నేపాల్ మరో బంగ్లాదేశ్‌గా మారుతుందా? సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువత చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం దిగివచ్చి నిషేధాన్ని ఎత్తివేసినా పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఈ నిరసనలు కేవలం సోషల్ మీడియాపై జెన్ జెడ్ యువత చేస్తున్న ఆందోళన మాత్రమే కాదని ప్రభుత్వవర్గాల్లోని అవినీతికి ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత కూడా కారణమని చెబుతున్నారు.తాజాగా మంగళవారం ఉదయం కూడా నేపాల్ రాజధాని (Nepal crisis reason) ఖాట్మండులో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖాట్మండులో అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, ఇతర మంత్రులు, నాయకుల నివాసాలకు నిప్పుపెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ప్రధాని కెపి శర్మ ఓలీ విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.
Also Read: జూబ్లీహిల్స్ అభ్యర్థి దానం?
నేతలంతా రాజీనామాలు చేయాల్సిందేనని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు అరడజను మంది మంత్రులు రాజీనామా చేశారు. ప్రధాని కెపి శర్మ ఓలీకి రాజకీయంగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నిరసనలు హింసాత్మకంగా మారడంతో నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి రమేశ్ లేఖక్ సోమవారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వ్యవసాయ మంత్రి రామ్‌నాథ్, నీటిసరఫరా మంత్రి ప్రదీప్ యాదవ్ కూడా రాజీనామా ప్రకటించారు. అయితే ఈ వరుస రాజీనామాలను యువత పట్టించుకోలేదు. కర్ఫూ ఆంక్షలున్నా సరే ముందుకుసాగి రాజీనామా చేసిన వాళ్లతోపాటు ఇతర నేతల ఇళ్లకు నిప్పంటిస్తున్నారు. అధికారిక నివాసాలనుంచి మంత్రులను హెలికాప్టర్ ద్వారా మరో ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ క్లిష్ట పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రధాని నివాసంనుంచి సురక్షితంగా వెళ్లిపోయేందుకు మిలిటరీ సహాయం కావాలని ప్రధాని ఓలి అడిగినట్టు, అయితే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఓలీకి ఆర్మీ చీఫ్ సూచించినట్టు తెలుస్తోంది. ఓలీ రాజీనామా చేస్తే మిలిటరీ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతుందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యం లోనే తనను సురక్షితంగా దేశం దాటించాలనే షరతు మీద ఆయన సైన్యం చెప్పిన ప్రకారం రాజీనామా చేసినట్టు అక్కడి మీడియా కథనాలు వస్తున్నాయి. నేపాల్‌లో 26 (Nepal crisis reason) సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ యువత నేపాల్ జెన్ జెడ్ ఉద్యమాన్ని చేపట్టడం ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఇంత తీవ్రంగా ఉద్యమం సాగడానికి 36 ఏళ్ల సుదన్ గురుంగ్ నాయకత్వమే ప్రధాన కారణం. 2015లో నేపాల్‌లో భారీ భూకంపం వచ్చిన తరువాత ‘హమి నేపాల్’ అనే సంస్థను సుదన్ గురంగ్ స్థాపించాడు. అప్పటి విపత్తులో సుదన్ తన బిడ్డను కూడా కోల్పోయారు. ఈ సంఘటనతో ఆయన తన జీవితాన్ని ఎన్‌జిఒ వైపు మలుచుకున్నారు. భూకంపం తరువాత సహాయ, పౌరసేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. గతంలో బిపి కొయిరాల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పారదర్శకత కోరుతూ ఘోప క్యాంప్ పేరిట సుదన్ ఆందోళనలు సాగించారు.
ఇప్పుడు సామాజిక మాధ్యమాల నిషేధంతో ప్రారంభమైన ఉద్యమాన్ని సరైన దిశలో నడిపించే నాయకత్వం ఆయనదే. 19972012 మధ్య పుట్టిన యువత (జనరేషన్ జెడ్) మొబైల్ ఫోన్లు వినియోగంలో ఎలాంటి ఆంక్షలు కానీ, అడ్డంకులు కానీ ఎదుర్కోలేదు. చదువుల దగ్గరి నుంచి సంపాదనకైనా, సంభాషించుకోవడానికైనా సోషల్ మీడియాపైనే ఆధారపడడం పరిపాటి అయింది. నిజ జీవితంతో మమేకమైన సోషల్ మీడియాపై నిషేధం విధించేసరికి యువత ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. టిక్‌టాక్, వైబర్ మినహా అన్ని ప్రధాన సోషల్ మీడియా సైట్లనూ నిషేధించడంతో తట్టుకోలేకపోయారు. ఈ నెల 4న ప్రభుత్వం నిషేధం విధించడంతో దానికి వ్యతిరేకంగా టిక్‌టాక్‌లో చర్చ మొదలైంది. ఈ చర్చ కెపి శర్మ ఓలీ ప్రభుత్వ అవినీతివైపు మళ్లింది. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, బంధుప్రీతి ఎక్కువైందని, నేతల కొడుకులు, కూతుళ్లు రాజ్యమేలుతున్నారంటూ ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ పరిణామాల ఫలితంగా యువత ఆందోళన బాటపట్టారు. నిషేధించాల్సింది అవినీతిని కానీ, సోషల్ మీడియాను కాదని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు సాగించారు.
అవినీతిపై కదం తొక్కి యువత మంత్రులు, అధికార పార్టీకి చెందిన నేతలే లక్షంగా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఆ దేశ ఆర్థిక మంత్రి, డిప్యూటీ ప్రధాని బిష్ణుప్రసాద్ పౌడేల్ పై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. కాలితో తన్ని వీధుల్లో పరిగెత్తించి మరీ తరిమితరిమి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నిరసనల నేపథ్యంలో ఖాట్మండు లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం సైతం మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం భారత్ నుంచి నేపాల్‌కు వెళ్లాల్సిన పలు విమానాలపై పడింది. ఢిల్లీ ఖాట్మండు మార్గంలో (Nepal crisis reason) నడుస్తున్న మూడు విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఢిల్లీ, ముంబై నుంచి వెళ్లిన విమానాలు ఖాట్మండులో ల్యాండింగ్ కాలేక తిరిగి లక్నోకు మళ్లించారు. నిరసన కారులు నిప్పు పెట్టడంతో దక్షిణ భాగం నుంచి వచ్చే విమానాలు ల్యాండ్ కాలేకపోయాయని నేపాల్ పౌర విమానయాన అధారిటీ అధికారి జ్ఞానేంద్ర భూల్ చెప్పారు. మరోవైపు భారత రాయబార కార్యాలయం పౌరుల కోసం అత్యవసర హెల్ప్‌లైన్‌లను జారీ చేసింది. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని, పరిస్థితిని గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.