Friday, September 12, 2025

యూరియా కొరత పాలకుల సృష్టి!

- Advertisement -
- Advertisement -

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో యూరియా కొరత వల్ల రైతాంగం తీవ్ర అవస్థలు పడుతున్నారు. సేద్యానికి యూరియా కీలకంగా మారింది. పైరు ఎదుగుదలకు యూరియా తప్పనిసరిగా వేయాలి. రెండు రాష్ట్రాల్లో ఖరీఫ్ సేద్యం చివరి దశకు వచ్చింది ప్రారంభంలోనే పొలంపై యూరియా చల్లాలి. రైతులు ప్రాథమిక పరపతి సంఘాలకు, ఎరువుల షాపులకు వెల్తే యూరియా లేదనే మాట వస్తున్నది. దాంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సకాలంలో యూరియా చల్లకపోతే దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. యూరియా కోసం తెలంగాణ రైతాంగం రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పిఎసిఎస్)వద్ద, ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు పడుతున్నారు. పనులు మానుకుని వర్షానికి, ఎండలకు తట్టుకుని క్యూ లైన్లలో నిలబడుతున్నారు. గంటల తరబడి నిలబడ లేక వరుసలో చెప్పులుపెట్టి సేద తీరుతున్నారు. తెలంగాణ కోటి 32 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనాగా ఉంది. అందులో 62.46 లక్షల ఎకరాల్లో వరి సేద్యం చేస్తున్నారు. 48.93 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. కంది 6.69 లక్షల, మొక్కజొన్న 5.21 లక్షల ఎకరాల్లో రైతు సేద్యం ఉంది.

ఈ ఖరీఫ్ సేద్యానికి 9.80 లక్షల టన్నుల యూరియా అవసరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కేంద్ర 9.8 లక్షల యూరియా కేటాయించింది. 2025 ఆగస్టు నాటికి కేంద్రం నుంచి 8.32 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 5.12 లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. కేంద్రం నుంచి ఏప్రిల్ 1.70 లక్షల టన్నులు, మే 1.60 లక్షలు, జూన్‌లో 1.70 లక్షలు, జులైలో 1.60 లక్షలు, ఆగస్టులో 1.70 లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుండి రాష్ట్రానికి అత్యధిక శాతం యూరియా రావాల్సి ఉంది. సాంకేతిక కారణాలు, రిపేర్లతో మూడు సార్లు షట్‌డౌన్ అయింది. దీంతో ఆగస్టు వరకు 1.69 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 1.06 లక్షల టన్నులు మాత్రమే సరఫరా అయ్యింది. రామగుండం ఫ్యాక్టరీ సక్రమంగా పనిచేయక పోవటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం. రెండు ప్రభుత్వాలు ఫ్యాక్టరీని పట్టించుకోలేదు. యూరియా కొరత తీవ్రమైన తర్వాత మాత్రమే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

తెలంగాణలో ఎక్కువగా దొడ్డ యూరియాను రైతులు వినియోగిస్తారు. దొడ్డ యూరియాను ఎప్పుడూ అధికారులు ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. నేడు పిఎసి ఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు) లకే కాకుండా ఇతర సంస్థలకు కూడా కేటాయిస్తున్నారు. జిల్లాలకు వచ్చే యూరియాలో 60% పిఎసి ఎస్‌లకు, 40% ఆయా కంపెనీల ఏజన్సీలు కలిగిన ప్రైవేట్ సంస్థలకూ కేటాయిస్తున్నారు. ఫలితంగా పిఎసిఎస్ లకు రావాల్సిన యూరియా తగ్గి రైతులకు సరిపోను యూరియా లభించటం లేదు. అగ్రి రైతు సేవా కేంద్రం, ఎన్‌డిసిఎం ఎస్ (డిస్ట్రిక్ కస్టమర్ మేనేజ్ మెంట్ సిస్టమ్) ఫార్మర్ ప్రొక్యూర్‌మెంట్ ఆర్గనైజేషన్‌లలో యూరియా కొనుగోలుతోపాటు ఇతర పురుగు మందులను లింక్ పెట్టి విక్రయిస్తున్నారు. ఇది రైతుకు అదనపు ఆర్థిక భారంగా మారింది. ప్రతి సారి కంటెయినర్ రాగానే ఒక్కో షాపు నుంచి 15 నుంచి 20 వేలు తీసుకుని వారికే అధికారులు కేటాయిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2025 ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటి వరకు 8.21 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. 6.22 లక్షల టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. గత సంవత్సరం కన్నా 10,138 టన్నుల తక్కువ. 2024 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 4,69,297 టన్నులు సరఫరా కాగా, ఈ సంవత్సరం 3,72,246 టన్నుల మాత్రమే కేంద్రం నుండి సరఫరా జరిగింది. తగ్గింపు 96 వేల టన్నులకు పైగా ఉంది. ఆగస్టుకి లక్షా 30 వేల టన్నుల యూరియా కేంద్రం సరఫరా చేయాల్సి ఉండగా, అందింది 49,485 టన్నులు మాత్రమే. తాజా 53 వేల మెట్రిక్ టన్నులు అదనంగా కేటాయించినట్లు కూటమి ప్రభుత్వ చెప్పటం దాని వంచనకు నిదర్శనం. ఆగస్టు నెల కోటాలో ఇంకా కేంద్రం నుంచి 81 వేల టన్నులు రావాల్సిన దానిలో 53 వేల టన్నులు కేంద్రం విడుదల చేసినా ఇంకా 28 వేల టన్నులు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. దీన్ని గమనిస్తే అదనంగా కేంద్రం యూరియా కేటాయింపు ఎక్కడ. 53 వేల కేటాయింపుల్లో కూడా కాకినాడ పోర్టు నుండి 17,293 టన్నులు దిగుమతి చేసుకోవటానికి మాత్రమే కేంద్రం జిఒ విడుదల చేసింది.

