హైదరాబాద్: ఎంఎల్ సి కవిత ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. తన జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకమని తెలిపారు. కొందరు నాయకులు, పార్టీలు చేసిన ఆరోపణలే కవిత చేశారని మండిపడ్డారు. కవిత వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాలుగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, రాష్ట్ర సాధన, అభివృద్ధిలో తాను చూపిన నిబద్ధత, తన పాత్ర అందరికీ తెలిసిందేనన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఒకవైపు ఎరువులు దొరకక రైతులు గోస పడుతుంటే, మరోవైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని తెలియజేశారు. కెసిఆర్ కాలంలో ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక్కొక్కటిగా కూల్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడం తమ ముందున్న కర్తవ్యమన్నారు. ద్రోహుల చేతుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంపైనే తాము దృష్టి అంతా ఉంటుందన్నారు. బిఆర్ఎష్ పార్టీకి కవిత వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని ఆమెను పార్టీలో నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే విమానంలో ప్రయాణం చేసినప్పటి నుంచి తనపై కుట్రలు ప్రారంభమయ్యాయని కవిత కామెంట్లు చేసిన విషయం విధితమే. మీరిద్దరూ ఒకే విమానంలో కలిసి వచ్చారా? లేదా అనేది రేవంత్, హరీష్ చెప్పాలని ఆమె నిలదీశారు.