Tuesday, September 9, 2025

మనసు పలికే.. ఇళయ రాజా..

- Advertisement -
- Advertisement -

ఇళయరాజా మొదటి చలనచిత్రం ‘అన్నకిలి’ తమిళ సినిమా అని చాలా మందికి తెలుసును. ఆ సినిమా 1976 మే 14న విడుదల అయింది. ‘అన్నకిలి’ తరువాత రెండేళ్లకు, ఆ సినిమా ఆధారంగానే ‘రామచిలక’ అనే తెలుగు చలనచిత్రం వచ్చింది. రామచిలకకు సంగీతాన్ని అందించింది చెళ్లపిళ్ల సత్యం అయినప్పటికీ, దీనిలో ‘మావయ్య వస్తాడంట..’, ‘రామచిలకా పెళ్లికొడుకెవరే..’ అనే పాటలకు ఇళయరాజా పాటలు ‘మచ్చాన పార్తింగళా’, ‘అన్నక్కిలీ ఉన్నతేడూదే’ వరుసలే మాతృకలు.

ఈ పాటలు ఎంత మధురంగా ఉందీ మనమంతా ఎరుగుదుం. ఇది మొదలు అటు తమిళంలో, ఇటు తెలుగులో ఇళయరాజా విజృంభణే విజృంభణ. ఇళయరాజా అనే మరుగున పడి ఉన్న ముడి వజ్రాన్ని ముందుగా గుర్తించినందుకు, తమిళ సినిమా నిర్మాత పంచు అరుణాచలానికి సంగీతప్రియులు సదా రుణపడి ఉంటారు. సంగీతంలో రాజాకు మార్గదర్శనం చేసిన ధన్‌రాజ్ మాస్టర్, సలీల్ చౌదరి, జి.కె.వెంకటేశ్ గార్లకు కూడా మనం కృతజ్ఞతలు తెలిపే తీరాలి.
ఇప్పటికి మూడు తరాల శ్రోతలు పుడితే, ఈ తరాన్ని వదలిపెడదాం, వెనుకటి రెండు తరాల వారు ఇ‘లయరాజా’ సంగీతసంద్రంలో తీరానికి కొట్టుకొచ్చిన స్వర తరంగాల్లో ఓలలాడి, “ఏదో మోహం, ఏదో దాహం..” అని ఇంకా కూనిరాగం తీసేస్తున్నారు. (ఏదో మోహం ఏదో దాహం పాట 1982లో వచ్చిన తమిళ సినిమా ‘కోళి కూ వుదు’లో ఉంది.) గలగల పారే యేరులు, గాలికి తలలూచే పైరులు, పరవళ్లెత్తే నదుల జలాలు, పక్షుల కిలకిలారావాలు, ప్రాకృతిక సొబగులు, గిటార్ మిరకిళ్లు, ట్రంపెట్ తరంగాలు, వాయులీన మహాద్భుతాలూ, ఈ భూమి మీదే ‘ఇది ఒక మరో లోకం ఇది ఒక మనో వేగం..’ (1982లో వచ్చిన ‘టిక్ టిక్ టిక్’ సినేమాలో ఇళయరాజా స్వరపరచిన పాట పల్లవి ఇది) వెరసి, ‘స్వాతి ముత్య మాలలు’ ఇళయరాజా స్వరాలు.

వాద్దియర్ (మాస్టర్) పాటల్లో తాము ఇమిడిపోవాలని సంగీత వాద్యాలు తపస్సే చేస్తుంటాయనుకుంటా. ‘రాజా’ లేక ‘రాజాధిరాజా’ (ఇవి అభిమాను లు ఇళయరాజాను పిలుచుకునే పేర్లు) సంగీతానికి తులతూగే దృశ్యాలని జతపరచాలని, కెమెరామెన్‌లు కంటికి కునుకులేకుండా ఆలోచిస్తుంటారా ఏంటబ్బా అనిపిస్తుంది. అంత అందంగా ముస్తాబవుతాయి ఆయన పాటలు తెర మీద. ఆయన తన బాణీలతో ఏమేం చేయడనీ! కంట నీరు చిప్పిల్లజేస్తాడు. ఆడజన్మకు ఎన్ని శోకాలు అనే ‘దళపతి’లోని పాట ఒకసారి వినండి. ఆనందాతిరేకం తెప్పించి, వినే వాళ్లని ఉర్రూతలూగిస్తాడు. తన బాణీలతో మైమరపిస్తాడు. గుండెని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాడు. తన రాగాలతో ఎందరెందరికో ఎన్నెన్నో ఆయన ప్రసాదించేస్తాడు.

