ఆసియాకప్-2025ను భారత్ ఘన విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో పనికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ)ని చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బౌలింగ్ తీసుకొని యుఎఇని 57 పరుగుల స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత 4.3 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని చేధించింది. అయితే ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) తుది జట్టులో ఉన్న కేవలం కీపింగ్ మాత్రమే చేశాడు. అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ, సంజూ విషయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తున్న తీరుపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ సంతోషం వ్యక్తం చేశారు.
సంజూకి (Sanju Samson) ఇంతలా మద్దతివ్వడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అశ్విన్ పేర్కొన్నారు. సంజూ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నామని.. కెప్టెన్ సూర్య మీడియా సమావేశంలో చెప్పడం ఆనందదాయకం అని అన్నారు. సంజూ మిడిలార్డర్లో బ్యాటింగ్‌కి వస్తాడని.. ఒకవేళ త్వరగా వికెట్ కోల్పోతే అతడు బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. ఇది ప్రాజెక్ట్ సంజూ అని చెప్పవచ్చు అని అన్నారు. తాను సంజూను ఇంటర్వ్యూ చేసినప్పుడు గంభీర్.. సంజూతో ‘‘నువ్వు 21 సార్లు డకౌట్ అయినా.. 22వ మ్యాచ్‌లో నీకు ఛాన్స్ ఉంటుంది’’ అని అన్నట్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
కోచ్, ఓ ఆటగాడికి ఇంతగా మద్దతివ్వడం మంచి పరిణామమని అశ్విన్ హర్షం వ్యక్తం చేశారు. సంజూ నైపుణ్యాలపై మేనేజ్మెంట్కి ఉన్న అవగాహన, నమ్మకం తనకు అర్థమైందని.. అతడి గురించి వాళ్లు ఆలోచించడం నిజంగా అద్భుతమని.. టీం మేనేజ్మెంట్, కోచ్ గౌతమ్ గంభీర్, టి-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లపై అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించారు.
Also Read : మహిళల ఆసియా కప్.. చైనా చేతిలో భారత్ ఓటమి