్ ముందువెనుకలుగా ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ నిలిచి థియరెటికల్‌గా, తార్కికంగా చూసినట్లయితే భవిష్యత్తు ఈ ప్రత్యామ్నాయ శక్తులకు ఉజ్వలంగానే కనిపిస్తుంది. కాని అందుకు పలు ప్రశ్నార్థకాలు కూడా ఉన్నాయి. అమెరికా కూటమి సైద్ధాంతికంగా, లక్షాలరీత్యా ఒక పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద వ్యవస్థ. పాశ్చాత్య దేశాల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలున్నా వివాదాలు అనదగ్గవి లేవు.

అందుకు భిన్నంగా బ్రిక్స్, ఎస్‌సిఒ దేశాల మధ్య కొన్ని భిన్నత్వాలు, వివాదాలు కూడా ఉన్నాయి. అనేక విషయాలలో వారందరి లక్షాలకు అమెరికన్ కూటమి ఒక దీర్ఘకాలిక, వ్యూహాత్మక ప్రత్యర్థి కావటమన్నది ఒక్కటే వారందరిని కలుపుతున్న విషయం. ఆ విషయంలోని బలం సాధారణమైనదికాదు. అమెరికా శిబిరం మారనంత వరకు వారి ఈ బలం కూడా కొనసాగుతుంది. ఆ కొనసాగుదలపై ఆధారపడి ప్రపంచం ఎంతైనా మారవచ్చు. కనుక అది జాగ్రత్తగా గమనించదగిన విషయమవుతున్నది. తియాన్‌జిన్‌లో మోడీ, జీ జన్‌పింగ్, పుతిన్, ఇతర నాయకులు మాట్లాడింది, తీర్మానించింది వార్తలలో వెలువడినందున, వాటి అర్థాలు, అంతరార్థాలను అందరూ సూక్ష్మంగా గమనించటం అవసరం, ఆ ప్రభావాలు అంతర్జాతీయ స్థాయి నుంచి మన స్థానిక స్థాయి వరకు పలు విధాలుగా రాగల కాలంలో ఉండనున్నందున మరింత అవసరం.

Also Read : జాగృతిలో చీలిక

  • టంకశాల అశోక్ ( దూరదృష్టి)
  • రచయిత సీనియర్ సంపాదకులు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News