మిగతా యూరియా విషయం కేంద్రం ప్రస్తావించలేదు. దేశవ్యాప్తంగా యూరియా కోత 10% ఉండగా, రాష్ట్రంలో 25%గా ఉంది. ఈ వాస్తవాన్ని కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మరుగుపరుస్తున్నది. సెప్టెంబర్ 9 నాటికి 22 జిల్లాల్లో యూరియా కొరత ఏర్పడింది. ఎన్‌డిఎ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండి కూడా రాష్ట్రానికి కావాల్సిన యూరియాను కేంద్రంనుంచి తెచ్చుకోలేకపోవటం చంద్రబాబు కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. యూరియా కొరతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం. దేశపాలకులు అధికారం చేపట్టి 78 సంవత్సరాలైనా వ్యవసాయ అవసరాలకు సరిపోను యూరియా ఉత్పత్తి చేయడంలో విఫలమయ్యారు. దేశంలో 32 యూనిట్లలో యూరియా ఉత్పత్తి జరుగుతున్నది. 2023- 24లో 283 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఇది దేశ అవసరాలకు సరిపోక లక్షల టన్నుల యూరియా దిగుమతి చేసుకుంటున్నాము. 2021 -22లో 6.52 మిలియన్ డాలర్ల విలువైన 10.16 మిలియన్ టన్నుల యూరియా దిగుమతి అయ్యింది. 2022- 23లో 10 మిలియన్ టన్నులు, 2023 -24లో 7 మిలియన్ టన్నుల యూరియా మోడీ ప్రభుత్వం దిగుమతి చేసుకుంది.

ప్రధానంగా చైనా, సౌదీ అరేబియా, ఒమన్, ఈజిప్టు, ఉక్రెయిన్, ఖతార్ నుండి దిగుమతి జరుగుతున్నది. యూరియా సబ్సిడీని తగ్గించుకునేందుకు మోడీ ప్రభుత్వం యూరియాను 10% తగ్గుదలను సృష్టించింది. ఈ సంవత్సరం చైనా నుండి యూరియా దిగుమతి జరగలేదు. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం ఆగస్టు 1,2025 నాటికి దేశంలో 37.19లక్షల టన్నుల యూరియా నిల్వఉంది. గత సంవత్సరం కన్నా 49.24 లక్షల టన్నులు తక్కువ. ఉత్పత్తి, నిల్వతగ్గటంతో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన కేటాయింపుల్లో మోడీ ప్రభుత్వం తగ్గింపులు చేస్తున్నది. దాని ఫలితమే తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత. యూరియా కొరతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని రైతాంగం గ్రహించి, రైతులకు కావాల్సిన యూరియా తక్షణమే సప్లయ్ చేయాలని, కొత్త యూరియా యూనిట్లను నెలకొల్పి యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని, ప్రైవేట్ సంస్థలకు యూరియా కేటాయింపులు చేయరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉద్యమ బాటపట్టాలి.

Also Read: డాలర్‌కు ప్రత్యామ్నాయం తక్షణావసరం

బొల్లిముంత సాంబశివరావు
98859 83526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News