ముందస్తు భారీ వర్షాలు ఈ ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయానికి ఒక వరంగా మొదట రైతుల్లో ఆశల జల్లు కురిపించినప్పటికీ, ఆగస్టు నెల మధ్య నుంచి వరుణుని ప్రకోపంతో కుండపోత వర్షాలు, క్లౌడ్‌బర్స్ సంభవించి వ్యవసాయానికి తీరని నష్టం కలుగుతోంది. ఎడతెరిపి లేని ఈ వర్షాలు పంటలపై చీడపీడలకు, తెగుళ్లకు దారితీస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఖరీఫ్ పంటలపై విపరీత ప్రభావం కనిపిస్తోంది. దీంతో ఈ తెగుళ్ల నివారణకు పిచికారీ చేయడం తదితర పనులకు రైతులు అత్యధికంగా ఖర్చు చేయవలసి వస్తోంది. పత్తిపంటపై పచ్చదోమ, వరిపంటపై ఫిజి వైరస్, గుజరాత్‌లో బ్లాక్ గ్రబ్ ఇవన్నీ రైతులను బెదిరిస్తున్నాయి. ఉత్తర భారతంలో ముఖ్యంగా పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము, కశ్మీర్ రాష్ట్రాల్లో పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. పొలాలు జలమయమయ్యాయి.
మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు కూడా ఇదే విధంగా దెబ్బతిన్నాయి. ఒక్క పంజాబ్‌లోనే కోతకు రాకుండా చేలల్లోనే ఉన్న పంటలు 1,50,000 హెక్టార్ల మేరకు నీట మునిగాయి. బాస్మతి, బాస్మతి కాని వరి పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. హర్యానా లోని 12 జిల్లాలకు చెందిన 1402 గ్రామాల రైతులు దాదాపు 2,50,000 హెక్టార్ల మేరకు పంటలను కోల్పోయారని ఆల్ ఇండియా కిసాన్ సభ వెల్లడించింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని 25,000 ఎకరాల యాపిల్ తోటలు ధ్వంసం అయ్యాయి. జమ్మూకశ్మీర్‌లోని వేలాది ఎకరాల వరిపంట తుడుచుపెట్టుకుపోయింది. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఆగస్టు 29 నాటికి దేశంలో 109.28 మిలియన్ హెక్టార్లలో ఖరీఫ్ పంటల విత్తనాలు నాటడం జరిగింది.
గత ఏడాది ఇదే సమయానికి చేపట్టిన సాగు కన్నా 3.25 మిలియన్ హెక్టార్లు ఎక్కువ. వీటిలో వరి, మొక్కజొన్న పంటలే ఎక్కువ. వరి గత ఏడాది కన్నా 2.66 మిలియన్ హెక్టార్ల ఎక్కువగా అంటే మొత్తం 43.19 మిలియన్ హెక్టార్లలో సాగు చేపట్టడం జరిగింది. అలాగే మొక్క జొన్న గత ఏడాది కన్నా ఒక మిలియన్ హెక్టార్లు ఎక్కువగా మొత్తం 9.4 మిలియన్ హెక్టార్లలో సాగవుతోంది. మొదట్లో సేద్యానికి అనుకూల వాతావరణం నెలకొనడంతో ఎరువుల వినియోగం పెరిగింది. గత ఏడాది కన్నా ఈ ఏడాది ఏప్రిల్ జులై మధ్య ఎరువుల విక్రయాలు 14.2% వంతున పెరిగి మొత్తం 12.4 మిలియన్ టన్నుల వరకు అమ్ముడయ్యాయి. అయితే డిమాండ్‌కు తగిన విధంగా ఎరువులు లభ్యంకాక రైతులు పడిగాపులు పడవలసి వచ్చింది. 1980 నుంచి రికార్డులను పరిశీలిస్తే సెప్టెంబర్‌లో ఎప్పుడూ సాధారణం కన్నా సరాసరి 167.9 మి.మీ మించి అధిక వర్షపాతం నమోదు కాలేదు.
