ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలిస్తే ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారని అన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డగా భావించాలని సూచించారు. ఎన్నికల కమిషనర్‌గా టిఎన్ శేషన్ గతంలో ఆ పదవికి ఎలా వన్నె తెచ్చారో…జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా ఆ విధంగా పదవికి వన్నె తెస్తారని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కూడా అంజలి ఘటించారు.
అనంతరం కవిత మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ సాధనే తమ ధ్యేయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తెలిపారు. ఈ ప్రక్రియలో కెసిఆర్ ఉద్యమ స్ఫూర్తినే ఆదర్శంగా తీసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటానని కెసిఆర్ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తాము కూడా సామాజిక తెలంగాణ కోసం ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు. సామాజిక తెలంగాణ కోసం లెప్ట్ వింగ్, రైట్ వింగ్ నాయకులు, మేధావులను కలుస్తామన్నారు. సమాజంలో అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకొని తెలంగాణ సమాజాన్ని మరింత పటిష్టం చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు. మూడో సారి గెలిస్తే కెసిఆర్ సామాజిక తెలంగాణ చేసే వారని, కెసిఆర్ అజెండాను జాగృతి ద్వారా ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు.
రేవంత్ అవినీతిని ప్రశ్నిస్తాం
మొన్నటి వరకు కాళేశ్వరం కూలిందన్న రేవంత్ రెడ్డి…అదే ప్రాజెక్ట్ లోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు ఎలా తెస్తున్నారని కవిత ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్‌లో రేవంత్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తెస్తే 1500 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయని గుర్తు చేశారు. కానీ మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తామంటూ రూ. 7500 కోట్లు ఖర్చు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. మేఘా కృష్ణారెడ్డి మరిన్ని మేడలు కట్టేందుకు రేవంత్ సహకరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల సొమ్ము రేవంత్ ఇంటి సొమ్ము కాదన్నారు. ప్రాజెక్ట్ విలువ రూ. 7500 కోట్లకు ఎందుకు చేరిందో చెప్పే వరకు ప్రశ్నిస్తామన్నారు.
ప్రజల్లో స్ఫూర్తి నింపిన కాళోజీ, చాకలి ఐలమ్మ
తెలంగాణ ప్రజలను కదలించిన కవి కాళోజీ అని అని కవిత పేర్కొన్నారు. పుట్టుక నీది, చావు నీది బతుకంతా తెలంగాణది అని ఆయన మనలో స్ఫూర్తి నింపారని అన్నారు. కవికి మరణం ఉండదని…కాళోజీ అనుసరించిన విలువలు, కవిత్వం ఇప్పటికీ ఆయనను గుర్తు చేసుకునేలా చేస్తున్నాయన్నారు. ఒక మహిళ అనుకుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని వ్యాఖ్యానించారు.