థానే: మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ముంబ్రా ప్రాంతంలోని దౌలత్ నగర్లోని లక్కీ కాంపౌండ్లో మంగళవారం తెల్లవారుజామున 12:36 గంటలకు ఓ భవనంలోని ఒక భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 62 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోగా, ఆమె కోడలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న థానే మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ సెల్ చీఫ్ యాసిన్ తడ్వి వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాలుగు అంతస్తుల భవనంలోని ఒక ఫ్లాట్ పారాపెట్లో ఒక భాగం అకస్మాత్తుగా కూలిపోయి రోడ్డు పక్కన నడుస్తున్న ఇద్దరు మహిళలపై పడ్డిందని ఆయన చెప్పారు. వారిలో ఒకరిని ఇల్మా జెహ్రా జమాలీ (26), ఆమె అత్త నహిద్ జైనుద్దీన్ జమాలీ (62)లుగా గుర్తించినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన జమాలీని ఆసుపత్రికి తరలించిన తర్వాత మరణించినట్లు అధికారి తెలిపారు. గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని ఆయన చెప్పారు.
పౌరసంఘం ప్రభావిత భవనాన్ని ‘C2B’ కేటగిరీ కింద ప్రమాదకరమైనదిగా ప్రకటించిందని అధికారి తెలిపారు. “భద్రతా కారణాల దృష్ట్యా, భవనంలోని అన్ని ఇళ్లను ఖాళీ చేయించారు. ఆ ప్రాంగణానికి సీలు వేశారు. నివాసితులు తమ బంధువులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు” అని ఆయన చెప్పారు.