రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రత దళాలు దాదాపు 10 మంది మావోయిస్టులను హతమార్చినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో అగ్ర మావోయిస్టు కమాండర్ మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్‌తో పాటు మరో తొమ్మిది మంది నక్సలైట్లు మృతి చెందారని తెలిపారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుందని.. మరణించినవారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. రాయ్‌పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమ్రేష్ మిశ్రా ఎన్కౌంటర్ గురించి వివరాలను వెల్లడిస్తూ.. ఈ ప్రాంతంలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా మెయిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో గురువారం ఎన్కౌంటర్ జరిగిందని అన్నారు.
“స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ – CRPF ఎలైట్ యూనిట్), ఇతర రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. అడపాదడపా కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి” అని మిశ్రా పేర్కోన్నారు. ఇక, భద్రతా బలగాలు.. సంఘటనాస్థలం నుంచి మావోల మృతదేహాలతోపాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, నక్సలైట్లపై గత కొన్ని నెలలుగా భద్రతా దళాలు అనేక ఆపరేషన్లు నిర్వహించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చి 31, 2026 నాటికి వామపక్ష ఉగ్రవాదాన్ని అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పిన విషయం తెలిసిందే.