అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నంలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేసినందుకు ఆర్ఎంపి వైద్యుడిపై వంద మంది జనసైనికులు మూకుమ్మడి దాడి చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ లో పవన్ పై ఆర్ఎంపి వైద్యుడు పోతుమూడి గిరిధర్ కుమార్ విమర్శలు చేశాడు. తాళ్లపాలెం పంచాయతీలోని హెచ్ సత్తెనపాలెంలోని గిరిధర్ ఇంటిపై మంది మంది జనసైనికులు దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే జనసేన కార్యకర్తలు గిరిధర్ ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడి తర్వాత మోకాళ్లపై నిలబెట్టి పవన్ కళ్యాణ్ కు బలవంతపు క్షమాపణ చెప్పించారు. జనసేన నేత కొరియర్ శ్రీను ఆధ్వర్యంలో దాడి జరిగింది. గిరిధర్ ఇంటిపక్కనే ఉన్న సతీష్ అనే దళితుడిని కూడా చితకబాది, షాపు ధ్వంసం చేశారు. గిరిధర్ ను స్టేషన్ కు తీసుకెళ్లేందుకు పోలీసులు యత్నించారు. జనసేన నేత కొరియర్ శ్రీను, జనసేన కార్యకర్తలు పోలీసులపై తిరగబడ్డారు. తమ నాయకుడిని తిడితే ఏం చేస్తున్నారంటూ పోలీసులపై కొరియర్ శ్రీను బూతులతో రెచ్చిపోయాడు. మరో ఘటనలో జన సైనికుడు తెలిసో తెలియకో తాగి పోలీసుల మీద దాడి చేస్తే అరెస్ట్ చేస్తారా? అని కొరియర్ శ్రీను పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే మాది అని, డిప్యూటీ సిఎంను అంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ వారిపై శ్రీను రెచ్చిపోయాడు.
Also Read: దేశానికి సీడ్‌హబ్
విషయం తెలుసుకుని హుటాహుటిన డిఎస్పి కార్యాలయానికి వైసిపి నేత, మాజీ మంత్రి పేర్ని నాని చేరుకున్నారు. జనసేన దాడిపై పేర్ని నాని మండిపడ్డారు. జనసేన ముసుగులో రౌడీయిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రజకుడనే చిన్న చూపుతో గిరిధర్ పై దాడి చేశారని, జనసేన ముసుగులో గూండాలను కంట్రోల్ చేయాలని పోలీసులను, జిల్లా ఎస్పిని కోరుతున్నామన్నారు. గిరిధర్, సతీషలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే నమస్కారం పెట్టలేదని పోలీసులను కొట్టే స్థితికి జనసేన కార్యకర్తలు వచ్చారని, మిగిలిన కులాలకు చెందిన వాళ్లు కూడా పవన్ ను విమర్శిస్తున్నారని, వాళ్ల మీద జన సైనికుల ఎందుకు ప్రతాపం చూపించలేకపోతున్నారని ప్రశ్నించారు. దాడి చేయడానికి బలహీనులే జనసేన కార్యకర్తలకు కనిపిస్తున్నారా? అని చురకలంటించారు.