కానీ ఈ ఏడాది మాత్రమే సాధారణం కన్నా జూన్‌లో 8.9%, జులైలో 4.8%, ఆగస్టులో 5.2% అధికంగా వర్షపాతం నమోదైంది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో బీహార్, అసోం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు తప్ప దేశంలోని మిగతా ప్రాంతాల్లో సాధారణం నుంచి అసాధారణ వర్షపాతం నమోదైంది. చాలా అస్తవ్యస్తమైన నైరుతిపవనాల సంవత్సరంగా 2025 రికార్డు కెక్కింది. కుంభవృష్టి కురియడమే కాదు, అకాల వర్షాలతో జనజీవనం, వ్యవసాయం ఛిన్నాభిన్నమైంది. ఈ అత్యధిక వర్షాలు అసాధారణమని ఐఎండి (భారత వాతావరణ విభాగం) ఆందోళన వెలిబుచ్చింది. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో 24 గంటల్లో సాధారణ వర్షపాతం కన్నా అత్యధికంగా హర్యానాలో 806%, పంజాబ్‌లో 759%, హిమాచల్‌ప్రదేశ్‌లో 510%, ఢిల్లీలో 740%, చండీగఢ్‌లో 1638%, రాజస్థాన్‌లో 193% కుండపోత వర్షాలు కురిశాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో పంట నష్టాలను సమీక్షించడానికి ప్రత్యేక బృందాన్ని పంపింది. పంట నష్టాలపై ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ నెలంతా ఇదే విధంగా వర్షాలు కొనసాగితే ప్రస్తుతం కోతకొచ్చిన పంటలన్నీ పూర్తిగా దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ మార్పుల వల్లనే ఇప్పుడు కుంభవృష్టి కురుస్తోందని వాతావరణ నిపుణులు కొందరు చెబుతున్నా, ఎర్త్‌సైన్సెస్ మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి శాస్త్రవేత్త మాధవన్ నాయర్ రాజీవన్ అది కారణం కాదని తోసిపుచ్చారు. ఉత్తరభారతం, హిమాలయ ప్రాంతాల్లో ఆగస్టు, సెప్టెంబరుల్లో భారీ వర్షాలు కురియడానికి వాతావరణ మార్పుతో ముడిపెట్టలేమన్నారు. తూర్పున బంగాళాఖాతంలో తేమతో నిండిన వాతావరణం అరేబియా సముద్ర వాతావరణ అలజడులతో సంఘర్షించడమే దీనికి కారణమని ఆయన వివరించారు.
అయినా రుతుపపనాల సమయంలో అధిక ఆవృతం (అధిక ఫ్రీక్వెన్సీ)తో వర్షాలు కురియడం అసాధారణం. సాధారణంగా ఆగస్టులో ఒకటి, రెండు అరేబియా సముద్ర అలజడులు సంభవిస్తుంటాయి. కానీ ఈ సీజన్‌లో నాలుగు అలజడులు సంభవించడం విశేషం. శీతాకాలంలో అరేబియా అలజడులు ఉత్తరాదిలో వర్షాలకు దారి తీస్తుంటాయి. కానీ ఈ రుతుపవనాల సమయంలో వాటి తీవ్రత ఎక్కువగా ఉండడం అసాధారణమని రాజీవన్ పేర్కొన్నారు. భూతాపం పెరిగిపోతుండడంతో ఆర్కిటిక్ మంచు ఫలకలు కరిగిపోవడంతో రుతుపవనాల సమయంలో అరేబియా సముద్ర ఉపరితలంపై తుపాన్ల అలజడి చెలరేగుతోందని కొంతమంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నా దానికి సరైన ఆధారాలు లేవని మాధవన్ నాయర్ పేర్కొన్నారు. కాస్పియన్ రీజియన్ నుంచి అరేబియా సముద్ర తుపాన్లు పుడుతుంటాయని మధ్య ఆసియా మీదుగా ప్రయాణించి ఉత్తర భారతానికి చేరుకుంటాయి. వీటి తీవ్రత ఈ రుతుపవనాల సమయంలో అత్యంత వాడిగా పెరుగుతుండడం అర్థం కాని విషయంగా నాయర్ వివరించారు.
Also Read : హైదరాబాద్ ఫీవర్