అమెరికాలోని వైద్యనిపుణుల బృందం క్యాన్సర్ అరుదైన రూపం అడెనాయిడ్ సిస్టిక్ కార్సెనోమాకు చికిత్స చేయడంలో స్టెప్ అండ్ షూట్ స్పాట్ స్కానింగ్ ప్రోటాన్ ఆర్క్ థెరపీ (స్పార్క్) అనే అత్యంత అధునిక ప్రక్రియను విజయవంతంగా నెరవేర్చగలిగారు. ఈ చికిత్స ప్రోటాన్లను ఉపయోగించి కణితిని లక్షంగా చేసుకుని చుట్టుపక్కల కణజాలానికి హాని జరగకుండా చూస్తుంది. ఈ పద్ధతిలో రేడియేషన్ బీమ్ కణితి (ట్యూమర్) చుట్టూ తిరుగుతూ కణితికి మరింత ఎక్కువ మోతాదులో రేడియేషన్ అందిస్తుంది. ప్రోటాన్ పుంజం ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఆగి, ఆపై కణితి ఒక భాగాన్ని స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత ప్రోటాన్ పుంజం మరో ప్రదేశానికి కదులుతుంది. అక్కడ కూడా కణితిని స్కాన్ చేస్తుంది. ఇలా ఒకదాని తర్వాత మరొకటిగా కణితి అంతటా స్కాన్ చేస్తుంది. ఈ పద్ధతిలో ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటంటే తక్కువ దుష్ప్రభావాలు ఉంటాయి. చుట్టుపక్కల కణజాలానికి హాని అంతగా ఉండదు. అందువల్ల చికిత్స తర్వాత దుష్ప్రభావాలు కూడా తక్కువగానే ఉంటాయి. కణితిని చాలా కచ్చితంగా లక్షం చేసుకుంటుంది. సాధారణ ప్రోటాన్ చికిత్సలతో పోలిస్తే చికిత్స సమయం తక్కువ.
తల, మెడ, ప్రోస్టేట్ కాన్సర్లకు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు, ఇతర క్యాన్సర్లకు ఈ చికిత్సను ఉపయోగిస్తారు. సాధారణంగా రేడియేషన్ థెరపీలో అలసట, వికారం, మింగడంలో ఇబ్బంది వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. కానీ ఈ ఆర్క్ థెరపీలో ఇలాంటి దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి. లేదా అసలు ఉండకపోవచ్చు. అమెరికా వైద్య నిపుణుల బృందం ఈ ఆర్కె థెరపీకి సంబంధించి మూడు సాంకేతిక ప్రక్రియల ఫలితాలను బేరీజు వేశారు. ప్రస్తుత ప్రామాణిక ఆరోగ్యభద్రత విధానం ఎస్‌ఎఫ్‌ఒ ఐఎంపిటి, స్టెప్ అండ్ షూట్ స్పార్క్, పూర్తి డైనమిక్ స్పార్క్ (కంప్యూటర్లతో ఉత్తేజపర్చడం). ఎస్‌ఎఫ్‌ఒ ఐఎంపిటీ కన్నా ఈ స్పార్క్ ప్రక్రియలు మెదడుకు సంబంధించి కణతుల్లో 10% వరకు రేడియేషన్ డెలివరీని తగ్గిస్తాయి. ఆప్టికల్ చియాసిమ్‌కు 56% వరకు రేడియేషన్ డెలివరీని తగ్గిస్తాయి.
ఆప్టికల్ చియాసిమ్ అంటే మెదడులో ఎక్స్ ఆకారంలో ఉండే నేత్ర నాడీ వ్యవస్థ. నోటి కుహరం (ఓరల్ కెవిటి)కు 72% వరకు, స్పైనల్ కెనాల్‌కు 90% వరకు రేడియేషన్ డెలివరీని తగ్గిస్తాయి. ఈ విధానం కచ్చితంగా చెప్పుకోతగినదని పరిశోధకులు చెబుతున్నారు. తల, మెడలో ఉండే కణతులు డోస్ డెలివరీని పరిమితం చేయడం అనేది క్లిష్టతరమైన ప్రక్రియగా వైద్య నిపుణులు పేర్కొన్నారు. భరించగల స్థాయి కన్నా ఎక్కువ రేడియేషన్ డోస్‌ను ఆయా అవయవాలు గ్రహిస్తే సరిచేయలేని నష్టాన్ని కలిగిస్తాయని చెప్పారు.
పూర్తి డైనమిక్ స్పార్క్ చికిత్స నిర్వహించడం మంచిదే కానీ ఆర్క్ చికిత్సలు రెండింటిలో భేదం స్వల్పమే. డైనమిక్ స్పార్క్‌లో డోస్ శక్తి, డెలివరీని నిరంతరం సర్దుబాటు చేయవలసి వస్తుంది. అదే స్టెప్ అండ్ షూట్ ప్రక్రియలో ముందుగా నిర్ణయించిన రూపకల్పన ప్రకారం మెషిన్ అనుసరిస్తుంది. అదీ కాక డైనమిక్ స్పార్క్ ప్రక్రియ ఇంకా అభివృద్ధి దశలో ఉందని, ప్రస్తుత సమాచార వ్యవస్థతో రెగ్యులేటరీ క్లియరెన్స్ కోసం నిరీక్షిస్తోందని పరిశోధకులు చెప్పారు. స్టెప్ అండ్ షూట్ స్పార్క్ చికిత్స అందుకున్న 46 ఏళ్ల మహిళకు పేరోటిడ్ గ్లాండ్ క్యాన్సర్ ఉంది.
