కర్ణాటక లోని మంగళూరు సమీపాన మంగళవారం (9.11.25) ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 66 పై 44 ఏళ్ల మహిళ అకస్మాత్తుగా గుంతలో పడిపోగా, అదే సమయంలో స్పీడుగా వచ్చిన ట్రక్కు చక్రాలు ఆమె ప్రాణాలను బలిగొన్నాయి. రోడ్ల భద్రత ఏ విధంగా ఉందో ఈ సంఘటన చెబుతుంది. 2019 23 మధ్యకాలంలో కేవలం రోడ్లపై గుంతల కారణంగానే టూవీలర్లు మరణాలసంఖ్య 9109 వరకు ఉన్నట్టు రోడ్లు, రవాణా మంత్రిత్వశాఖ వెల్లడించడం గమనార్హం. ఉగ్రవాదుల దాడులకంటే రోడ్ల గుంతల మరణాలే ఎక్కువగా ఉన్నాయని ఎస్. రాజశేఖరన్ కేసు (2025) కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి ప్రమాదాలు అధిక సంఖ్యలో జరగడానికి ఆయా మున్సిపల్ పరిధిలోని అధికారుల బాధ్యతారాహిత్యమే కారణమని సుప్రీం కోర్టు హెచ్చరించింది.
రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, ముఖ్యంగా నాణ్యత లేని మెటీరియల్ ఉపయోగించడం వల్లనే గుంతలు పుట్టుకొస్తుంటాయి. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి, నగరాలు, పట్టణాలు, గ్రామాల వరకు రోడ్ల నిర్వహణలో రాజీపడడంలో నిర్లక్షం, ఉదాసీనత ప్రబలంగా కనిపిస్తోంది. రోడ్ల నిర్వహణ నుంచి జీవితాలకు భద్రత పొందడం రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రజల కనీస హక్కుగా చట్టపరమైన ఆశ్రయం పొందవచ్చని బొంబై హైకోర్టు 2015 లో గుర్తు చేసినప్పటికీ, ప్రజలకు అవగాహన కలగడం లేదు. రోడ్డు ప్రమాదాల్లో నష్టాలపాలైన బాధితులు తగిన నష్టపరిహారం పొందే హక్కు కూడా ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ప్రజాసేవకులు తమ విధుల నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘించినప్పుడు ఆర్టికల్ 300 ఉపయోగించి నష్టపరిహార న్యాయం పొందవచ్చని కూడా సుప్రీం కోర్టు సూచించింది. రోడ్ల భద్రత విషయంలో అధికార యంత్రాంగం కచ్చితంగా బాధ్యత వహించవలసి ఉంది. అలాగే ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలోని రోడ్ల నిర్వహణలో తమ అధికారాలను ఉపయోగించితే బాగుంటుంది. రోడ్ల నిర్వహణ సరిగ్గా అధికారులు నిర్వహించేలా చట్టపరమైన చట్రం అవసరం.
అలాగే గుంతల మరమ్మతుకు అవసరమైన అత్యాధునిక యంత్రాలను కూడా వారికి సమాకూర్చడం తప్పనిసరి. ఈ పనులను చేపట్టే నిర్లక్షం, ఉదాసీనత వహించకుండా కచ్చితమైన జవాబుదారీ వహించేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్షం వహిస్తే జరిమానాలు విధించడం అవసరం. సమర్ధవంతమైన పరిష్కార వ్యవస్థను అమలు చేయాలి. అలాగే ప్రమాద బాధితులకు సకాలంలో నష్టపరిహారం అందించడం కూడా ఎంతో ముఖ్యం. ఇది అధిగమించడం కష్టమైనప్పటికీ లక్షాన్ని సాధించడం తప్పనిసరి. లేకుంటే సగానికి సగం రోడ్డు ప్రమాదాలను తగ్గించాలన్న ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్షాలు, 2021 2030 దశాబ్ద కాలంలో రోడ్డు భద్రతకోసం చేపట్టవలసిన చర్యలను నెరవేర్చడంలో భారత్ వెనకబడక తప్పదు. దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరుగుతున్నాయి. 2023లో దాదాపు 1.73 లక్షలమంది ప్రాణాలు కోల్పోగా, 2024 లో 4.8 లక్షల మంది కన్నా ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. అంటే 2023 కన్నా 4.2 శాతం ఎక్కువ. ప్రతి మూడు నిమిషాలకు ఒకరు వంతున రోజుకు 474 మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలుస్తోంది.
బాధితుల్లో ఐదోవంతు మంది పాదచారులు కాగా, టూవీలర్లు, ముఖ్యంగా హెల్మెట్ ధరించని వారు 44 శాతం వరకు ఉన్నారు. మరణాల్లో రెండింట మూడొంతులు ఓవర్‌స్పీడ్ వల్లనే జరుగుతున్నాయి. 201516 నుంచి 201920 మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాలు జాతీయ స్థాయిలో సరాసరి సంఖ్య కన్నా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు 2023 నివేదిక వెల్లడించింది. వాహనాలు ఢీకొనడం వంటి ప్రమాదాల్లో 90% మానవ ప్రమేయం వల్లనే జరుగుతున్నాయని 2022 లోని నివేదిక వెల్లడించింది. రోడ్డు ప్రమాదాలకు దారితీసే కారణాలను, ప్రాంతాలను, ఇతర పరిస్థితులను అధ్యయనం చేయడానికి, ప్రమాదాలను అదుపు చేయడానికి వీలుగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఒఆర్‌టిహెచ్) 2021లో సాంకేతిక వ్యవస్థను రూపొందించింది. ఇది ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా బేస్ (ఐఆర్‌డి) అనే సెంట్రల్ డిజిటల్ వ్యవస్థ. నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్ దీనిని నిర్వహిస్తుంది. ఏ రాష్ట్రంలో ఎన్ని ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో ఇది అధ్యయనం చేస్తుంది. ఈ ప్రమాదాలను చాలా వరకు అరికట్టడానికి, ముందుగానే ప్రమాద హెచ్చరికలు చేయడానికి వీలుగా కృత్రిమ మేధ (ఎఐ) వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలు చాలా వరకు ఉపయోగపడతాయని అధ్యయనాల్లో తేలింది.
పుణె వంటి నగరాల్లో ప్రజారవాణా వ్యవస్థలు స్మార్ట్ కెమెరాలను ఉపయోగిస్తున్నాయి. డ్రైవర్లు మగతగా ఉన్నా, పరధ్యానంలో ఉన్నా, సిగ్నల్స్ దాటుకుని స్పీడ్‌గా వెళ్తున్నా ఈస్మార్ట్ కెమెరాలు వెంటనే పట్టేస్తాయి. కృత్రిమ మేధ సాయంతో అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఢిల్లీ గురుగ్రామ్ ద్వారకా ఎక్స్‌ప్రెస్ హైవేపై అందుబాటులోకి తీసుకువచ్చారు. ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం, ప్రమాదాలను గుర్తించి హెచ్చరించడం, ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందుతుంది. ఏదైనా ప్రమాదం జరిగితే స్థానిక, జాతీయ రహదారి సిబ్బందికి వెంటనే సమాచారం అందుతుంది. ఈ ప్రక్రియను దేశ వ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై అమలు చేయడానికి కేంద్రం యోచిస్తోంది. ఎన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసినా ప్రజల పరివర్తనలో మార్పు రానిదే ప్రమాదాల నివారణ సాధ్యం కాదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన అభిప్రాయం వ్యక్తం చేయడం సమంజసం.
Also Read: సమర్థతకు ‘టెట్’ గీటురాయి