మహబూబ్ నగర్ బ్యూరో: తెలుగు నేలనంతా హోరెత్తించిన “జంగు సైరనూదిరో జైలులో మాయన్నలు” పాటకు స్ఫూర్తినిచ్చిన పోరాటానికి నాయకత్వం వహించింది ముగ్గురు విప్లవ కారులు. 90వ దశకంలో అరెస్టయి హైదరాబాద్ జైల్లో ఉన్న అప్పటి పీపుల్స్ వార్ నాయకులు చారిత్రాత్మక పోరాటాన్ని నిర్మించారు. “రవిత్రయం” (శాఖమూరి అప్పారావు అలియాస్ రవి, పటేల్ సుధాకర్ రెడ్డి అలియాస్ సూర్యం, మోడెం బాలకృష్ణ అలియాస్ భాస్కర్) శతృ శిబిరాన్ని కూడా పోరాట కేంద్రంగా ఎలా మలచవచ్చో ఆచరణలో చూపించారు. తమ పోరాటం వల్ల దేశ వ్యాప్తంగా జైలు మాన్యువల్‌లో మార్పులు వచ్చాయి.
Also Read: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్
ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర కమిటీ వెస్ట్రన్ బ్యూరో ఇన్‌చార్జ్ మోడెం బాలకృష్ణ సహా 10 మంది మావోలు చనిపోయారు. బాలకృష్ణ మృతితో చారిత్రాత్మక జైలు పోరాటం నడిపిన నాయకత్వం అందరూ అమరులయ్యారు.
వరంగల్ జిల్లా మడికొండకు చెందిన బాలకృష్ణ ఉద్యమ ప్రస్థానం హైదరాబాద్ రాడికల్ విద్యార్థి ఉద్యమం నుండి మొదలైంది. సుల్తాన్ బజార్ ప్రభుత్వ పాఠశాలలో ఎస్.ఎస్.సి, మలక్‌పేట జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదివారు. ఆ సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో క్రియాశీలక పాత్ర పోషించాడు. 1983లో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన బాలకృష్ణను భద్రచలం ప్రాంతంలో పనిచేసే క్రమంలో 1984లో మొదటిసారి పోలీసులు అరెస్టు చేశారు. రెండు సంవత్సరాలు వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న బాలకృష్ణ విడుదల తరువాత మళ్లీ పార్టీ కార్యకలాపాల్లో భాగమయ్యారు.
1987లో మహబూబ్ నగర్‌లో పోలీసులు మరోసారి బాలకృష్ణను అరెస్టు చేశారు. ఈ సారి మూడేళ్ల పాటు ముషీరాబాద్ జైల్లో ఉన్నారు. బాలకృష్ణ విడుదల కోసం అప్పటి టిడిపి ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావును పీపుల్స్ వార్ కిడ్నాప్ చేసింది. దీంతో 1990లో రాజకీయ ఖైదీగా ఉన్న బాలకృష్ణ జైలు నుంచి విడుదలయ్యారు.
విడుదల తరువాత 1991లో మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శిగా, దక్షిణ తెలంగాణ రీజినల్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1993లో మరోసారి అరెస్టయ్యాడు. దాదాపు ఆరు సంవత్సరాలపాటు చంచల్ గూడ జైలులో ఉన్న బాలకృష్ణ 1999లో విడుదలయ్యాడు.
భాస్కర్ అలియాస్ మనోజ్, బాలన్న, రామచంద్ర పేర్లతో పనిచేసిన బాలకృష్ణ తరువాత కాలంలో మావోయిస్టు పార్టీ ఒడిశా స్టేట్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించాడు. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. నాలుగున్నర దశాబ్దాలుగా సాగుతున్న అలుపెరగని విప్లవ బాటసారి పయనం ఒడిశా – చత్తీస్ గఢ్ సరిహద్దులో అర్థాంతరంగా ముగిసింది.