ఇండోనేసియాలో ఇటీవలి రోజుల్లో పెల్లుబికిన నిరసనలు దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలోని తీవ్ర సమస్యలను బయటపెడుతున్నాయి. 2025 ఆగస్టు 25న జకార్తాలో మొదలైన ఈ అలజడి ఇప్పుడు సురబయా, బండుంగ్, మకాసర్ వంటి ప్రధాన నగరాలకు కూడా వ్యాపించింది. ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంటు సభ్యులకు హౌసింగ్ అలవెన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం, 580 మంది ఎంపిలకు నెలకు 50 మిలియన్ రూపియాల (సుమారు 3,000 డాలర్లు) హౌసింగ్ అలవెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఇది జకార్తాలోని మినిమం వేజ్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. దేశంలో 7.28 మిలియన్ల మంది నిరుద్యోగులు ఉండగా, 280,000 మంది పిహెచ్కెలు జరిగిన దేశంలో ఇలాంటి ఖరీదైన ప్రతిపాదనలు ప్రజలలో అసంతృప్తిని పెంచాయి.
వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం, 171 మిలియన్ల మంది ఇండోనేసియన్లు మిడిల్- క్లాస్ కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. ఇది జింబాబ్వే తర్వాత రెండో అతిపెద్ద సంఖ్య. ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులు తమకు మరిన్ని సదుపాయాలు కల్పించుకోవడం ప్రజలకు అన్యాయంగా కనిపిస్తోంది. ఈ అలవెన్స్ ప్రతిపాదనను ‘అత్యాశ’ గా వర్ణిస్తూ, ప్రజలు దానిని ఆర్థిక అసమానతలకు చిహ్నంగా చూస్తున్నారు. ప్రభుత్వం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు, బడ్జెట్ కట్స్, ట్యాక్స్ హైక్‌లు (ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ 250 శాతం పెరుగుదల) వంటివి ప్రజలపై భారం మోపుతున్నాయి. మరోవైపు, ఎంపిలు తమకు సదుపాయాలు పెంచుకోవడం డబుల్ స్టాండర్డ్‌గా కనిపిస్తోంది. ఈ విమర్శలు ప్రభుత్వాన్ని అసమర్థ ప్రభుత్వంగా చూపిస్తున్నాయి.
ఎందుకంటే దేశ ఆర్థిక స్థితి ‘తీవ్రమైనది’ అని ఆర్థిక మంత్రి శ్రీముల్యాని ఇండ్రావతి స్వయంగా అంగీకరించారు. ఇలాంటి సమయంలో రాజకీయ శిష్ట వర్గానికి (ఎలైట్‌లకు) అదనపు భత్యాలు ఇవ్వడం ప్రజలలో అసంతృప్తిని మరింత పెంచింది. నిరసనలు మొదట విద్యార్థులు, కార్మికుల నుంచి మొదలైనా, తర్వాత దేశం అంతటా విస్తరించాయి. ఆగస్టు 28న జకార్తాలో జరిగిన నిరసనలో 21 ఏళ్ల ఫుడ్ డెలివరీ డ్రైవర్ అఫాన్ కుర్నియావాన్ పోలీసు వాహనం ద్వారా మరణించడం ఈ అలజడిని మరింత తీవ్రతరం చేసింది. ఈ సంఘటన వీడియో వైరల్ కావడంతో ప్రజలు పోలీసు బ్రూటాలిటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మాత్రమే కాదు, నిరసనలు హింసాత్మకంగా మారాయి. ప్రజలు పార్లమెంటు భవనాలను తగలబెట్టారు.
టోల్ రోడ్లు, బస్స్టేషన్లు ధ్వంసమయ్యాయి. మొత్తం ఈ హింసాకాండలో ఏడుగురు మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఈ హింసలో ఆర్థిక మంత్రి శ్రీ ముల్యాని ఇంటిని పూర్తిగా దోచేశారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోయినా, నిరసనకారులు ఆమె ఇంటిని ధ్వంసం చేశారు. ఇది ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ప్రజల ఆగ్రహానికి చిహ్నం. శ్రీ ముల్యాని తర్వాత మాట్లాడుతూ ‘మా విధానాలను మెరుగుపరుస్తాం’ అని వాగ్దానం చేసినా, ఇది ప్రజలను శాంతింప జేయలేదు. ఈ లూటింగ్ ఎందుకు జరిగింది? ఇది కేవలం ఆగ్రహం మాత్రమే కాదు, దేశంలోని ఆర్థిక అసమానతలు, అవినీతి, మధ్యతరగతి వర్గం తగ్గిపోవడం వంటి సమస్యలకు ప్రతీక.
