Saturday, September 6, 2025

శ్రీరాంసాగర్ వరద గేట్లు మూసివేత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు శుక్రవారం మూసివేసినట్లు ప్రాజెక్టు ఎస్‌ఇ జగదీశ్ తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు ఎగువ నుంచి 70,188 వేల క్యూసెక్కుల వరద రావడంతో 9 గేట్ల ద్వారా 24 వేల 950 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలామని తెలిపారు. ఉదయం 11 గంటలకు గేట్లను మూసివేసి మిగతా కాలువల ద్వారా నీటి సరఫరా కొనసాగించామని అన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091.00 అడుగులు, 80.50 టిఎంసిలు కాగా శుక్రవారం సాయంత్రానికి 1,090.10 అడుగులు 77.289 టిఎంసిల నీరు నిల్వ ఉందని ఎఇఇ అక్తర్ తెలిపారు.

వరద కెనాల్‌కు 18 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు డిఇ గణేశ్ తెలిపారు. కాకతీయ కాలువకు 4,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ రెండు కెనాల్స్ ద్వారా నీటిని విడుదల చేయడంతో జలవిద్యుత్ కేంద్రంలోని 4 టర్బయిన్ల ద్వారా 36.45 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేశామని విద్యుత్ ఉత్పత్తి ఉపకేంద్రం డిఇ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 19.5486 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అయిందని తెలిపారు. తాగునీటి అవసరాలకు మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 666 క్యూసెక్కుల నీరు విడుదలవుతోందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News