కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయం చూపించండి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కేబుల్ వైర్లను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తున్నదని ఆయన విమర్శించారు. శుక్రవారం అనేక మంది కేబుల్ ఆపరేటర్లు తార్నాకలోని రాంచందర్ రావు నివాసానికి వెళ్ళి ఎదుర్కొంటున్న సమస్యను వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించకుండా కేబుల్ వైర్లను తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. దీని వల్ల ఎంతో మంది కేబుల్ ఆపరేటర్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం కేబుల ఆపరేటర్లతో చర్చించకుండానే కఠిన చర్యలకు దిగిందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నాటక తరహాలో ఆప్టిక్ ఫైబర్ లైన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని రాంచందర్ రావు ప్రభుత్వానికి సూచించారు.
Also Read: విత్తన రంగంలో పరస్పర సహకారంతో రైతులకు మేలు
ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోడి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 75 రక్తదాన శిబిరాలు నిర్వహింంచనున్నట్లు బిజెపి నూతన ప్రధాన కార్యదర్శి తూళ్ళ వీరేందర్ గౌడ్ తెలిపారు. ప్రతి శిబిరంలో 75 యూనిట్ల రక్తం దాతల నుంచి స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత 18న స్వచ్ఛ భారత్ కార్యక్రమం, 21న మారథాన్, 25న ధీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తూళ్ళ తెలిపారు.
బిజెపి ఎమ్మెల్సీ మల్క కొమురయ్య మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తాము అధికారికంగా నిర్వహించుకుంటామని చెప్పారు. 15 రోజుల పాటు నిర్వహించే సేవా పక్వాడ్ కార్యక్రమం ద్వారా సమాజం పట్ల మన బాధ్యతను ‘సేవ’ అవశ్యకతను తెలియజేయడంతో పాటు సామాజిక సేవ దృక్పథాన్ని పెంపొంచడంలో మార్గ నిర్దేశం చేస్తుందని ఆయన వివరించారు.