మళ్లీ ఈ ‘మేస్ట్రో’ అంటాడు.. “అబ్బే నేను చేసేది సంగీతమే కాదు. పరిసరాల్లోని శబ్దాల్ని గుప్పిట పట్టి మీ వైపు రువ్వుతున్నానంతే. సంగీతం మన చుట్టూరా ఉన్నదేను” అని. అంతా తన ప్రతిభే అని మాత్రం చస్తే ఒప్పుకోడు. ‘పాడలొరు కోడి సైత్తేన్ కేట్టవర్కు జ్ఞానమిల్లై’ అనన్నాడుగా కణ్నదాసన్ కోయిల్ మణి ఓసై దన్నై కేట్టదారో ఇంగ వందదారో యుగళగీతం (‘కిళక్కే పోగుం రైల్’ సినేమా)లో. (ఈ తమిళ పదాలకు ‘కోటి పాట లు చేస్తా, వినే వాళ్లలో జ్ఞానం లేదే’ అని భావం). నిజమే కానీ, మనలో ఎంతమందికుంది సంగీత జ్ఞానం? అది లేకపోయినా ఫరవా లేదు. రాజా పాట వుంది కద, మనకది చాలు. అక్కర లేదు ఇంక ఏమీ.

ఎంత మందిని స్టార్లని చేశాడో, ఎన్ని వందల సినిమాల్ని- తన స్వర లిపితో- హిట్లుగా నిలబెట్టాడో. ఎందరు చిన్న నిర్మాతలకు- ఈ హార్మనీ పెట్టె వాడు- గోవర్ధనగిరిధారి అయ్యాడు. ఇళయరాజా. “ఇంద రాజా కైయ్యా వెచ్చా అదు రాంగా పోనదిల్లా..” 1989లో వచ్చిన తమిళ సినిమా ‘అపూర్వ సహోదరగళ్’లో కమల్ హాసన్ పాడిన పాట పల్లవి. సినిమా పాటకు అంతవరకున్న గౌరవాన్ని ఇంతలంతలు చేసేశాడు ఈ సంగీత జ్ఞాని. రాజా సృస్టించిన ‘ఈ లయ రాగాలు’ వల్ల ఆయ న పాటలు కలకాలం ఉంటాయి. కల్ల కాని మాటలు, కరాఖండీగా చెప్పుకోవాల్సినవే. తనే తెలిపిన ఒక ముఖ్యమైన సంగతేంటంటే ఒక్క బాపుగారి శ్రీరామరాజ్యం సినిమాకు తప్పితే, మిగతా తన పాటలన్నీ మొదట తాను స్వరాలు కట్టిన తరువాతే కవులు రాసిన గీతాలట. “లేదు శాసనం లేదు బంధనం ‘రాజా’దే జయం..”

“వేల పాటలిచ్చినాడే- వేల తీరులైన వాడే-, గమకాలన్ని చిల్కి-, చెవుల తేనె పోసినోడే-. గేయాలెన్నొ దిద్ది తీర్చీ-, గెలుపులెన్నో సృష్టించేనే-, నిత్యమై నిర్వాణమై- మహర్షై, నిల్చాడే- అభినవ త్యాగరాజు అని- కీర్తిద్దాము రా రండే-, మా ఇళయ రాజానే- అని ఆయన అభిమానులు పాడుకుంటారు ఇప్పుడు. వేల్యంట్.. మరో ‘సింఫొనీ’తురాయి ఈ స్వరరా‘రాజు’కి. సెల్యూట్.. ఈ 83 ఏళ్ల యువకుడికి సెల్యూట్.

Also Read : నేడు కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం

  • దిలీప్
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News