బెంగళూరు: రేణుకస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ (Actor Darshan) పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాను జైలులో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, తాను ఇక్కడ బతకలేకపోతున్నానని దర్శన్ జడ్జి ఎదుట వాపోయాడు. రేణుకస్వామి కేసు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే దర్శన్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు జడ్జితో మాట్లాడుతూ.. అగ్రహారం జైలులో సదుపాయాలు లేవని ఫిర్యాదు చేశాడు.
‘‘సూర్యరశ్మిని చూసి నెల రోజులైంది. గదిలో దుస్తులు దుర్వాసన వస్తున్నాయి. ఫంగస్ తీవ్రత భయాందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను బతకలేను. నాకు విషమివ్వండి.. ఇక్కడ జీవితం అత్యంత దుర్భరంగా ఉంది’’ అని జడ్జి ముందు దర్శన్ (Actor Darshan) తన గోడును చెప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే జడ్జి అలాంటివి కుదరవు అని తేల్చి చెప్పేశారట.
రేణుకస్వామి హత్య కేసులో దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు గత ఏడాది డిసెంబర్‌లో బెయిల్ మంజూరు చేసింది. కానీ, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ని రద్దు చేస్తూ.. దర్శన్‌ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని.. జైలులో దర్శన్‌కు ఎలాంటి ప్రత్యేకమైన వసతులు కల్పించవద్దని పేర్కొంది.
Also Read : రోడ్డు ప్రమాదంపై స్పందించిన కాజల్.. క్షేమంగా ఉన్నానంటూ పోస్ట్