ప్రపంచంలో ఎఐ విస్తరిస్తోంది. ప్రతి రంగంలోనూ వేగంగా వ్యాప్తిచెందుతోంది. దాన్ని అందిపుచ్చుకున్నవారు వేగంగా దూసుకెళ్తారు. లేకపోతే ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఎఐ, రోబోలు ఏ రంగంలో వచ్చినా కూడా న్యాయ వ్యవస్థలో కూడా వస్తాయా?, చట్టాలు ఉన్నది ఉన్నట్టుగా తీర్పులు చెప్పగలవా? గత వారం రోజుల నుంచి ఓ వార్త ప్రచారంలో ఉంది. అదే ఇండియాలోని న్యాయ వ్యవస్థలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రవేశపెట్టాలని, పెడుతున్నారని. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి రాలేదు. కానీ, చర్చ మాత్రం జరుగుతోంది. మొదట జిల్లా కోర్టుల్లో న్యాయవాదులకు ఎఐ మీద ట్రైనింగ్ ఇప్పించి ఆ తర్వాత వివిధ దశల్లో కింది కోర్టులు, పైకోర్టుల వరకు దీన్ని విస్తరిస్తారనే వాదన ఉంది.
చిన్న చిన్న కేసులను ఎఐ ద్వారా పరిష్కరించి, పరిశీలించవచ్చనే అభిప్రాయంలో ఉన్నట్టు కనిపిస్తోంది. భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంలో ఓ ముఖ్యమైన పాయింట్ ఉంది. ‘మూడో దశ ఈ కోర్టు ప్రాజెక్టు కూడా అప్రూవ్ అయింది. మనం మరింత టెక్నాలజీ దిశగా వెళ్తున్నాం. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ లాంటిని వినియోగిస్తాం. పెండింగ్ కేసులు, కొన్నిసార్లు భవిష్యత్తులో తలెత్తబోయే కేసులను కూడా మనం అంచనా వేయగలం. ఈ టెక్నాలజీ పోలీస్, ఫోరెన్సిక్, జైళ్లు, కోర్టుల్లో ప్రవేశపెడుతున్నాం. దీనివల్ల వారి పని వేగం పెరుగుతుంది. మనం భవిష్యత్ తరాలకు సరిపడే విధంగా న్యాయ వ్యవస్థను తీర్చిదిద్దబోతున్నాం’ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కొన్ని కొన్ని నివేదికల ప్రకారం భారతదేశంలో సుమారు 5.38 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయి. ఆ కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటే దానికి కారణం జడ్జీలు మాత్రమే కాదు. లాయర్లు, కొన్నిసార్లు నిందితులు కూడా కారణమే. ఇప్పుడు ఎఐని న్యాయ వ్యవస్థలోకి ప్రవేశపెట్టడం ద్వారా రోబో జడ్జిలను తీసుకొస్తే కేసులన్నీ వెంటనే పరిష్కారం అయిపోతాయా? వాయిదాలమీద వాయిదాలు వేసుకుంటూపోయే వ్యవస్థలో త్వరితగతిన కేసులు పరిష్కారం అయ్యేనా? ముఖ్యంగా రాజకీయ నేతలు, మతపరమైన అంశాలు ముడిపడిన కేసుల విషయంలో ఎఐ, రోబో జడ్జిలు తీర్పులు ఇవ్వగలవా?.
సత్వర న్యాయం అనేది జరుగుతుందో లేదో కానీ.. కొన్ని మంచి అంశాలు మాత్రం కచ్చితంగా ఉన్నాయి. టెక్నాలజీ పెరిగిపోతున్న యుగంలో మనం కూడా దానితోపాటు ముందుకు పరుగెత్తక తప్పదు. ఇలాంటి సమయంలో కోట్లాది కేసులు పెండింగ్‌లో ఉన్న న్యాయ వ్యవస్థలో కూడా ఎఐ వినియోగం వల్ల కొంత మేలు జరిగే అవకాశం లేకపోలేదు. సత్వర న్యాయం: పెద్ద కేసులు కాకపోయినా, రెగ్యులర్‌గా వచ్చే కేసులు, ఎప్పుడూ వచ్చే ఒకే రకమైన కేసులను ఫాస్ట్ ట్రాక్ చేయడంలో ఎఐ ఉపయోగపడుతుంది. పారదర్శకత: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండదు. కేవలం ట్రైన్ చేయబడిన అంశాల మీద ఆధారపడి పనిచేస్తుంది. దీని వల్ల మన, తన అనే భేదం ఉండదు. ఒకే రకమైన కేసుల్లో ఒకే రకమైన తీర్పులను ఇవ్వడానికి సూచనలిస్తుంది. అది పేదలైనా? పెద్దలైనా?. తద్వారా తీర్పుల్లో పారదర్శకత వస్తుంది. జడ్జిలపై పనిభారం తగ్గుతుంది, జడ్జీలు రెగ్యులర్‌గా చేసే పనులు (కొన్ని వేలపేజీల చార్జిషీట్లు చదవడం, సాక్షుల వాంగ్మూలాలు పదే పదే చూడాల్సి రావడం) కొంత సులువు అయిపోతాయి. చాలా వరకు పని ఎఐ చేసేయడం వల్ల జడ్జీలు త్వరితగతిన తీర్పులు ఇవ్వగలరు.