ప్రభుత్వం బడ్జెట్ కట్స్ చేస్తున్నప్పుడు, ట్యాక్స్‌లు పెంచుతున్నప్పుడు, మంత్రులు, ఎంపిలు తమకు మరిన్ని సదుపాయాలు కల్పించుకోవడం ప్రజలకు అన్యాయంగా అనిపిస్తోంది. మరోవైపు, ఇండోనేసియాలో ఇటీవలి సంవత్సరాల్లో హిలిరిసేషన్ పాలసీలు (నికెల్, కోల్ మైనింగ్) పర్యావరణ ధ్వంసానికి కారణమవుతున్నాయి. పాపువా, కలిమంటాన్లలో డిఫారెస్టేషన్ పెరిగింది. ఇది స్థానికుల జీవనోపాధిని బాగా దెబ్బ తీస్తోంది. ఇలాంటి సమస్యలు నిరసనలను మరింత బలోపేతం చేశాయి. ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో ఈ నిరసనలకు స్పందిస్తూ, ఎంపిల పెర్కను కట్ చేస్తామని ప్రకటించాడు. ఆగస్టు 31న మాట్లాడుతూ, పార్లమెంటు సభ్యుల అలవెన్స్‌లను రద్దు చేస్తాం. విదేశీ ట్రిప్‌లను సస్పెండ్ చేస్తాం అని చెప్పాడు. ఇది ఒక రేర్ కన్సెషన్, ఎందుకంటే ప్రబోవో ప్రభుత్వం సాధారణంగా నిరసనలను అణచేస్తుంది.
అంతేకాకుండా చైనా ట్రిప్‌ను క్యాన్సిల్ చేసి, దేశీయ సమస్యలపై దృష్టి పెట్టాడు. కానీ ఈ చర్యలు తీసుకోవటానికి చాలా ఆలస్యమైంది. దానితో ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం పెరిగింది. దానితో ప్రజలు మరిన్ని డిమాండ్లు చేస్తున్నారు. అందులో ప్రధాన డిమాండ్లు. 1) ప్రబోవో- గిబ్రాన్ను పదవి నుంచి తొలగించాలి. 2) పార్లమెంటును డిసాల్వ్ చేయాలి. 3) దేశంలో అవినీతిని అంతం చేయాలి. 4) మినిమమ్ వేజ్ను పెంచాలి. 5) ఔట్‌సోర్సింగ్‌ను రద్దు చేయాలి. ప్రబోవో ప్రభుత్వం ఇండోనేషియా గెలాప్ (డార్క్ ఇండోనేషియా) మూవ్మెంట్ నుంచి వచ్చిన ఈ నిరసనలను తక్కువగా అంచనా వేసింది. విమర్శకులు చెబుతున్నట్లు, ప్రబోవో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సమస్యలు మరింత తీవ్రమయ్యాయి.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పర్యావరణ ధ్వంసం, అంతేకాకుండా, మిలిటరీ పాలసీలు (టిఎన్ఐ ఆక్టివ్ ఆఫీసర్లు సివిల్ పోస్టుల్లో) ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. ప్రబోవో ఈ సమస్యలను పరిష్కరించకపోతే, నిరసనలు మరింత విస్తరించవచ్చు. ఈ నిరసనలు ఇండోనేసియా సమాజంలోని లోతైన ఫ్రస్ట్రేషన్‌ను ప్రతిబింబిస్తున్నాయి. అవినీతి, అసమానతలు, పోలీసు బ్రూటాలిటీ వంటివి దేశాన్ని ‘డార్క్ ఇండోనేసియా’ గా మార్చుతున్నాయి. ప్రభుత్వం ఈ ఆందోళనలను సీరియస్‌గా తీసుకోకపోతే, దేశస్థిరత్వం ప్రమాదంలో పడవచ్చు. ప్రజలు ఇప్పుడు న్యాయం, సమానత్వం కోసం పోరాడుతున్నారు. ప్రభుత్వం వారి డిమాండ్లను ఆలకించాలి. లేకపోతే, ఈ అలజడి మరిన్ని సంక్షోభాలకు దారితీస్తుంది.
Also Read : బిసి రిజర్వేషన్ల తరువాతే స్థానిక సమరం
- కోలాహలం రామ్ కిశోర్, 98493 28496