Saturday, September 6, 2025

‘చట్టబద్ధ’ అవినీతికి విచారణ ఉండదా?

- Advertisement -
- Advertisement -

అవినీతి అష్టాదశ రూపాలుగా విస్తరిస్తోంది. అందులో చట్ట బద్ధ అవినీతి కూడా ఓ ప్రధాన రూపంగా మారిపోయింది. ఇప్పుడు పాలకులకు అదే కామధేనువు, కల్పవృక్షం కూడానూ? ఓట్లను సరకుగా మార్చి, ఓట్లను కొనుగోలు రూపంలోకి మార్చిన రాజకీయాలు బయటకు ఎన్ని చిలుక పలుకులు పలికినా! లోపల అందివచ్చిన రూపంలో దండుకోవడమే లక్ష్యంగా భారీ ప్రాజెక్టులు, పథకాలు రూపకల్పన చేసుకుంటున్నారు. అప్పులు, పరోక్ష పన్నుల రూపంలో ప్రజలకు నొప్పి తెలియకుండా సొమ్ములు పోగేసుకుంటున్న ఆధునిక ప్రభుత్వాలు ప్రజలకు పేదరికం పేరుతో, నగదు బదిలీ పేరుతో కొన్ని పథకాలను ఎరవేసి, ఓట్లు కొనుగోలు పరోక్ష రూపాలుగా మార్చుకున్నారు. ఉచితానుచితాల పేరుతో సామాజిక అభివృద్ధికి మంగళం పాడుతున్నారు. ఎన్నో త్యాగాలతో కూడబెట్టిన ప్రభుత్వ రంగ ఆస్తులను, సంస్థలను నష్టాలపేరుతో తమ సన్నిహిత ఆశ్రిత పెట్టుబడిదారులకు చవక ధరలకు అమ్మకం చేస్తున్నారు.

ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటుపరం చేస్తున్నారు. పరస్పర ప్రయోజనం పేరుతో పెట్టుబడిదారులు, పాలక రాజకీయ పార్టీల మధ్య అనుబంధం రోజురోజుకూ బలోపేతం అవుతున్నది. తాజాగా చట్ట బద్ధ అవినీతికి సైతం మార్గాలు అన్వేషణ జరుగుతోంది. అందులో ఒకానోక రూపమే ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం. చట్టబద్ధ అవినీతి సాక్ష్యాధారాలతో సహా బయటపడినా కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఇడి, సిబిఐ, ఐటి లాంటి సంస్థలు మౌనరూపం దాల్చడం వెనుక ఆంతర్యం ఏమిటి! చట్టబద్ధమైన అవినీతి నిగ్గుతేల్చవలసిన అవసరం లేదా? ఈ ఎలక్టోరల్ బాండ్లు వ్యవహారం కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో రూపుదిద్దుకున్నది. ఎన్నికల ఖర్చు నిధులు సమకూర్చుకోవడంలో పారదర్శకత పేరుతో ప్రజాప్రాతినిధ్య చట్టం- 1951 ప్రకారం, సెక్షన్ 29(ఎ) ప్రకారం 7 జాతీయ పార్టీలు, 24 గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా వెయ్యి నుండి కోటి రూపాయల వరకు ఎలెక్టోరల్ బాండ్లు రూపంలో చట్టబద్ధంగా నిధుల సమీకరణకు అవకాశం కల్పించారు.