కోర్టు అంటే కంప్యూటర్ కాదు. రెండు రెళ్లు నాలుగు అని చెప్పడానికీ న్యాయమూర్తులు మానవత్వం చూపిస్తుంటారు. ఆ కేసు సందర్భాన్ని బట్టి మానవతా కోణంలో చూడాల్సి ఉంటుంది. అలాగే, నైతిక విలువలు కూడా ముఖ్యం. ఎఐ ద్వారా తీర్పులు ఇస్తే ఇలాంటివేవీ మనకు కనిపించవు. ఎఐ దేవుడు కాదు. ఎఐ అనేది కూడా మనిషి చేసిన ఒక టెక్నాలజీ. ఆ ఎఐని ఎలా ట్రైన్ చేశామనేది కూడా ముఖ్యం. ఒక వర్గానికి అనుకూలంగా ఉండేలా ఎఐని ట్రెయిన్ చేస్తే అది ఆ వర్గానికి అనుకూలంగానే అభిప్రాయాలు చెప్పే ప్రమాదం ఉంటుంది. కోర్టు తీర్పుల్లో ఇలాంటివి చూసుకోకపోతే పెను ప్రమాదానికి దారి తీస్తుంది. కోర్టు తీర్పుల్లో ముఖ్యమైనది రీజనింగ్. ఏ కారణాల వల్ల, ఏయే అంశాలను బేరీజు వేసుకుని.. తాము ఈ తీర్పు చెబుతున్నామనేది న్యాయమూర్తులు ఆ తీర్పు కాపీలో చెబుతారు. దాని వల్ల న్యాయవాదులు, కక్షిదారులకు క్లియర్‌గా అర్థం అవుతుంది. వారు పైకోర్టుకు వెళ్లాలనుకుంటే దీన్ని వారు సవాల్ చేయడానికి సులువు అవుతుంది. ఏ కొత్త టెక్నాలజీలో అయినా సమస్యలు, సవాళ్లు ఉంటాయి.
మరీ ముఖ్యంగా న్యాయ వ్యవస్థ లాంటి చోట ఎఐని నమ్ముకుంటే న్యాయం జరగాల్సిన చోట అన్యాయం జరుగుతుందేమో అనే భయం కూడా ఉంటుంది. మనం ఇక్కడో ఉదాహరణ చెప్పుకోవాలి. కొన్ని దశాబ్దాల క్రితం కంప్యూటర్లు వచ్చిన కొత్తలో వర్క్ లోడ్‌ను మేనేజ్ చేయడానికి కంప్యూటర్లు తీసుకోవాలని కొన్ని బ్యాంకులు భావించాయి. అయితే, దీన్ని అప్పటి ఉద్యోగులు అత్యంత తీవ్రంగా వ్యతిరేకించారు. కంప్యూటర్లు తప్పులు చేస్తాయని.. వాటి వల్ల సమస్యలు వస్తాయని, తమకు ఉద్యోగ భద్రత ఉండదని చాలా ఆందోళనలు కూడా చేశారు. కానీ ఇప్పుడు 2025లో కంప్యూటర్ లేని బ్యాంక్ లేదు. అలాగే, తొలి నాళ్లలో కొన్ని సవాళ్లను జడ్జీలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. కానీ భవిష్యత్తులో అది సమస్యలను తక్కువ చేసుకుంటూ వెళ్తుంది. ఏదేమైనా ఇప్పటికిప్పుడు కోర్టుల్లో ఎఐ అనేది అంత సులువైన వ్యవహారం కాదు. కానీ, 5 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ కేసులు 10 కోట్లకు పెరగకుండా ఉండాలంటే కచ్చితంగా ఒక చరిత్రాత్మక, సంచలనాత్మక నిర్ణయం తీసుకోవాలి.
ఐనం ప్రసాద్
98489 28787