స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. స్థానిక సంస్థలకు ఈ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే కామారెడ్డి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించిన అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకత్వం సంకల్పించినట్లు సమాచారం. గతంలో కామారెడ్డిలో బిసి డిక్లరేషన్ ప్రకటించినందున, ఇప్పుడు కూడా అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తే బాగుంటుందని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి వేదిక నుంచి హామీ ఇచ్చినందున, మళ్లీ అక్కడే సభ నిర్వహించి చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించలేకపోయినా, పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి వేదిక ద్వారానే బిసిలకు హామీ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు. కామారెడ్డిలో సభ నిర్వహించినట్లయితే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి, ఇంకా ఇతర జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు తరలి రావడానికి సౌకర్యంగా ఉంటుందని కూడా వారు భావించారు. అయితే వర్షాలను దృష్టిలో పెట్టుకునే ఈ సభ నిర్వహించాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. వర్ష భీభత్సం, వరదలు ఉంటే మరో రోజుకు వాయిదా వేయాలని వారు నిర్ణయించారు.