గోదావరి డ్రింకింగ్ స్కీమ్‌కు మల్లన్న సాగర్‌ను
వదిలి దాని తోక గండిపేట దగ్గర శ్రీకారం
చుడతారా? హిమాయత్‌సాగర్‌కు తెస్తున్నది
కాళేశ్వరం జలాలు కాదా? చిల్లర ప్రచారం
చేస్తున్నందుకు సిఎం సహా కాంగ్రెస్ నేతలు
క్షమాపణలు చెప్పాలి రూ.12వేల కోట్ల
డ్రగ్స్ తయారవుతుంటే సిఎం ఏం చేస్తున్నారు?
పార్టీలో అంతర్గత చర్చల తరువాతే కవితపై
చర్యలు ఇప్పుడు నేను మాట్లాడడానికి ఏం
లేదు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ నే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తోందని బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చిల్లర ప్రచారం చేస్తున్నందుకు సిఎం రేవంత్‌రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడి గోదావరి జలాల పథకానికి సిఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తున్నారని చెప్పారు. శంకుస్థాపన చేయాల్సి వస్తే కొండపోచమ్మసాగర్ వద్ద చేయాలి.. లేదా మల్లన్నసాగర్ వద్ద చేయాలని… కానీ, గండిపేట వద్ద చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్న వారే గోదావరి జలాలను అక్కడి నుంచి తరలిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం తెలంగాణకు కల్పతరువు అని తేలియిపోందని చెప్పారు. తెలంగాణ భవన్లో సోమవారం బిఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కెటిఆర్ మాట్లాడుతూ..మల్లన్నసాగర్ దగ్గర శంకుస్థాపన చేస్తే ఇవి కాళేశ్వరం నీళ్ళే కదా అని రైతులు ఎక్కడ ప్రశ్నిస్తారో అని గండిపేట దగ్గర డ్రామా చేస్తున్నారని విమర్శించారు. జ్ఞానం ఉన్న వాళ్లు ఎవరైనా తల దగ్గర శంకుస్థాపన చేస్తారు.. తలా తోక తెలియని వాళ్లే తోక దగ్గర చేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత వారమే కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధాలు ఆడి, ఇప్పుడు అదే కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుండి మూసీకి నీళ్లు అనుసంధానం చేస్తున్నార ని విమర్శించారు. రాహుల్ విమర్శించే సిబిఐకి కేసు ఇవ్వడం.. కాళేశ్వరంపై రేవంత్‌రెడ్డికి ఉన్న కక్షకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. సిఎం, ప్రభుత్వ వైఖరి అందరికీ అర్థమవుతోందని చెప్పారు. గండిపేటకు తీసుకొస్తున్నది కాళేశ్వరం జలాలా.. కా దా..? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెెక్టులో భాగమైన మల్లన్నసాగర్ నుంచి మూసీకి గోదావరి జలాలను తీసుకువచ్చే పథకానికి శంఖుస్థాపన చేసిన సిఎం రేవంత్ రెడ్డికి
మల్లన్నసాగర్‌కు గోదావరి నీళ్లు ఎక్కడి నుంచే వస్తాయో చెప్పే నీతి, నిజాయితీ,దమ్ము ఉన్నాయా..? అని ప్రశ్నించారు. ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని పేర్కొన్నారు. కాళేశ్వరంతో ఇప్పటిదాకా 240 టిఎంసిల నీటి వినియోగం జరిగిందని, 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని అన్నారు. 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకపోలేదని.. కానీ, కాంగ్రెస్ కూలిపోయిందని అబద్దాలు చెపుతున్నారని అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ ఎత్తిచూపారని చెప్పారు. 20 నెలలుగా బ్యారేజీలు ఎందుకు రిపేరు చేయడం లేదని కూడా అక్బరుద్దీన్ ప్రశ్నించారని గుర్తు చేశారు. మొదటినుంచి లక్ష కోట్ల అవినీతి అని కాళేశ్వరంపై కాంగ్రెస్‌లోని ప్రతి ఒక్కరూ తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విడతల వారీగా ప్రజలు సొమ్మును దోచుకునేందుకు పథకాలు
కాళేశ్వరం మీద చేప్పిన అబద్దాలను కప్పి పుచ్చుకోవడానికి మల్లన్న సాగర్ దగ్గర కాకుండా గండిపేట దగ్గర ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాడని కెటిఆర్ విమర్శించారు. లక్షకోట్ల అవినీతి, కాళేశ్వరం కూలేశ్వరం అన్న ఆరోపణలు చేసిన రేవంత్, ముఖం చెల్లకనే ఇలా చేశారని విమర్శించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో ఎలాంటి స్టోరేజ్ కెపాసిటీలను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, తాము మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టులో 141 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో 15 రిజర్వాయర్లను నిర్మించామని తెలిపారు. దీంతో సహజంగానే నిర్మాణ వ్యయం పెరిగిందన్నారు. 2006లో అంచనాలు రూపొందించిన ప్రాణహిత చేవెళ్లకు,
2015లో అంచనాలు రూపొందించిన కాళేశ్వరానికి మధ్య తేడా ఉంటుందన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్‌కు గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు తమ హయాంలో 1,100 కోట్లతో రూపొందించిన అంచనాలను 7,390 కోట్లకు అంటే ఏడు రెట్లు పెంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేస్తుందని ఆరోపించారు. అంతేకాదు 16 వేల కోట్లతో పూర్తయ్యే మూసి సుందరీకరణ ప్రాజెక్టును కూడా 1,50,000 కోట్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచితే హైదరాబాద్ ప్రజలతో కలిసి దాన్ని బిఆర్ఎస్ అడ్డుకుందన్నారు. దీంతో రూటు మార్చిన రేవంత్ రెడ్డి విడతల వారీగా జనాల సొమ్మును దోచుకునేందుకే ఈ పథకాలను మొదలుపెట్టారని విమర్శించారు.