ఈ క్యాన్స్‌ర్ ఆమె ముఖం నాడీ వ్యవస్థ ద్వారా ఆమె కపాలం కింద వరకు పాకింది. 2024 ఆగస్టు లో ఈ బృందం ఆమెకు ఈ చికిత్స ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.స్టెప్ అండ్ షూట్ స్పార్క్ చికిత్స 33 సెషన్లు పూర్తి చేయించారు. ఈ చికిత్స పూర్తయిన తరువాత ఆమె స్వల్పంగా చర్మం నొప్పి కలిగిందని, తినేటప్పుడు లేదా పనులు చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదని పేర్కొంది. కపాలం దిగువ భాగం వంటి క్లిష్టమైన ప్రదేశాలకు డోస్ డెలివరీ కచ్చితంగా ఉండేలా చేయడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి సాధారణంగా లాలాజల గ్రంథులను ప్రభావితం చేస్తుంది. ఇది రొమ్ము, లాక్టియల్ గ్రంథులు, ఇతర స్రావకణజాలాల్లో కూడా తలెత్తుతుంది. నెమ్మదిగా సమీపంలోని కణాలను, నరాలకు పాకుతుంది. దీని రోగ నిర్ధారణ, నివారణ చికిత్స సవాళ్లతో కూడుకున్నది. ఈ అడెనాయిడ్ సిస్టిక్ కార్పిరోమా లక్షణాలను పరిశీలిస్తే కణితి ఉన్న ప్రదేశం వద్ద నొప్పి ఎక్కువగా ఉండి అసౌకర్యం కలిగిస్తుంది. లాలాజల గ్రంథి ప్రాంతాల్లో గడ్డ లేదా వాపు వస్తుంది. ముఖనరాలు బలహీనం కావడం లేదా పక్షవాతం రావడం జరుగుతుంది. మింగడానికి ఇబ్బందిపడతారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. నిరంతరం దగ్గు లేదా గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి తీవ్రమైన లక్షణాలు పరిశీలిస్తే నరాలు ప్రభావితమైతే తిమ్మిరి లేదా జలదరింపు కలుగుతుంది. వ్రణం పుట్టి రక్తస్రావం జరుగుతుంది. ఈ వ్యాధిని మూడు రకాలుగా విశ్లేషించారు. ఒక్కో రకం విభిన్న ప్రవర్తనలు, రోగ నిరూపణలు ఉంటాయి. క్రిబ్రిఫార్మ్, గొట్టపురకం, ఘనరకం అనే ఈ మూడు రకాలను వైద్యులు ఆయా లక్షణాల బట్టి గుర్తించవలసి ఉంటుంది. క్రిబ్రిఫార్మ్ రకం జల్లెడలాంటి హిస్టోలాజికల్ నమూనాను కలిగి ఉంటుంది. ఇది అత్యంత సాధారణ రూపం. ఇది నెమ్మదిగా పెరుగుతుంది. దీన్ని గుర్తించడం కష్టం. ఆలస్యంగా రోగ నిర్ధారణ జరుగుతుంది.
గొట్టపు రకం ఇది నెమ్మదిగా పెరుగుతుంది. ఇతర రకాలతో పోలిస్తే ఇది తేలికపాటి లక్షణాలను, నరాల ప్రమేయం తక్కువగా ఉంటుంది. ఘనరకం అత్యంత దూకుడుగా ఉంటుంది. కణితి ద్రవ్యరాశితో వేగంగా పెరుగుతుంది. మెటాస్టాటిస్ ప్రమాదం ఎక్కువ. తరచుగా ఇంటెన్సివ్ చికిత్స, పర్యవేక్షణ అవసరం. ప్రామాణిక చికిత్సలకు ఒకంతట ఇది లొంగదు. నిరంతరం ముఖం నొప్పిగా ఉన్నా, వాపు లేదా మింగడంలో ఇబ్బంది ఉన్నా వెంటనే వైద్యుల్సి సంప్రదించాలి. సకాలంలో రోగ నిర్ధారణ జరిగి, చికిత్స తీసుకుంటే సమస్యల ప్రమాదం తగ్గుతుంది. వెంటనే చికిత్స చేయకుండా అశ్రద్ధ చేస్తే కణితులు ఊపిరితిత్తులు, ఎముకలు, లేదా కాలేయానికి వ్యాపిస్తాయి. నొప్పి లేదా పక్షవాతానికి దారి తీస్తాయి. మింగడం ఇబ్బందిగా మారి, శ్వాస తీసుకోవడం లేదా మాట్లాడడం కష్టం అవుతుంది.
Also Read: వీసాలపై వెయ్యికళ్ల నిఘా
డాక్టర్ బి. రామకృష్ణ
99599 32323