తెలంగాణలో జరుగుతున్న ఎంఎల్‌ఎ చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిగ్గుపడాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ‘ఇది రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్న ఓటు చోరీ కంటే దారుణమైన నేరం’ అని పేర్కొన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన ప్రక్రియలో భాగస్వామి అయినందుకు రాహుల్ గాంధీకి సిగ్గుందా…? అని ప్రశ్నించారు. తెలంగాణలో కొనసాగుతున్న ఎంఎల్‌ఎల ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అవలంబిస్తున్న విధానాలపై కెటిఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జాతీయ స్థాయిలో ‘ఓటు చోరీ’ గురించి నీతులు చెబుతున్న రాహుల్ గాంధీ, తెలంగాణలో జరుగుతున్న ‘ఎంఎల్‌ఎల చోరీ’ గురించి మాట్లాడకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. బిఆర్‌ఎస్ టికెట్లపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంఎల్‌ఎలు, ఇప్పుడు తాము పార్టీ మారలేదంటూ చేస్తున్న వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు.
Also Read: 15 నుంచి వృత్తి విద్యా కళాశాలలు నిరవధిక బంద్