బనకచర్ల కోసమే మేడిగడ్డను బొందపెట్టే కుట్ర
మేడిగడ్డ బరాజ్‌లోని మూడు పిల్లర్లను ఇప్పటివరకు ఎందుకు రిపేర్ చేయించడం లేదో కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలని కెటిఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.94 వేల కోట్లు ఖర్చు అయితే అందులో 4 వేల కోట్లతో నిర్మించిన మొత్తం మేడిగడ్డ బరాజ్‌లో కేవలం 250 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యే 7వ బ్లాక్‌లోని మూడు పిల్లర్ల రిపేర్లు చేయవచ్చని చెప్పారు. దాన్ని తామే రిపేర్ చేస్తామని నిర్మాణ కంపెనీ ముందుకొచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. కంపెనీనే రిపేర్ చేస్తామంటే ప్రజాధనం వృథా అయ్యే ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు.
బనకచర్ల కోసమే మేడిగడ్డను బొందపెట్టే కుట్రలకు రేవంత్ తెర తీశాడని ఆరోపించారు. సుంకిశాలలో బ్లాక్ లిస్టు చేయాల్సిన ఏజెన్సీకి మళ్లీ రూ.7,400 కోట్ల పనులు అప్పగించారని, ఎందుకు ఆ సంస్థపై అంత ప్రేమ..? అని ప్రశ్నించారు. చర్యలు తీసుకోవాల్సింది పోయి.. రివార్డు ఇస్తారా.. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేస్తే మీకెందుకు మొహమాటం..? అని నిలదీశారు. రూ. వేల కోట్ల ముడుపులు ఢిల్లీకి పంపి సీటును కాపాడుకోవడం తప్ప ఇంకోటి లేదని ఆరోపించారు.
హైదరాబాద్ మొత్తానికి తాగునీటిని అందించే బాధ్యత మాది
హైదరాబాద్ నగరం మొత్తానికి 24 గంటలు తాగునీటిని అందించే బాధ్యత తమది అని కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 50 కిలోమీటర్ల మేర రింగ్ మెయిన్ నిర్మాణం చేశామని పేర్కొన్నారు. రాబోయేది మన కెసిఆర్ ప్రభుత్వమే అని.. మిగతా రింగ్ మెయిన్ కూడా తామే పూర్తి చేస్తామని చెప్పారు. ఈ రింగ్ మెయిన్ ద్వారా గోదావరి, కృష్ణా నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తానికి మరో 500 ఏళ్లయినా నీటి కొరత లేకుండా చేస్తామని స్పష్టం చేశారు.
12 వేల కోట్ల డ్రగ్స్‌లో సిఎంకు ఏమైనా ముడుపులు ముట్టాయా..?
మహారాష్ట్ర పోలీసులు వచ్చి, ఇక్కడి కంపెనీలో కార్మికులుగా చేరి, నెలల తరబడి పనిచేసి అక్కడ డ్రగ్స్ తయారు చేస్తున్నారని నిర్ధారించారని కెటిఆర్ తెలిపారు. సిఎంకు, పోలీసులకు సమాచారం లేకుండా 12 వేల కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుకున్నారని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ పోలీసులు, ఇంటెలిజెన్స్, ఈగిల్, హైడ్రాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. 21 నెలల నుంచి ఆ డ్రగ్స్ కంపెనీపై ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమైనా ముడుపులు ముట్టాయా..? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి హోంమంత్రి శాఖ, ఈగల్ టీం, హైడ్రా టీం ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.
పార్టీలో చర్చించిన తర్వాతనే కవిత సస్పెన్షన్‌పై నిర్ణయం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తన సోదరి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై కెటిఆర్ స్పందించారు. కవిత సస్పెన్షన్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కవితపై తమ పార్టీ చర్చించి చర్యలు తీసుకుందని, చర్యలు తీసుకున్న తర్వాత ఇక తాను మాట్లాడటానికి ఏమీ లేదని తెలిపారు. కవితపై వేటు అనేది పార్టీ అంతర్గతంగా చర్చించి తీసుకున్న నిర్ణయం అని, ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యక్తిగతంగా తాను దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని తేల్చి చెప్పారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్నాక, దాని గురించి మాట్లాడి, విషయాన్ని పొడిగించదలుచుకోలేదని అన్నారు.
ఫిరాయింపు ఎంఎల్ఎల విషయంలో విచారణ అవసరం లేదు
ఫిరాయింపు ఎంఎల్ఎలపై స్పీకర్ వెంటనే వేటు నిర్ణయం తీసుకోవాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. పిపిసి అధ్యక్షుడు, ఎంఎల్ఎ కడియం శ్రీహరి అప్రూవర్లుగా మారి నేరాన్ని అంగీకరించారని, ఈ విషయంలో ఇంకా విచారణ అవసరం లేదని అన్నారు.