Thursday, September 11, 2025

నేపాల్ తాత్కాలిక సారథిగా సుశీలా కర్కీ?.. ‘జెన్‌జడ్’ చర్చలు!

- Advertisement -
- Advertisement -

ఖాట్మండ్: కల్లోల నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాత్కాలిక సారథిని ఎన్నుకునేందుకు అక్కడి యువత (జెన్‌జెడ్) ముమ్మర చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీ వైపు జెన్‌జెడ్ ఉద్యమకారులు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. తాత్కాలిక సారథిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అవినీతికి వ్యతిరేకంగా నేపాల్‌లో కొనసాగుతున్న ఉద్యమం హింసాత్మక సంఘటనలకు దారి తీయడంతో ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కొత్త సారథిని ఎన్నుకునేందుకు జనరేషన్ జెడ్ ఉద్యమకారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

దాదాపు 5 వేల మంది బుధవారం వర్చువల్‌గా సమావేశమై మంతనాలు జరిపారు. ఖాట్మండ్‌మేయర్ బాలెన్ షాను తొలుత పరిగణన లోకి తీసుకున్నప్పటికీ, ఆయన నుంచి స్పందన రాలేదని తెలిసింది. దీంతో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీ వైపు జెన్‌జెడ్ ప్రతినిధులు మొగ్గు చూపినట్టు నేపాల్ మీడియా వెల్లడించింది. బాధ్యతలు స్వీకరించేందుకు కర్కీ సిద్ధమైతే తొలుత ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్‌తో భేటీ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ ఆమోదం పొందాల్సి ఉంటుందని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఎవరీ కర్కీ?
సుశీలా కర్కీ (72) కి నేపాల్ చరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. తొలుత ఉపాధ్యాయురాలిగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత న్యాయవ్యవస్థలో అడుగు పెట్టారు. నిర్భయంగా సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ అవినీతి మరకలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. 2009 లో సుప్రీం కోర్టులో అడుగుపెట్టి , శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు చీఫ్ జస్టిస్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టి , నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు.

25 మంది మృతి
నేపాల్‌లో గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకు ముగ్గురు పోలీసులు సహా 25 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. మరో 633 మంది గాయాలపాలైనట్టు తెలిపారు. ఆందోళనల్లో గాయపడిన నేపాలీ కాంగ్రెస్ చీఫ్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా, ఆయన భార్య విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్ బాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరు కోలుకుంటున్నట్టు తెలిసింది. నేపాల్‌లో ఆందోళనలు అదుపు లోకి రాకపోవడంతో సైన్యం నిరవధిక కర్ఫూ విధించిన సంగతి తెలిసిందే.

Also Read: మంత్రిగా నియామకం.. కొంతసేపటికే మాట్లాడుతూ కుప్పకూలిపోయింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News