2018లో చట్టమైన ఈ ఎలెక్టోరల్ బాండ్లు వ్యవహారం 2019 సాధారణ ఎన్నికల నుండి 2024 సాధారణ ఎన్నికల వరకు యథేచ్ఛగా చట్టబద్ధమైన రూపంలో రాజకీయ పక్షాలు నిధులు సమకూర్చుకున్నాయి. అయితే సమాచార హక్కు చట్టం సెక్షన్ 19 (1) (ఎ) ప్రకారం సుప్రీం కోర్టు ఈ చట్టబద్ధ అవినీతి రూపంఎలెక్టోరల్ బాండ్లు బ్యాన్ చేసే వరకు 18,299 ఎలక్టోరల్ బాండ్లు రూపంలో 9,857 కోట్ల రూపాయలు ఆయా రాజకీయ పక్షాల అకౌంట్స్‌లో జమ అయ్యాయి. మెజారిటీ భాగం 6,060 కోట్ల రూపాయలు అంటే 47.5 శాతంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ 1609 కోట్లు, కాంగ్రెస్ 1421 కోట్లు, ఇంకా తెలంగాణలోని బిఆర్‌ఎస్, జెఎంఎం, ఎన్‌సిపి, ఆప్ లాంటి పార్టీలు తర్వాత స్థానంలో నిలిచాయి. ఒక్క సిపిఎం పార్టీ మాత్రమే ఈ చట్టబద్ధ అవినీతి రూపం అయిన ఎలెక్టోరల్ బాండ్లు రూపంలో తీసుకోవడానికి ఇష్టపడలేదు.

ఇక సుప్రీం కోర్టు ఈ చట్టబద్ధ పాపంలో భాగం అయిన దాతలు పేర్లు రహస్యంగా ఉంచడాన్ని తప్పుపట్టే వరకు ఈ వ్యవహారంలో జరిగి నీకిది, నాకిది అన్న చట్టబద్ధ అవినీతి వ్యవహారం బయటపడలేదు? ఎలెక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వారిలో సింహ భాగం ఆశ్రిత పెట్టుబడిదారులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించిన బడా కాంట్రాక్టర్లు, సంస్థలు, టోల్ ప్లాజాల కాంట్రాక్టర్లు, మందుల తయారీ సంస్థలు, ఆయా రంగాల్లో వ్యాపారులు ప్రధానంగా ఉండడంతో ఈ ఎలక్టోరల్ బాండ్లు చట్టబద్ధ అవినీతిలో మరో కోణం బయటపడింది. 2024 ఎన్నికల ముందు సుప్రీం కోర్టు తీర్పుతో కన్నంలో దొరికిన దొంగల్లా ఆయా పాలక రాజకీయ పక్షాల నీతి, రీతి ఏమిటో ప్రజలకు బహిర్గతం అయింది. ఇకపోతే ఈ వ్యవహారంలో మరిన్ని చీకటి కోణాలు ఇటీవల దైనిక్ భాస్కర్ అనే వెబ్‌సైట్ బయటపెట్టింది. తమ నల్లధనాన్ని తెలధనం చేసుకోవడంతో పాటు ఆదాయ పన్ను రాయితి 80సిసి, 80సిసిబి ప్రకారం పొందారు.

తద్వారా కూడా లబ్ధి పొందారు. ఇది ఆయా సంస్థలకు దక్కిన మరో ఆయాచిత లబ్ధి! ఇంతకీ ఈ రాజకీయ పక్షాలు ఏ పక్షం బినామీలో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది? ఈ రాజకీయ పక్షాలకు అందిన 4300 కోట్ల రూపాయల ఎలెక్టోరల్ బాండ్లు గురించి, ఇంత పెద్ద చట్టబద్ధ అవినీతి గురించి ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు పట్టించుకోవడం లేదు? ఇన్ని వేల కోట్లు రూపాయలు అతీగతీ కొనుక్కోవడంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం దాల్చుతుంది? ఎలెక్టోరల్ బాండ్లు రూపంలో జరిగిన ఈ చట్టబద్ధ అవినీతి కుంభకోణం గురించి సమగ్ర దర్యాప్తు జరిపించవలసిన తక్షణ అవసరం ఉంది. నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఆధారాలు లేని కేసులలో దూకుడు చూపుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నాయి? అన్ని లెక్కలు సరితూచవలసిన, సరిచేయాలసిన సమయం దగ్గర పడుతుంది.

Also Read : హైదరాబాద్ లో సిబిఐ డైరెక్టర్

  • ఎన్.తిర్మల్
    94418 64514
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News