Saturday, September 6, 2025

చదివితేనే భవిష్యత్ కాదు.. క్రీడల్లో రాణించినా భవిష్యత్ ఉంటుంది: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయులు క్రియాశీలక పాత్ర పోషించారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆనాడు జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించేలా చేశారని అన్నారు. శిల్పకళా వేదికలో గురుపూజోత్సవ కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులకు గత ప్రభుత్వం సరైన ఆహారం అందించలేదని, విద్యారంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుందని విమర్శించారు. కొత్త నియామకాలను గత ప్రభుత్వం చేపట్టలేదని, గత ప్రభుత్వ హయాంలో ఓయూ మూతపడే పరిస్థితికి వచ్చిందని మండిపడ్డారు. గతంలో గురుపూజోత్సవం ఎప్పుడైనా జరిగిందానని అందులో సిఎం పాల్గొన్నారా? అని ప్రశ్నించారు.

పిల్లలు ఎక్కువ సమయం టీచర్ల వద్దే ఉంటారని, వర్సిటీలకు విసిలను నియమించడానికి గత ప్రభుత్వానికి తీరిక లేదని ఎద్దేవా చేశారు. విసిల నియామకంలోనూ గత ప్రభుత్వం రాజకీయాలు చేసిందని, ప్రభుత్వం, టీచర్ల చొరవతో కొత్తగా 3 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలియజేశారు. వివాదస్పదమైన విద్యాశాఖ తీసుకోవద్దని తనకు కొందరు సూచించారని, వివాదస్పదమైనప్పటికీ విద్యాభివృద్ధి కోసం విద్యాశాఖ తీసుకున్నానని రేవంత్ పేర్కొన్నారు. ఏటా 200 మంది టీచర్లను విదేశాలకు పంపి.. అక్కడి విద్యావిధానం అధ్యయనం చేసేలా ప్రోత్సహిస్తామని, ఢిల్లీలో కేజ్రీవాల్ రెండోసారి సిఎం కావడానికి ఆయన చేసిన విద్యాభివృద్ధే కారణమని అన్నారు.

తనకు స్వార్థం ఉందని, టీచర్లు బాగా పనిచేస్తే తనూ రెండోసారి సిఎం అవ్వాలనుకుంటున్నానని చెప్పారు. తను ఫామ్ హౌస్ లో పడుకుంటానని మళ్లీ సిఎంను చేయండి అనట్లేదని, 140 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ ఒలింపిక్స్ లో ఒక్క స్వర్ణం సాధించ లేదని దుయ్యబట్టారు. దక్షిణ కొరియాలో ఒక్క యూనివర్శిటీనే 160 స్వర్ణ పతకాలు సాధించిందని అన్నారు. చదివితేనే భవిష్యత్ కాదని.. క్రీడల్లో రాణించినా భవిష్యత్ ఉంటుందని, క్రీడల్లో రాణించినా క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన డిఎస్పి అయ్యారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read : ఖైరతాబాద్ వినాయకుడికి పోటీ లేదు: రేవంత్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News