Tuesday, September 9, 2025

ప్రత్యేకం ఇంకెన్నాళ్లు?

- Advertisement -
- Advertisement -

పంచాయతీల్లో 19 నెలలుగా ప్రత్యేక అధికారుల పాలన
రిజర్వేషన్లు తేలేదెప్పుడు?..ఎన్నికలు జరిగేదెప్పుడు?
ముగుస్తున్న కోర్టు గడువు
పెండింగ్‌లోనే రూ.3,000 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు
ఎన్నికలు ఆలస్యం అవుతున్న కొద్దీ కనీస అవసరాలకు నిధుల కొరత

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రోజు రోజుకీ వెనక్కి పోతుంటే, స్థానిక సంస్థల నిర్వహణ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రిజర్వేషన్లు తేలేదెప్పుడు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగేదెప్పుడు అంటూ క్షేత్రస్థాయిలో ప్రజలు, ప్రజాప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. స్థానిక సంస్థలన్నీ ప్రత్యేకాధికారుల పాలనలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతోంది. 2024 ఫిబ్రవరి 1న తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీల పాలకమండళ్ల పదవీకాలం ముగిసింది. అప్పటినుంచి ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఇటీవల పంచాయతీ ఎన్నికలు, పరిషత్‌లకు ఎన్నికలు దశలు వారీగా చేపడతున్నట్లు ప్రభుత్వం వెల్లడించినా ఇంత వరకు ఎన్నికల నిర్వహణపై స్పష్టత లేదు.

కోర్టు విధించిన గడువు కూడా ముగుస్తున్నా, ఇప్పట్లో ఎన్నికలు జరిగే దాఖలాలు కనిపించడం లేదు. దీంతో అసలే నిధుల సమస్యలతో సతమతమవుతున్న స్థానిక సంస్థలకు ఈ ఆలస్యం మరింత శాపంగా మారింది. పంచాయతీల పరిధిలో అభివృద్ధి పనులు జరుగక, కనీస నిర్వహణ పనులు చేపట్టలేక కాలం నెట్టుకువస్తున్నారు. పంచాయతీకార్యదర్శులు నిత్యం అవరమయ్యే ఖర్చుల కోసం సొంత నిధులు వెచ్చిస్తున్నారు. ఈ పరిస్థితితో పంచాయతీలకు ఎన్నికలు త్వరగా జరిగి కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధుల్లో రాష్ట్రవాటాగా రావాల్సిన నిధులను రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు రోజు రోజుకీ ఆలస్యం కావడం వల్ల నిధులు ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. పాలకవర్గాలు ఉంటే మాత్రమే వచ్చే ఆర్థిక సంఘం నిధులు ఎప్పుడో నిలిచిపోయాయి. కనీస అవసరాలు తీరకపోవడంతో పంచాయతీల్లో పాలన కుంటుపడింది. సొంత డబ్బు ఖర్చు చేయలేక, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్‌లో వ్యాధులు ఎక్కువగా ప్రబలే పరిస్థితి ఉంది. ఇందుకుగాను పారిశుధ్య నిర్వహణ అత్యంత కీలకమై, వాటికి నిధుల అవసరం అవుతూ ఉంటుంది.

గత ఏడాదిన్నర రోజుల నుంచి ఒక్కో కార్యదర్శి ఏడాది కాలంగా రూ. 4 నుంచి రూ.6 లక్షల వరకు సొంత నిధులు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు ఇందుకు సంబంధించిన నిధులు విడుదల కాలేదు. కేవలం మల్టిపుల్ వర్కర్ల వేతనాలు గ్రామ పంచాయతీల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. మిగతా నిర్వహణ ఖర్చులు మాత్రం మంజూరు కావడం లేదు. కొత్తగా ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలు కొలువుదీరితేనే 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. పంచాయతీ పాలకవర్గాలు ఉంటే నిధులు రావడం ఆలస్యమైనా సర్పంచ్‌లు ముందుగా తమ సొంత నిధులు ఖర్చు చేసి తర్వాత ప్రభుత్వం మంజూరు చేయగానే వసూలు చేసుకునే పద్దతి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇంకా ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారనే విషయంలో ఎవరికి స్పష్టత లేదు. దీంతో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి, ఎప్పుడు నిధులు వస్తాయనే అంశంపై తెగ మదనపడుతున్నారు.

రెండేళ్లలో పెండింగ్‌లో దాదాపు మూడు వేల కోట్ల కేంద్ర నిధులు
గత ఏడాది, ఈ ఆర్థిక సంవత్సరం కలిపి దాదాపు మూడు వేల కోట్ల వరకు కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల కింద రావాల్సి నిధులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికలు ఎంత వేగంగా జరుపుదామనుకుంటే అంతే స్థాయిలో ఆలస్యం అవుతున్నందున నిలిచిపోయిన ఆర్థిక సంఘం నిధులు వస్తాయా, లేదా అనేదానిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధులు ఎంతో కీలకం. పంచాయతీలకు ఎన్నికలు జరుగకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన ఈ నిధులకు గండి పడుతోంది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన రూ.1,514 కోట్లు పంచాయతీలకు అందలేదు. గత ఏడాది ఫిబ్రవరిలోనే పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లాయి. దీంతో సర్పంచ్‌లు లేని కారణంగా కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా విడుదల కాలేదు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ వరకు జరిగే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. ఈ ఆలస్యం ఇలాగే కొనసాగితే 2025-26లో రావాల్సిన రూ.1,477 కోట్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుందని ఆయా వర్గాల సమాచారం. 2024-25, 2025-26 సంవత్సరాల్లో దాదాపు రూ.3 వేల కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను కోల్పోయే అవకాశం ఉందని ప్రభుత్వంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నిధులను రాబట్టుకునేందుకైనా త్వరగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంటే చివరికి ఈ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

Also Read: కవిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి విచారించాలి: సిపిఐ నారాయణ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News